బీసీ విద్యార్థులకు..బంగారు భవిష్యత్‌


Sun,June 16, 2019 03:27 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : గురుకులాల్లో కార్పొరేట్‌ స్థాయికి మించి పేద విద్యార్థులకు విద్యాభ్యాసం అందించాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. ప్రధానంగా బీసీ విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలన్న లక్ష్యంతో గురుకులాలను విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని రీతిలో తెలంగాణలో బీసీ విద్యార్థులకు గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జిల్లా పరిధిలో గతంలో రెండు బీసీ గురుకులాలుంటే, ఒక జూనియర్‌ కళాశాల కూడా కొనసాగుతుంది. వీటిలో చిట్యాల, పెబ్బేరులలో బీసీ గురకులాలుండగా, జూనియర్‌ కళాశాల కూడా చిట్యాల గురుకులంలో కొనసాగుంది.

1350 మందికి పైగా విద్యార్థులు
జిల్లాలోని బీసీ గురుకుల పాఠశాలల్లో దాదాపు 1050 మంది విద్యార్థులకు గురుకులాల్లో విద్యాభ్యాసం అందుతుంది. చిట్యాల గురుకులంలో 400 మంది విద్యార్థులుంటే, పెబ్బేరు బాలికల గురుకులంలో 400 మంది 5వ తరగతి నుంచి 6 తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తున్నారు. అలాగే చిట్యాల గురుకుల జూనియర్‌ కళాశాలలో నాలుగు గ్రూపుల వారీగా 320 మంది బాలు ర విద్యార్థులు ఉన్నారు. ఇక కొత్తగా ఈ ఏడాది నాగవరంలో సోమవారం ప్రారంభమవుతున్న గురుకులంలో 5, 6, 7 తరగతుల వారీగా 240 మంది విద్యార్థులకు అవకాశం లభించింది. ఇలా మొత్తం మూడు గురుకులాలు, ఒక జూనియర్‌ కళాశాలలో 1360 మంది బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తున్నది.

ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష ఖర్చు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ గురుకులాల్లో ఒక్కొక్క విద్యార్థిపై లక్ష రూపాయల వరకు విద్య కోసం ఖర్చు చేస్తుంది. పేద విద్యార్థులుండే గురుకులాలను పక్కగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ పట్టుదలతో ఉన్నారు. సమైక్య పాలనలో పడకేసిన సర్కార్‌ విద్యను కొత్త రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో అనూహ్యమైన మార్పులతో నేడు ప్రభుత్వా గురుకులాలను ఆదర్శంగా ఏర్పాటు చేశారు. కార్పొరేట్‌ స్థాయిలో విద్యార్థులకు వసతులు సమకూర్చి నాణ్యమైన భోజనం, విద్య, ఆరోగ్యం తదితరాలను అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ పరిస్థితిలో నేడు గురుకులాల్లో సీట్ల కోసం విద్యార్థులు ఎగబడుతున్నారంటే.. నేటి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే దర్పణం పడుతున్నాయి. మొక్కుబడి విద్యాలయాలు కాకుండా పక్కాబడి అన్న తరహలో దేనికి తీసిపోకుండా కార్పొరేట్‌కు మించి నేడు రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు దేశంలోనే ఓ వెలుగు వెలుగుతున్నాయి. ఇలా ఒక్క పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ఏడాదికి లక్ష రూపాయలకు పైబడి ఖర్చు చేసి నాణ్యమైన విద్య అందిస్తుండటంతో భవిష్యత్‌లో నాణ్యమైన విద్యకు తెలంగాణలో పునాది పడింది.

పౌష్టికాహారంతో పక్కా మెనూ
కార్పొరేట్‌కు మించి ప్రభుత్వ గురుకులాల్లో పౌష్టికాహారంతో కూడిన మెనూను అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజు ఉదయం బూస్ట్‌తో పాలు, మధ్యాహ్నం భోజనంలో ఆకుకూరలతో పప్పు, మరో కూరగాయ, సాంబర్‌, చెట్ని, నెయ్యిలతోపాటు పెరుగు, ప్రతిరోజు గుడ్డును అందజేస్తున్నారు. అలాగే రాత్రి భోజనంలోను కూరగాయతోపాటు రసం, మజ్జిగ, సీజన్‌ వారి పండును అందింస్తూ పేద విద్యార్థుల్లో పౌష్టికాహార సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలను ప్రభుత్వం తీసుకుంది. నెలలో 6 రోజులు మటన్‌ను విద్యార్థులకు అందించే విధంగా మెనూను సర్కార్‌ ఏర్పాటు చేసింది. అయితే, గురుకులాల్లో తెల్లవారుజామున ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు టైం టేబుల్‌ను ప్రత్యేకంగా రూపొందించగా, అదే ప్రకారం ప్రతి రోజు కొనసాగుతాయి.

ప్రామాణికాలతో బోధన
గురుకులాల్లో ప్రామాణికాలతో కూడిన బోధనలను విద్యార్థులకు అందిస్తున్నారు. ఇంగ్లీష్‌ మీడియంలో పట్టు సాధించేందుకు ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారు. కల్చరల్‌, క్రీడలు, కంప్యూటర్స్‌లపై శిక్షణలను విధిగా అందిస్తున్నారు. ఇక్కడ చదువుకునే ప్రతి విద్యార్థికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌లోను శిక్షణ ఇస్తున్నారు. జాతీయ సమైక్యతా భావంతో ఏర్పాటు చేసిన ఈ గురుకులాల్లో విద్యతోపాటు మానవతా విలువలు పెంపొందించే దిశగా అడుగులు పడుతున్నాయి. నాణ్యమైన విద్యతోపాటు నాణ్యమైన భోజనం మొదలుకుని విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వమే అందజేస్తుంది.

రేపు మంత్రి నిరంజన్‌రెడ్డిచే ప్రారంభం
నూతనంగా ప్రతి అసెంబ్లీకి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్న బీసీ గురుకుల పాఠశాలను ప్రభుత్వం వనపర్తి మండల పరిధిలోని కడుకుంట్ల గ్రామానికి మంజూరు చేసింది. అయితే, అక్కడ భవనం.. వసతులు లేని కారణంగా ఈ గురుకులంను తాత్కాలికంగా నాగవరంలో ఏర్పాటు చేస్తున్నారు. గతంలో పెబ్బేరు బీసీ బాలికల గురుకులంను ఇక్కడే ఏర్పాటు చేసి కొనసాగించారు. అయితే, ఈ ఏడాది ఆ గురుకులంను పెబ్బేరులోనే కొనసాగించాలని నిర్ణయించడంతో అదే భవనంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న గురుకులాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి చేతుల మీదుగా సోమవారం ప్రారంభోత్సవం చేయనున్నారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న గురుకులంలోను మూడు తరగతుల వారీగా విద్యార్థుల అడ్మిషన్లు పూర్తి అయ్యాయి. ఎంట్రన్స్‌ మెరిట్‌ ఆధారంగా సీట్ల భర్తి జరిగింది.

మంచి భవిష్యత్‌
బీసీ గురుకులాల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన పునాది పడుతుంది. భవిష్యత్‌లో ఈ గురుకులాల్లో చదివిన బాల, బాలికలు ఉన్నత చదువుల్లో రాణిస్తారు. ఇక్కడ ఐదో తరగతిలో చేరుతున్న విద్యార్థులకు ఇంటర్‌ వరకు విద్యతోపాటు నైపుణ్యాభివృద్ధి విషయాలపైన అవగాహన కల్పిస్తున్నాం. అలాగే ఇంగ్లీష్‌ పైనా ప్రత్యేక తరగతులు, ఇంటర్‌ వరకు చదివే విద్యార్థికి పూర్తి స్థాయి అవగాహన కల్గిస్తాం. క్రమ శిక్షణతో కూడిన విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపట్ల విద్యార్థులకు పూర్తి స్థాయి అవగాహన కల్గిస్తాం.
- పి.వెంకటేశ్వ రెడ్డి, బీసీ గురుకుల జిల్లా కన్వీనర్‌, వనపర్తి
అన్ని ఏర్పాట్లు చేశాం..
నూతనంగా ఏర్పాటు చేస్తున్న గురుకులాల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులకు అవసరమైన బోధనా గదులు, డార్మెటరి, బాత్‌రూంల వసతులు సిద్ధంగా ఉన్నాయి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో బీసీ గురుకులాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. గతంలో ఇక్కడ పెబ్బేరు గురుకులం కొనసాగిన భవణంలోనే ఇప్పుడు నూతన గురుకులంను ఏర్పాటు చేస్తున్నాం. నూతనంగా అవసరమైన ఆదనపు వసతులను ఏర్పాటు చేశాంచేశాం.
- బొజ్జయ్య, ఎస్‌వో, గురుకుల పాఠశాల, నాగవరం

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...