కందనూలు కారు జోరు..


Fri,May 24, 2019 04:38 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి తొలిసారి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పోతుగంటి రాములు భారీ మెజార్టీతో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. దాదాపు 1,85,652 లక్షల మెజార్టీని అందుకున్న రాములు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థాయిలో మరోమైలు రాయిని అందుకున్నారు. ఎన్నికల ముందు నుంచి ఊహించినట్లుగా భారీ మెజార్టీ ఖాయమన్న తరహాలో నేటి రాములు గె లుపు కొత్త చరిత్రకు నాందిగా నిలుస్తుంది. గురువారం నాగర్‌కర్నూల్‌లో కొనసాగిన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌లోని సుమారు 19 రౌండ్ల వారీగా టీఆర్‌ఎస్ అభ్యర్థికి మెజార్టీ రావడం ఆసక్తికరంగా నిలిచింది.

ప్రతి అసెంబ్లీ వారీగా మెజార్టీలు..
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, వనప ర్తి, గద్వాల, అలంపూర్ మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే, ఈ ఏడు అసెంబ్లీల వారీగాను పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మెజార్టీ ఓట్లు వచ్చాయి. కొన్ని అసెంబ్లీల పరిధిలో గతంలో కంటే ఎక్కువ ఓట్లు వస్తే.. మరికొన్ని అసెంబ్లీల వారీగా కొన్ని ఓట్లు టీఆర్‌ఎస్‌కు తగ్గాయి. అయితే, గద్వాల నియోజకవర్గ స్థాయి లో ఎంపీ అభ్యర్థికి దాదాపు 48 వేలపై చిలుకు మెజార్టీతో ముందు వరసలో నిలిచింది. అలాగే అలంపూర్ నియోజకవర్గం నుంచి 12వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో చివరి మెజార్టీ స్థానాన్ని పొందింది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో చూస్తే.. కల్వకుర్తి 29,587 ఓట్లు, వనపర్తి 27,441 ఓట్లు, అచ్చంపేట 27,109 ఓట్లు, కొల్లాపూర్ 24,952 ఓట్లు, అలంపూర్ 14,487 ఓట్ల మెజార్టీలను రా ములుకు అందించాయి. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ మెజార్టీ వచ్చిన స్థానాల్లో ఎంపీ ఎన్నికల్లో మెజార్టీలు పెరగడం.. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మె జార్టీలు వచ్చిన స్థానాల్లో ఎంపీకి తక్కువ మెజార్టీలు వచ్చాయి.

ప్రాజెక్టుల నీటితోనే పట్టం..
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కొత్త రాష్ట్ర ఏర్పాటు అనంతరం భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా వ్యవసాయంలో పెద్ద ఎ త్తున మార్పులొచ్చాయి. ఇందుకు ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టును వినియోగంలోకి తేవడమే టీఆర్‌ఎస్‌కు బలం చేకూర్చింది. దీంతోపాటు బీమా ప్రాజెక్టును సైతం వినియోగంలోకి తెచ్చి సాగునీరందించడంతో ప్రజలు గులాబీ జెండా కిందికి చేరేలా చేసింది. ఈ పార్లమెంట్ పరిధిలోని కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, అలంపూర్ నియోజకవర్గాలకు కొత్త రాష్ట్రంలో ప్రాజెక్టుల నీటిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించింది. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంను చేపట్టి కేవలం 10నెలల వ్యవధిలో సాగునీటిని అందించడంలాంటివి టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చే అంశాలుగా నిలుస్తున్నాయి. గద్వాల నియోజకవర్గ పరిధిలోనూ నెట్టెంపాడు ప్రాజెక్టును అందుబాటులోకి తేవడం.. అలాగే గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడంలాంటివన్ని సాగుబడులకు ప్రాధాన్యతనిచ్చే అంశాలుగా నిలువడంతో ఓటర్లు టీఆర్‌ఎస్ వైపు అండగా నిలుస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వెరసి ఇక్కడ జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోను గులాబీ జెండాకు ఓటర్లు అండగా నిలుస్తున్నారు.

పట్టునిలుపుకున్న మంత్రి సింగిరెడ్డి, ఎమ్మెల్యేలు
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయాన్ని అక్షర సత్యం చేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, గువ్వల బాలరాజు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, వీఎం అబ్ర హం తమ పట్టును నిలుపుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి పట్టుదలగా పని చేశారు. లోకసభ ఎన్నికల సందర్బంగా ఉమ్మడి జిల్లా వేదికగా సీఎం కేసీఆర్ పాల్గొన్న నాగవరం సభలోనూ మంత్రి సింగిరెడ్డితో సహా ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మ న్ పోతుగంటి రాములు గెలుపునకు బీజం వేశా రు. వెరసి ఇంతకాలం గులాబీ జెండాఎగరని నా గర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానంపై గులా బీ జెండా ఎగురవేసి గత చరిత్రకు చరమగీతం పాడారు.

గతంలో పోటీ చేసినా..
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానానికి టీఆర్‌ఎస్ గతంలో నుంచి పోటీ చేస్తూ వస్తున్నది. ఇప్పటి వరకు మూడు పర్యాయాలు టీఆర్‌ఎస్ ఎంపీ స్థానంలో పోటీ చేసింది. తెలంగాణ ఏర్పడక ముందు 2009పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పోటీ చేసింది. నాగర్‌కర్నూల్ నుంచి గువ్వల బాలరాజు ఎంపీగా పోటీ చేసి విజయాన్ని అందుకోలేక పోయారు .అయితే, టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన గువ్వలకు అప్పట్లోనే 3,74,978 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మందా జగన్నాథం 47,767 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. ఇక రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి డాక్టర్ మందా జగన్నాదం పోటీ చేసినా ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నంది ఎల్లయ్య 16,676 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇలా రెండు పర్యాయాలు ఓటమి చెందిన టీఆర్‌ఎస్ నేడు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కందనూలుపై 1,89,445 ఓట్ల మెజార్టీతో గులాబీ జెండాను ఎగరవేసింది. కాగా, మొత్తం 9,87,523 ఓట్లు పోలైతే, టీఆర్‌ఎస్‌కు 4,98,567 ఓట్లు రాగా, కాంగ్రెస్ 3,09,122 ఓటత్లో రెండో స్థానంలో నిలిచింది.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...