మిగిలింది ఏడు రోజులే


Tue,May 21, 2019 03:50 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు విజయ బావు టా ఎగురవేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పనిచేశారు. ఇక ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలింది. మండలం యూనిట్‌గా లెక్కింపు కేంద్రాలను అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఎంపీటీసీ స్థానాలను బట్టి టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఒక ఎంపీటీసీ స్థానానికి రెండు టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఉదాహరణకు ఒక మండలంలో పది ఎంపీటీసీ స్థానాలుంటే 20 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ముందుగా బ్యాలెట్‌ పేపర్లను ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా వేరుచేసి 25 చొప్పున కట్టలు కడతారు. ముందు ఎంపీటీసీ ఓట్లు లెక్కించిన అనంతరం ఫలితాలను వెల్లడించి జెడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తారు. చివరగా విజేతలకు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు.

స్ట్రాంగ్‌రూంలో భద్రత..
పోలైన ఓట్లతో నిండిన బ్యాలెట్‌ బాక్సులు స్ట్రాంగ్‌ రూంల్లో భద్రంగా ఉన్నాయి. ముందస్తుగా ఏర్పాటు చేసిన గదులను అనుసరించి లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో మొత్తం 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటి వద్ద అవసరమైన బారికేడ్లు, టేబుళ్ల ఏర్పాటు పనులను ఇప్పటికే చేపడుతున్నారు. కలెక్టర్‌ శ్వేతామొహంతితోపాటు జేసీ వేణుగోపాల్‌, లైసనింగ్‌ అధికారి నరసింహులు, ఆర్డీవో వెంకటేశ్వర్లు తదితరులు పర్యవేక్షణ చేస్తున్నారు. బ్యాలెట్‌ బాక్సులు భద్రపరిచిన భవనాలను అనుసరించి ఇప్పుడు కౌంటింగ్‌ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడంతో అవసరమైన చర్యలను పూర్తి చేస్తున్నారు.

ముగిసిన శిక్షణ..
పరిషత్‌ ఎన్నికల లెక్కింపు కోసం ప్రత్యేకంగా నియమించిన అధికారులు, సిబ్బందికి శిక్షణ సహితం పూర్తి చేశారు. దాదాపు 920 మందిని కౌంటింగ్‌ కోసం ఉపయోగిస్తున్నారు. వీరిలో రిటర్నింగ్‌ అధికారులు, ఎంపీడీవోలు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లు కౌంటింగ్‌ శిక్షణను పూర్తి చేసుకున్నారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో నాగిరెడ్డి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కౌంటింగ్‌కు సంబంధించిన అంశాలను వివరించడంతో స్థానిక అధికార యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేస్తుంది. ఇదిలా ఉంటే, జిల్లాలోని 14 మండలాల్లో 128 ఎంపీటీసీ స్థానాలకు 527 మంది పోటీ చేయగా, 14 జెడ్పీటీసీ స్థానాలకు 54 మంది పోటీ పడ్డారు. ఈ నెల 27న కౌంటింగ్‌లో వీరి పోటీ భవిత్యం తేలిపోనుంది.

ఏర్పాట్లు చేస్తున్నాం..
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు పనులకు ఏర్పాట్లు పూర్తి చేస్తు న్నాం. పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధం లేకుండా వీటిని కొనసాగిస్తున్నాం. ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహిస్తాం. జిల్లా కేంద్రంలోని 4 భవనాల్లో కౌంటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నాం.
- నరసింహులు, లైజనింగ్‌ అధికారి, వనపర్తి

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...