ఉపాధికి ఊతం


Sun,June 16, 2019 03:25 AM

వనపర్తి రూరల్‌: గ్రామీణ ప్రాంత కూలీలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుంది. ఎక్కువ పనిదినాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఉపాధి హామీ పథకం మరింత విస్తరించేందుకు గ్రామీణాభివృద్ధ్ది శాఖ కృషి చేస్తుంది. ఈ పథకాన్ని పంచాయతీలకు అనుసంధానం చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సర్కులర్‌ విడుదలైంది. ఎన్నికల కోడ్‌తో అమలు నిలిచిపోయింది. త్వరలోనే ఈ పక్రియను పూర్తి చేసేందకు యంత్రాంగం సిద్ధ్దమవుతుంది. అందులో భాగంగా గ్రామ పంచాయతీలో క్షేత్ర సహాయకుడికి స్థానం కల్పించనున్నది. సర్పంచ్‌, కార్యదర్శి ఉపాధి పథకం అమలును పర్యవేక్షించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులతోపాటు డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణానికి ఉపాధి నిధులు ఉపయోగించనుంది. అదేవిధంగా ఇంకుడు గుంతలు తవ్వకంతోపాటు గ్రామంలోని చెత్తను తరలించే పనులను చేపట్టనుంది.

పంచాయతీ పాలకవర్గాలకు బాధ్యతలు
గ్రామ పరిధిలో చేపట్టే అంతర్గత రహదారులు, బీడు భూముల అభివృద్ధి, పంట కాల్వల నిర్మాణం, వంటగదుల, పశువుల పాకలు, చెక్‌ డ్యామ్‌లు, భూమిని చదును చేయడం వేసవిలో పశువుల దాహార్తి తీర్చే నీటి తోట్లు, మరుగుదొడ్లు, వ్యవసాయ రోడ్లు, సీసీరోడ్ల నిర్మాణం వంటి పనులపై పంచాయతీ పాలక వర్గాలకు పూర్తిస్థాయిలో అధికారాలు, బాధ్యతలు దక్కనున్నాయి. ఉపాధి పథకంలో అక్కడక్కడ క్షేత్ర సహాయకులు బాధ్యతారాహిత్యం కనబరుస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. పంచాయతీలతో అనుసంధానం చేయడం వల్ల జవాబుదారీతనం పెరిగే అవకాశం ఉంది. దీంతో గ్రామాల్లో కూలీలకు సరిపడా పనులు కల్పించే అవకాశం ఉంది. ఇకనుంచి సర్పంచ్‌ పర్యవేక్షణలో ఉపాధి పనులు చేపట్టే అవకాశం ఉండటంతో కూలీలకు మరిన్ని ఎక్కవ రోజులు పనులు లభిస్తాయి.

బాధ్యతలకే పరిమితమైన మండల పరిషత్‌లు..
గతంలో ఉపాధి హామీ పనుల గుర్తింపు పనులను చేపట్టడం పర్యవేక్షణ అంతా మండల పరిషత్‌లకే ఉండేది. క్షేత్ర సహాయకుడు గ్రామంలో గుర్తించిన పనులకే నామమాత్రంగా గ్రామసభ ఆమోదం పొందినట్లు దస్ర్తాల్లో పొందుపర్చి పనులు చేపట్టేవారు. పంచాయతీ పాలకవర్గాలకు పనులను ఎంపిక చేసే అధికారం లేక పోవడంతో గందరగోళం నెలకొనేది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు మండల పరిషత్‌లు కేవలం పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతాయి. పనుల గుర్తింపు, చేపట్టిన వాటిని పూర్తి చేయడం తదితరాలను చేపట్టనున్నాయి.
క్షేత్ర సహాయకులకు స్థానం
ఉపాధి హామీ పనులను గ్రామస్థాయిలో చేపట్టే క్షేత్ర సహాయకులు పంచాయతీ పాలకవర్గంలో భాగంగా మారనున్నారు. ఇకపై క్షేత్ర సహాయకుడికి పంచాయతీ కార్యాలయంలో ఒక కుర్చి, టేబుల్‌, బీరువా, కేటాయిస్తారు. రోజువారీగా కార్యాలయంలో తనకు కేటాయించిన స్థానంలో కూర్చొని పనిచేయాలి. సహాయకుడు నిర్వహించే దస్ర్తాలన్నింటిని కార్యాలయంలోనే భద్రపరచాలి. సర్పంచ్‌, కార్యదర్శి ఉపాధి హామీ పనుల దస్ర్తాలను ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు. గతంలో వాటిని డీఆర్డీఏ అధికారులు మాత్రమే పరిశీలించే వారు. వారు ఇకపై పంచాయతీ, మండల పరిషత్‌కు ఏక కాలంలో జవాబుదారీగా ఉంటారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...