నేటి బాలలే రేపటి దేశ సంపద


Tue,June 18, 2019 12:50 AM

వనపర్తి రూరల్ : తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలోని బాలలు రేపటి దేశ నవ నిర్మాణంలో ముఖ్యులుగా కానున్నరని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నాగవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీసీ బాలుర గురుకుల పాఠశాల శిలాఫలాకాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలనను మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు జేసీ వేణుగోపాల్, నూతన జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు తదితరులు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలోని విద్య వ్యవస్థను భ్రష్టుపట్టించారన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ విద్యను అందరికి సమానంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ విద్యలో సమూల మార్పులను తీసుకొచ్చి రాష్ట్రంలో గురుకుల వ్యవస్థను పటిష్ట పర్చిరాని తెలిపారు. రెండు సంవత్సరాలలో అనేక వర్గాల వారీగా వందల సంఖ్యలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారికి ఉచితంగా నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తుందని తెలిపారు.

ఈ ఏడాది రాష్ట్రంలో మరో 119 బీసీ గురుకుల పాఠశాలలను అన్ని వసతులతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి అన్ని నియోజక వర్గాలలో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పేద వర్గాల ప్రజలకు కూడా నాణ్యమైన విద్య ఒక కళగా మిగలకూడదన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. విద్యా ప్రమాణాలతో పాటు, ఉచిత పాఠ్యపుస్తాకాలు, యూనిఫామ్స్, ప్రత్యేక కోర్సుల కోసం శిక్షణ ఏర్పాట్లు, క్రీడాలలో నైపుణ్యలు పెంపొందించడం, కాక పర్వతారోహణవంటి సాహసకృత్యాలు, విదేశీ యాత్రలలో విద్యార్థులకు అవకాశం కల్పిస్తుందన్నారు. ఇన్ని అవకాశాలు కార్పొరేట్‌లలోని ఏ పాఠశాలలో లేవని, ఇన్ని అవకాశాలు కేవలం మన తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కల్పిస్తుందన్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకొని దేశ నవ నిర్మాణంలో తెలంగాణ గురుకుల విద్యార్థులు కీలక పాత్ర వహించాలని సూచించారు. సమాజంలో విద్యపట్ల అసమానతలు తొలగాలంటే చదువు ఒక్కటే మార్గమని ఆయన సూచించారు. భవిష్యతు తరాలకు తెలంగాణ నుంచి ఉత్తమలైన విద్యావేతలను అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లుతుందని పేర్కొన్నారు. నేడు తెలంగాణలోని గురుకులాలు దేశంలోని ఇతర విద్యాసంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.

రాష్ట్రంలో బాలిక చదువు పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని, వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ ఆరోగ్యకిట్లు అందిస్తుందన్నారు. గతంలో మంజూరైన బాలికల బీసీ గురుకుల పాఠశాల పెబ్బేరు మండలానికి మంజూరు కావటం జరిగిందని, అక్కడ స్థల ప్రభావం కారణం చేత నాగవరంలో ఏర్పాటు చేసుకొవటం జరిగిందని, దానిని ఈ ఏడాది పెబ్బేరులో వసతులను ఏర్పాటుచేసి అక్కడి తరలించడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది కడుకుంట్ల గ్రామానికి మరో బీసీ బాలుర గురుకుల పాఠశాల మంజూరు చేయించడం జరిగిందని, అక్కడ కూడా స్థల ప్రభావం వల్ల ఇక్కడ ఏర్పాటు చేసుకొవటం జరిగిందని మంత్రి తెలిపారు. త్వరలోనే కడుకుంట్ల గ్రామంలో ప్రభుత్వ స్థల పరిశీలన చేసి నూతన భవనానికి శంకుస్థాపన చేసుకుందామన్నారు. అంతకుముందు జేసీ వేణుగోపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు, బీసీ గురుకుల పాఠశాలల కన్వీనర్ వెంకటేశ్వర్ రెడ్డి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకోసం గురుకులాల ద్వారా అనేక వసతులను కల్పిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికి బీసీ గురుకుల సిబ్బంది, విద్యార్థులు బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. అలాగే కడుకుంట్ల, నాగవరం టీఆర్‌ఎస్ నాయకులు, సర్పంచ్ హరిత, ఎంపీటీసీ సువర్ణలు పూలమాలాలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపాల్ చైర్మన్ రమేష్ గౌడ్, ఎంపీపీ శంకర్‌నాయక్, నూతన ఎంపీపీ కిచ్చారెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర డబుల్ బెడ్‌రూంల హౌసింగ్ చైర్మన్ భూరెడ్డి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా చైర్మన్ కురుమూర్తి యాదవ్, ఎంపీటీసీ నారమ్మ, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ బొజ్జ య్య, ఆయా గ్రామాల టీఆర్‌ఎస్ నాయకులు, వనపర్తి వార్డు కౌన్సిలర్స్, ప్రజలు, గురుకుల పాఠశాల సిబ్బం ది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని ధర్మాపూర్ గ్రామంలో మన్యంకొండ బీసీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చదువుతోనే ఉన్నత స్థానానికి వెళ్లవచ్చని, మహిళల చదువులకు మూల కారణం జ్యోతిబాయి ఫూలే మొట్టమొదట ఉపాధ్యాయురాలిగా ఆమె మహిళలకు అక్షరాలు నేర్పించారని, ఆమెను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు కష్టపడి చదివి తమ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఒకప్పుడు హాస్టళ్లలో చదవాలంటే పిల్లలు పారిపోయే వారని హాస్టళ్లలో వసతులు లేక చాలిచాలని తిండితో గతిలేక హాస్టళ్లలో ఉండి చదువుకునే వారని ఇంటి వద్ద చదివించే స్థోమత లేని విద్యార్థులు కష్టపడి చదువుకునే వారని గుర్తు చేశారు.

నేడు తెలంగాణ ఏర్పాడ్డాక రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా తామే హాస్టల్ విద్యార్థులకు ఎలాంటి భోజనం అందించాలని మెనూను తయారు చేశారని, నెలకు 2సార్లు మేక మాంసం, నాలుగుసార్లు కోడి మాంసం, రోజు గుడ్డు, పప్పు, సాంబర్, ఉదయం అల్పాహరం, పండ్లు, రాగి జావా వంటి ఎంతో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు స్పోర్ట్స్‌లో రాణించాలన్నారు. జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయిలో గురుకుల విద్యార్థులు ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారని, కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని పేర్కొన్నారు. చదువు ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదివి తాము అనుకున్న లక్ష్యాలను చేరాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, ఎంపీపీ సావిత్రి, సుధాశ్రీ, జెడ్పీటీసీ శ్రీదేవి, జెడ్పీ కోఆప్షన్ మెంబరు అల్లావుద్దీన్, రైతు సమన్వయ సమితి డైరెక్టర్ మల్లు నర్సింహరెడ్డి, ఎంపీటీసీలు, మణెమ్మ, రవీందర్‌రెడ్డి, బీసీ గురుకుల ప్రిన్సిపాల్ కృష్ణకుమార్, కోఆర్డినేటర్, సర్పంచులు యుగందర్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, ఆంజనేయులు, నాయకులు రవీందర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...