చెక్కు పవరొచ్చింది


Mon,June 17, 2019 03:25 AM

-సర్పంచ్, ఉప సర్పంచులకు చెక్ పవర్
-సర్పంచ్, కార్యదర్శులచే ఆడిటింగ్
-ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
-నేటి నుంచి నూతన చట్టం అమలు
-హర్షం వ్యక్తం చేస్తున్న డిప్యూటీలు
-ఇక పల్లె పాలనకు పరుగులు
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులకు ప్రభుత్వం కల్పించిన చెక్ పవర్ అధికారాలు సోమవారం నుంచి అమల్లోకి రాబోతున్నాయి. గతంలో సర్పంచ్, పంచాయితీ కార్యదర్శుల పేరిట ఉన్న చెక్‌పవర్ నూతన పంచాయితీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచులకు దక్కాయి. ఎన్నికల నిభందనలు, తదితర కారణాలతో సర్పంచులు ఎన్నికలు జరిగి ఐదు నెలలు దాటినా అమలు కాలేకపోయాయి. అన్ని ఎన్నికలు ముగిసి కోడ్ ముగియడంతో ప్రభుత్వం సర్పంచులు, ఉప సర్పంచులకు చెక్‌పవర్‌ను కల్పించేందుకు తీసుకున్న నిర్ణయాలు అమలు కాబోతున్నాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో కలిపి మొత్తం 721 గ్రామ పంచాయతీల పరిధిలోని ఉప సర్పంచులు ఇకపై చెక్ పవర్‌తో తమ పవర్‌ను చూపించనున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సంయుక్త చెక్ పవర్‌తో గ్రామాల్లో అభివృద్ధికి బాటలు పడనున్నాయి. పంచాయతీరాజ్ చట్టం-2018లోని చెక్ పవర్‌కు సంబంధించి సెక్షన్లను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకా రం గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరికీ చెక్ పవర్ లభిస్తుంది. సోమవారం నుంచి చెక్ పవర్ అమల్లోకి వ స్తోంది. ఇకపై తమ పదవి అలంకార ప్రాయంకాదని.. తాము గ్రామాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తామని ఉప సర్పంచులు పేర్కొంటున్నారు. తమ ను ఇన్నాళ్లకు గుర్తించిన సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి డిఫ్యూటీలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

మాకూ పవరొచ్చింది
ఇన్నాళ్లు ఉప సర్పంచ్ పదవి అంటే కేవలం అలంకార ప్రాయంగా ఉండేది. మెజార్టీ వార్డు మెంబర్లు కలిసి ఉప సర్పంచును ఎన్నుకునే వారు. ఎన్నికలప్పుడు ఉప సర్పంచుగా గెలిచామనే సంతోషం తప్పించి వారికి ఎలాంటి అదనపు బాధ్యతలు ఉండేవి కావు. గ్రామ పంచాయతీ సమావేశాల్లో అందరూ వార్డు మెంబర్ల మాదిరిగానే ఉప సర్పంచ్ కూడా హాజరయ్యే వాడు. కానీ అంతకు మించి ప్రత్యేకంగా ఎలాంటి అధికారాలు ఉండేవి కావు. అయితే కాలం చెల్లిన పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చి సీఎం కేసీఆర్ కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఎంతో మదనం చేసిన తర్వాత ఈ చట్టానికి తుది రూపునిచ్చారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పొందుపర్చిన ప్రకారం గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికి ఉప సర్పంచును సైతం బాధ్యున్ని చేశారు. గతంలో సర్పంచుకు మాత్రమే ఉన్న చెక్ పవర్‌ను తొలిసారిగా ఉప సర్పంచ్‌కు కూడా కల్పించారు. దీంతో గ్రామ పాలన పారదర్శకంగా జరిగేందుకు అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో అక్కడక్కడ జరిగే అవినీతికి ఈ కొత్త నిబంధనల వల్ల చెక్ పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్ర
ఇన్నాళ్లు పంచాయతీ ఎన్నికలు ముగిశాక ఉప సర్పంచులు కీలకంగా వ్యవహరించే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు సర్పంచ్‌తో కలిసి సంయుక్త చెక్‌పవర్ ఇవ్వడంతో గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని ఉప సర్పంచులు అంటున్నారు. ఇకపై గ్రామ పంచాయతీల్లో క్రమం తప్పకుండా జరిగే గ్రామ సభలు, ప్రత్యేక సమావేశాల్లో పాల్గొంటామని చెబుతున్నారు. ఇకపై నిధుల దుర్వినియోగం కాకుండా గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటామంటున్నారు. ఇన్నాళ్లు చెక్ పవర్ రాలేదని, గ్రామ పంచాయతీల్లో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని ఆవేదన చెందిన సర్పంచులకు చెక్ పవర్‌తో ఊరట కలిగిందని చెప్పొచ్చు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...