నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం


Thu,May 23, 2019 02:13 AM

వనపర్తి విద్యావిభాగం: నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన రసాయన మందుల విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ అపూర్వరావు అన్నారు. బుధవారం ఎస్పీ సమావేశ మందిరంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కాపాడేందుకు పోలీస్, వ్యవసాయ శాఖ సమన్వయంతో నకిలీ విత్తనాల విక్రయాలు అరికట్టేందుకు చర్యలు చేపడుతుందని తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు, కాలం చెల్లిన రసాయన మందుల అమ్మకాలను నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు బృందాలు విస్తృతంగా ఏజెన్సీ ట్రేలపై దాడులు జరుపుతాయని, మండల స్థాయిలో ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో 30 రోజుల పాటు పనిచేస్తుందన్నారు. బుధవారం గోపాల్‌పేట మండలం ఏదులలో ఎస్పీరెడ్డి ఫర్టిలైజర్స్‌పై దాడిచేసి 100 కిలోల కాలం చెల్లిన నకిలీ విత్తనాల అమ్మకాలను సీజ్ చేశామని తెలిపారు.

అందులో కందులు 70 కేజీలు, పాలకూర విత్తనాలు 9 కేజీలు, మరో 6 కేజీల ఆకుకూర విత్తనాలను సీజ్ చేశామని అతడిపై కేసు నమోదు చేశామని అన్నారు. రైతులు కంపెనీ లేఅవుట్‌నే కొనుగోలు చేయాలని, లేబుల్‌లో కాలం చెల్లిన తేదీని పరిశీలించి కొనుగోలు చేయాలని తెలిపారు. కంపెనీవి కాకుండా కుల్లా విత్తనాలు కొనుగోలు చేయొద్దని, మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దని ఆమె రైతులకు సూచించారు. రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని, అందుకు 100 నంబర్‌కు ఫోన్ చేస్తే చర్యలు చేపడతామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు మోసపోవద్దని సూచించారు.

సీడ్స్ యాక్ట్ 1966, సీడ్స్ రూల్స్ 1968, కంట్రోల్ అర్డన్ 1983, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 లాంటి చట్టాలను ప్రజలకు వివరించి కేసులు నమోదు చేస్తామని సూచించారు. ఎవరైనా గుర్తింపు లేకుండా ఎగుమతి, దిగుమతి, రవాణా, తయారీ చేస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని, ఐదేళ్ల వరకు జైలుశిక్ష ఉంటుందన్నారు. సంబంధిత అధికారుల శాఖల నుంచి తప్పనిసరిగా విక్రయదారులు ధ్రువీకరణ పత్రాలు, లైసెన్స్‌లు పొందాలని, నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని తెలిపారు.

ఎక్సైజ్ అధికారుల దాడులు
వనపర్తి విద్యావిభాగం: మండలంలోని నాచహల్లి సమీపంలోని తండాల్లో ఎక్సైజ్ జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు చేసి 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి రెండు లీటర్ల సారాను పట్టుకొని, ఒకరిని అదుపులో తీసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ భగవంతుగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాచహల్లి సమీపంలోని విలియంకొండ, నాచరమ్మపేట తండాల్లో దాడులు చేయగా వంద లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, రెండు లీటర్ల నాటుసారా పట్టుకోగా తయారుదారులైన రాత్లావత్ పార్వతమ్మను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా దాడులు చేస్తామని ఎవ్వరు కూడా బెల్లం తయారు చేయొద్దని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం నిషేధించినందున గిరిజనులు సహకరించాలని ఆయన కోరారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది ఉన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...