వానాకాలం సాగుకు సిద్ధం


Sat,June 15, 2019 12:36 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : వానాకాలం సేద్యం పనులు మొదలవుతున్న వేళ అందుకు అవసరమైన ఏర్పాట్లను చేయడంలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. ఎరువులు, విత్తనాల ప్రణాళికలను సిద్ధం చేసి వాటిని రైతులకు అందుబాటులో ఉంచే చర్యలను సహితం జిల్లా యంత్రాంగం చేపడుతుంది. అవసరమైన వంగడాలు, ఎరువులను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జిల్లాలో వచ్చే వానాకాలం సీజన్ యాక్షన్ ప్లాన్‌ను వ్యవశాయ శాఖ సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లాలో 2,01,464 ఎకరాల్లో పైర్లను సాగు చేస్తారని వ్యవసాయ శాఖ నివేదిక తయారు చేసింది. అయితే, వర్షాల ప్రభావం వానాకాలం సేద్యానికి అనుకూలంగా ఉంటే.. సాగుబడుల అంచనా మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంచనా ఉంది. ఈ మేరకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకోవడంలో అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పుడిప్పుడే వర్షాల తాకిడి మొదలవుతున్న వేళ అన్ని జాగ్రత్తలను తీసుకుని రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందించే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటుంది.

22,344 క్వింటాళ్ల విత్తనాలు..
జిల్లా వ్యాప్థంగా రైతులు సాగు చేసే వివిధ రకాల విత్తనాల కోసం వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు 22,344 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు అందించేందుకు సిద్ధమైంది. వీటిలో ప్రధానంగా 19,695 క్వింటాళ్ల వరి విత్తనాలు (ఐదు రకాలు), మొక్కజొన్న వెయ్యి క్వింటాళ్లు, కందులు 150 క్వింటాళ్లు, జొన్న 50 క్వింటాళ్లు, పెసర 82 క్వింటాళ్లు, వేరుశనగ 100 క్వింటాళ్లు, ఆముదం 200 క్వింటాళ్లు, 67 క్వింటాళ్ల ఉలవలు, దహించా 2 వేల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీలపై అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం కూడా వ్యవసాయ పరంగా రైతులకు అవసరమైన వ్యవహారాలలో ముందస్తుగా ఉండాలని సూచిస్తుండటంతో అందుకనుగుణంగా అధికారులు కూడా రైతులకు అవసరమైన నివేదికలు రూపొందించి కేటాయింపులు చేస్తున్నారు.

56వేల మెట్రిక్ టన్నుల ఎరువులు
వానాకాలం సీజన్ కోసం జిల్లా వ్యాప్థంగా వివిధ రకాలకు చెందిన 56,745 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వీటిలో ప్రధానంగా యూరియా 25,216 మెట్రిక్ టన్నులు, డీఏపీ 10,356 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ(పొటాష్) 3291 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ(సూపర్) 1278 మెట్రిక్ టన్నులు, ఇతర కాంప్లెక్స్ ఎరువులు 16,603 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా ఉంది. ఈ మేరకు నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ పంపి కేటాయింపులను సిద్ధం చేసుకుంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే యూరియా 2423 టన్నులు, ఎస్‌ఎస్‌పీ 226 టన్నులు, డీఏపీ 371 టన్నులు, ఎంవోపీ 256 టన్నులు, ఇతర కాంప్లెక్స్ ఎరువులు 2521 మెట్రిక్ టన్నులు సిద్ధంగా ఉండగా మొత్తం 5799 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలో నిలువ ఉన్నాయి.

జిల్లాలో వర్షపు జల్లులు
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జూన్ మాసంలో చిరు జల్లులు పడ్డాయి. కొన్ని చోట్ల పదునుపాటు వర్షం పడితే.. మరికొన్ని చోట్ల సాధారణంగానే వర్షం పడింది. దుక్కులు దున్నడం.. పొలాలను సాగుకు సిద్ధం చేసుకునే పనులకు శ్రీకారం చుట్టారు. ఎండాకాలంలోనే పొలాలను శుభ్రం చేసుకున్న రైతులు మరొ దఫాగా పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని పెబ్బేరు, గోపాలపేట, పాన్‌గల్, పెద్దమందడి, కొత్తకోట, రేవల్లి, మదనాపురం, వీపనగండ్ల మండలాల్లో దుక్కులు దున్నుకునేందుకు అనువైన వర్షాలు రావడంతో రైతులు సేద్యం పనుల్లో నిమగ్నమయ్యారు.

రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం బట్టి ఏ పంట వేయాలి.. ఎంచుకున్న పంటలో ఏ రకాన్ని ఎంపిక చేసుకోవాలనే విషయంపై వ్యవసాయ అధికారులు, సీనియర్ రైతుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.
-భూసార పరీక్షల రిపోర్టును పరిగణలోకి తీసుకోవాలి.
-వ్యవసాయ శాఖ జారీ చేసిన విత్తన లైసెన్స్ గల దుకాణాల్లోనే ఎరువులు.. విత్తనాలు కొనాలి.
-కొనుగోలు చేసిన విత్తనాల వివరాలతో కూడిన కచ్చితమైన రశీదును పొందాలి.
-విత్తనాల బస్తాపై ఏ రకం విత్తనం.. మొలక శాతం, జన్యు స్వచ్ఛత, సీల్ చేసిన తేదీ వంటి వివరాలను పరిశీలించుకోవాలి.
-విత్తనాలు.. ఎరువుల బస్తాలపై కంపెనీ పేరు, ఐఎస్‌ఐ నాణ్యత, విత్తనాల నిల్వ ఉండే తేదీ విరివిగా ఉంటేనే తీసుకోవాలి.
-వ్యవసాయ శాఖ లేదా గుర్తింపు పొందిన పరిశోదనా సంస్థ ద్వారా ధ్రువీకరంచిన విత్తనాలను తీసుకొవాలి.
-విత్తనాలు, ఎరువుల బస్తాల తూకం సరిగా ఉందో.. లేదో చూసుకోవాలి.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...