ఇంకా కళ్లముందే ఆడుతున్నట్లుంది


Wed,June 19, 2019 02:12 AM

అచ్చంపేట, నమస్తే తెలంగాణ/అమ్రాబాద్ రూరల్ : నల్లమల అటవీ ప్రాంతంలో దారి తప్పిపోయి ఆచూకీ లభించని శ్రావణి తల్లిదండ్రులను నమస్తే తెలంగాణ పలకరించింది. నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల దట్టమైన అటవీప్రాంతంలోని మల్లాపూర్ చెంచుపెంటలో శ్రావణి తల్లిదండ్రులైన గురువమ్మ, గంగయ్య ఇంటికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించింది. శ్రావణి తాతయ్య చిగుర్ల లింగయ్యతోపాటు గూడెం వాసులతో మాట్లాడే ప్రయత్నం చేసింది.

ఇంటిపక్కనే ఉండే పిల్లలతో కలిసి ఆడుకునేది.. ఎక్కువగా శ్రావణితో పాటు అడవిలోకి వెళ్లి తిరిగివచ్చిన రేణి (రేణుక)అనే బాలికతో కలిసి ఉండేది.. పెంట చుట్టు చెట్లు, అడవి ఉండడంతో అప్పుడప్పుడు అడవిలోకి పండ్ల కోసం ఆడుకునేందుకు వెళ్లేవాళ్లు.. అలా అడవి అంటే మైదాన ప్రాంతం పిల్లలు బయపడతారు కాని అడవిలో నివసించే చెంచు పిల్లలు భయపడరు.. అటవీ ఉత్పత్తులు, కర్రల కోసం అడవిలోకి వెళ్లేది..రోజులాగే వెళ్లింది.. కానీ మళ్లీ తిరిగి రాలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలు..

సెలవుల్లో తాత వద్దకు వచ్చి..
ఇదిలా ఉండగా గురువమ్మ, గంగయ్య దంపతులకు ముగ్గురు పిల్లలు. అందులో శ్రావణి పెద్దకుమార్తె, చందంపేట మండలం కంబాలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. వేసవి సెలవులలో ఇంటికి వచ్చింది. శ్రావణి తల్లిదండ్రులతో కలిసి లింగాల మండలం పుల్లాయపల్లిలో అమ్మమ్మవద్ద ఉండేది. అప్పటికే వారం రోజుల క్రితమే తాత లింగయ్య వద్దకు (మల్లాపూర్ పెంట)అందరూ వచ్చారు. వచ్చిన వారం రోజుల్లో ఈ సంఘటన జరుగడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోవడం లేదు. 26రోజులు గడిచినా పాప మిస్టరి వీడకపోవడంతో కుటుంబసభ్యులు ఇంకా ఎక్కడైనా శ్రావణి జాడ దొరుకుతుందెమో అనే ఎక్కడో చిన్న మాత్రం వెంటాడుతున్నది. ప్రతిరోజు పాపను తలుచుకొని కమిలిపోతున్నారు. ఎప్పుడైనా.. పాప తిరిగివస్తుందనే ఎక్కడో చిన్న ఆశ. మరోవైపు విషసర్పాలు, ఎలుగుబంటి, అడవిపంది, చిరుతపులులకు ఏమైనా ఆహారంగా మారిందా..? అనే అనుమానాలతో కంటికి నిద్ర లేకుండా గడుపుతున్నారు. ఒకవేళ విషసర్పాలు మింగిఉంటే కనీసం వేసుకున్న బట్టలు అయిన లభించాలి..లేకపోతే ఎలుగుబంటి, చిరుతపులి చంపిఉంటే ఎక్కడున్నా చిన్నపాటి ఆధారం అయిన లభించి ఉండాలి...ఇప్పటివరకు ఏమైందో తెలుస్తలేదు.. లేకపోతే అడవిలోకి వచ్చిన వాళ్లు ఏవరైన ఎత్తుకొని బయటకు వెళ్లిపోయారా అంటూ కుటుంబసభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చెంచు పెంటలలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన ఎప్పుడు జరుగలేదని చర్చించుటుంటున్నారు. తోటి పిల్లలను చూసి తల్లిదండ్రులు శ్రావణి ఇకరాదనే చేదు నిజాన్ని నమ్మలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్లిన, ఏపని చేసినా శ్రావణి గుర్తుకువస్తుందని అంటుటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రావణి ఎలా తప్పపోయింది..
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమలలోతట్టు ప్రాతంలో ఉన్న మల్లాపుర్ చెంచుపెంటకు చెందిన తోకల రేనుక, చిగుర్ల శ్రావణి అనే చిన్నారులు గత నెల(మే)24న అనగా శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు వారి తాత మేకల మేపుటకు వెళ్తున్న సమయంలో చిన్నారులు తాత వెంట అడవిలోకి వెళ్లారు. వారు వస్తున్న విషయాన్ని గమనించిన తాత వారిని మందలించి గూడేనికి వెళ్లాలని చెప్పడంతో వెళ్తున్న క్రమంలోనే దారిని తప్పారు. శుక్రవారం మధ్యహ్నం రెండు గంటల వరకు కూడా చిన్నారులు ఇంటికి రాకపోవడంతో గూడెంలో ఉన్న తల్లిదండ్రులు వెతకడం మొదలు పెట్టారు. మొదటిరోజులు చిన్నారుల ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు మరింత ఆందోళనకు గురయ్యారు. అయితే ఇద్దరు చిన్నారులు అడవిలో దొరికే గడ్డలు, దుంపలు తినడంతో మత్తు వచ్చి మూర్చపోయి అడవిలో పడుకున్నారు. మరుసటి రోజు శనివారం.. ఉదయం తోకల రేణుకకు సృహ రావడంతో శ్రావణిని ఎంత లేపినా లేవక పోవడంతో రేనుక ఏడ్చుకుంటూ అడవిలో తిరుగుతున్న క్రమంలో అనుకోకుండా ఫరహాబాద్-అప్పాపూర్‌కు వెళ్లే రోడ్డుకు చేరుకున్నది. అప్పటికే చిన్నారుల తల్లిదండ్రులు, అటవీశాఖ సిబ్బంది వెతుకుతున్న క్రమంలో వారి కంటపడింది.

నాలుగురోజులు ఆలస్యంగా వెలుగులోకి..
చిన్నారి రేణుక తెలిసి తెలియక ఇచ్చిన సమాచారం మేరకు శ్రావణి కోసం మరింత ఆశతో వెతికినా ఆచూకీ దొరకలేదు. శ్రావణి తప్పిపోయి అప్పటికి మూడు రోజులు పూరైయింది. మీడియా ద్వారా ఐటీడీఏ పీవో ఇతర అధికారులకు ఆలస్యంగా మే27న తెలియడంతో 28న రంగంలోకి దిగారు. మే28 నుంచి 31వరకు ఐటీడీఏ, పోలీస్, ఐసీడీఎస్, ఎన్‌ఆర్‌ఈజీఎస్, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు గాలింపు చేపట్టినా చిన్నారి శ్రావణి ఆచూకీ దొరకపట్టడంలో ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు.

జూన్1న..
నాలుగురోజులు అడవిలో గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో జర్మన్ షెఫర్డ్ డాగ్ బృనా జాగీలంతో గాలించారు. రెండు రోజులు గాలించినా శ్రావణి తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది.

పాప బట్టలు చూసినప్పుడల్లా ఏడుపూ ఆగట్లేదు..
శ్రావణి కళ్లముందే ఆడుకుంటూ ఉన్నట్లు అనిపిస్తది. పాప వేసుకున్న బట్టలు చూసినప్పుడల్లా ఏడుపు ఆగడం లేదు. ఎప్పుడు తలుచుకోని ఏడుస్తున్నాను. మంచిగా చదివి నర్సు ఉద్యోగం చేస్తా అనేది. తెలివి గట్టిగా మాట్లాడేది. అన్నం తక్కువగా తినేది. వాళ్ల నాయనతో ఏది కావాలన్న అడిగి తెప్పించుకోని తినేది. ఎప్పుడైన తిడితే వాళ్ల తండ్రి వద్దకు వెళ్లి పడుకునేది. కొందరు హేళన చేస్తున్నట్లు మాకు తెలిసింది. పాపను వాళ్లే దాపెట్టుకొని పోయిందని అంటున్నారని కొందరు అప్పట్లు అనుకున్నట్లు మాకు తెలిసింది. దీంతో మరింత బాధపడుతున్నాం. పాప వేసుకునే బట్టలు, ఆమె ఫొటోలు, ఆడుకునే స్థలాలు, పిల్లలను చూసినప్పుడల్లా బాధను తట్టుకోలేకపోతున్నాను. మేము యేసు ప్రభును పూజిస్తాం. చర్చిలో ప్రార్థనలు కూడా చేశారు. అయిన లాభం లేదు. ఏమి చెయ్యాలో దిక్కు తొస్తలేదు.
- గురువమ్మ, శ్రావణి తల్లి

శ్రావణి తిరిగి వస్తదనే ఆశతో ఉన్నాము..
పాప కళ్లముందే ఉన్నట్లు అనిపిస్తోంది. చనిపోయిందనేది నేను నమ్మడం లేదు. శ్రావణి ఎప్పుడైనా తిరిగి వస్తుందనే ఆశతో ఉన్నాము. నిజంగా చనిపోయి ఉంటే ఏదైనా ఆధారం దొరికేది. పాప ఏది ఆడిగిన వటువర్లపల్లికి వెళ్లి తెచ్చి ఇచ్చే వాడ్ని. ఎక్కువగా స్వీటు, పెరుగు, బిస్కెట్లు తెప్పించుకునేది. భయపడకుండాఎవ్వరూ పిలిచిన వెళ్లేది. గట్టిగా ఉన్నది ఉన్నట్లు చెప్పేది. నా వద్దనే ఉండేది. ఏవరైనా ఎత్తుకొని వెళ్లిపోయారా అనే అనుమానం వస్తుంది. ఆరోజు రాత్రి నలుగురు గుర్తు తెలియని వాళ్లు మా పెంట దిక్కు వచ్చినట్లు కొందరు అంటున్నారు. వాళ్లే రాత్రి పూట ఎత్తుకెళ్లి ఉంటారెమో అనిపిస్తోంది. పాపను తలుచుకుని రోజు ఏడుస్తున్నాం. అడవిలోపలి వరకు లోయలు, గుట్టలు వెతికాం. అయిన దొరకలేదు. మేము పుల్లాయపల్లిలో ఉండేవాళ్లం. అంతకుముందు వారం రోజుల కిందట మల్లాపూర్‌కు వచ్చాం. పాప ఫొటో కూడా లేకుండే. పుల్లాయపల్లిలో మా పిలగాని ఫోన్‌లో ఉంటే నేను తెప్పించుకోని గుర్తుకువచ్చినప్పుడల్లా ఆమె ఫొటోను చూసుకుంటున్నా.
- గంగయ్య, శ్రావణి తండ్రి

మరో సారి గాలింపు చేపడుతాం
గత నెల 26 నుంచి సుమారు ఐదు రోజుల పాటు అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు ఆధ్వర్యంలో సుమారు 60 మందితో గాలింపు చేపట్టాం. అయినా ఎలాంటి ఆధారం దొరకలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మరో రెండు మూడు రోజుల్లో శ్రావణి ఆచూకీ కోసం గాలింపు చేసేందుకు సిద్ధం అవుతున్నాం.
- బీసన్న, అమ్రాబాద్ సీఐ

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...