ప్రజల భద్రత కోసమే కార్డన్‌ సెర్చ


Sun,June 16, 2019 03:25 AM

వనపర్తి విద్యావిభాగం : ప్రజలకు భద్రత, భరోసా కల్పించడం కోసమే కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అపూర్వరావు అన్నారు. శనివారం ఉదయం పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్‌లో ఇంటింటా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు, యువతను అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేలా చేస్తున్న అరాచక శక్తులను గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దాదాపు 350 ఇళ్లల్లో తనిఖీలు చేపట్టామన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను స్వాధీనం చేసుకుని పట్టణ పోలీస్‌ ఠాణాకు తరలించామన్నారు. స్థానిక పోలీసుల పనితీరుపై కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. అవగాహన లేని మైనర్లకు వాహనాలు ఇస్తే అతివేగంగా నడిపి ప్రమాదాలబారిన పడుతున్నారని, పోలీసుల తనిఖీలో పట్టుబడితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. టెన్త్‌, ఇంటర్‌ చదివే విద్యార్థులు, యువకులు మద్యం, గంజాయి, గుట్కా లు, డ్రగ్స్‌ సేవించడం లాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. మరికొంత మంది మత్తు పదార్థాలకు బానిసలై నేరాలకు పాల్పడుతున్నారని, అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి సారించి వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.

చెడు మార్గంలో వెళ్లకుండా మంచిగా చదివించి ప్రయోజకులను చేయించి కన్నవారికి, ఉన్న ఊరికి పేరు తెచ్చేలా చూడాలని కోరారు. యువత చెడు మార్గంలో వెళ్తున్నట్లు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని, కార్డన్‌సెర్చ్‌ సమయంలో కూ డా ప్రజలు సహకరిస్తే నేరాల నియంత్రణ జరుగుతుందన్నారు. బ్లూకోట్‌ సిబ్బంది కాలనీలో 24 గంటల పాటు పెట్రోలింగ్‌ కొనసాగించడం చేస్తున్నారని, ముఖ్యంగా కాలనీల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడంతో పాత నేరస్తుల సమాచారం సేకరించడం చేస్తారని అన్నారు. నేరస్తులను గుర్తించేందుకు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించడం జరుగుతుందని, అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్‌ ప్రింట్స్‌ తీసుకోవడం జరిగిందని చెప్పారు. కాలనీలో ఎవ్వరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, ఎక్కడికక్కడ కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని సూచించారు. ధ్రువపత్రాలను చూపించి సీజ్‌ చేసిన వాహనాలను తీసుకెళ్లాలని అన్నారు. తనిఖీలో డీఎస్పీ సృజన, సీఐలు సూర్యనాయక్‌, ఎస్‌ఐలు వెంకటేష్‌గౌడ్‌, జగన్‌, తిరుపాజీ, ప్రొహిబిషన్‌ ఎస్‌ఐలు, 106 మంది పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...