డెంగీని తరిమేద్దాం


Thu,May 16, 2019 03:04 AM

-వైరన్‌ సిరోటైఫ్‌ అనే వైరస్‌తో వ్యాధి
-మూడు దశల్లో రోగ నిర్ధారణ
-వ్యాధి వ్యాప్తిలోఆడ దోమ పాత్ర కీలకం
-నేడు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం
వనపర్తి, నమస్తే తెలంగాణ : డెంగీ పేరు వింటేనే ప్రజల్లో ఒక రకమైన దడ మొదలవుతుంది. డెంగీ నివారణ నియంత్రణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజలందరూ డెంగీ పట్ల అవగాహనతో కలిసి పనిచేస్తే మన దేశం నుంచి డెంగీ మహ్మమారిని తరిమికొట్టవచ్చనే సంకల్పంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 2016 మే 16న జాతీయ డెంగీ వ్యాధి అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు.దేశంలో చాలా రాష్ట్రాల్లో డెంగీ జ్వరం అతి సాధారణంగా కనిపించే వ్యాధిగా తయారైంది. ఈ వ్యాధి ప్రతి సంవత్సరం కేవలం వర్షాకాలంలో ఎసిడమిక్‌, ఎండమిక్‌ల రూపంలో కనిపిస్తుంది. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమము 2015 సంవత్సరపు గుణాంకముల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో పంజాబ్‌, హర్యానా, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, బీహార్‌, ఉత్తరాఖాండ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో కేసులు నమోదైనట్లు సంస్థ వెల్లడించింది.

వనపర్తి జిల్లాలో డెంగీ వివరాలు ఇలా..
జిల్లాలో వనపర్తి, కొత్తకోట, పెబ్బేర్‌, ఆత్మకూర్‌ మొదలగు పట్టణ ప్రాంతాలతో పాటు సమీప గ్రామాల్లో డెంగీ వ్యాప్తి చెందుతూ వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లా పరిధిలో 2017 సంవత్సరంలో (జనవరి నుంచి డిసెంబర్‌ వరకు) 25 డెంగీ కేసులు, 2018లో 24కేసులు, 2019లో (జనవరి నుంచి మే వరకు) 09 కేసులు నమోదైనట్లు డెంగీ అధికారి ఇస్మాయిల్‌ తెలిపారు. కాగా ఇప్పటి వరకు జిల్లాలో డెంగీతో ఏ ఒక్కరు కూడా మృతి చెందలేదు.

డెంగీ ఇలా వ్యాపిస్తుంది..
ఈ వ్యాధి డెంగ్యూ వైరన్‌ సీరోటైఫ్‌ 1,2,3,4 అనబడు వైరస్‌ వల్ల వస్తుంది. డెంగీ ఒకరి నుంచి మరొకరికి వ్యాపింపజేయడంలో ఆడ ఏడిస్‌ ఈజిప్టయి అను దోమ ప్రధాన పాత్ర పోషిస్తుంది. డెంగీ వ్యాప్తించుటకు 16డిగ్రీల నుంచి 40డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్టోగ్రత అనుకూలమైంది. ఈ దోమలు పగటి మరియు రాత్రి వేళల్లో కూడా కుట్టడం జరుగుతుంది.
వ్యాధి లక్షణాలు..
ఈ వ్యాధి క్లాసికల్‌ డెంగీ జ్వరము, డెంగీ హిమారాజికల్‌ జ్వరము, డెంగీ షాక్‌ సిండ్రోమ్‌ అను మూడు దశలలో కనిపించును. క్లాసికల్‌ డెంగీ జ్వరం..ఇది హటాత్తుగా వచ్చు తీవ్రమైన జ్వరము ,జ్వరంతో పాటు ఎముకలు, కండరాల్లో భరించలేనంత నొప్పి ఉండుట రోగి యొక్క కనుగుడ్లు వెనుక భరించలేనంతనొప్పి శరీరంపై పొక్కులు, దదుర్లు కనిపించుట వాంతులు, వికారము, ఆకలి మందగించడం, రుచిలో మార్పులు, మలబద్దకం వంటి లక్షణాలు కలిగిన ప్రాణాంతక వ్యాది
డెంగీ హిమారాజికల్‌ జ్వరం..

-ఇది చాలా తీవ్రమైన ప్రమాదకరమైన దశ
జ్వరం వస్తూ పోతూ ఉన్న దశలో ముఖం మీద గాని, కాళ్ల మీద గాని, చర్మం లోపల గాని, ముక్కు, చెవుల్లో గాని రక్తం చెమర్చినట్లుగా ఎర్రటి మచ్చలు కనబడుతాయి.
రోగిలో వికారము వల్ల వాంతులు అవడంతోపాటు కొన్ని సందర్భాల్లో పేగుల్లో రక్తస్రావం జరిగి రక్తపు వాంతి కావచ్చు.
రోగి యొక్క రక్తంలో తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్‌ కణాలు తగ్గి ఎర్ర రక్తకణాలు ఘణ పరిమాణం పెరుగును
డెంగీ షాక్‌ సిండ్రోమ్‌
డెంగీ వ్యాధి తీవ్ర దశలో రోగి షాక్‌లోకి వెళ్లవచ్చును.
రోగి శరీరంలో ద్రవాల శాతం తగ్గి, రక్తం చిక్కబడటం వల్ల బీపీ పడిపోవడం, నాడి అందకపోవడం, స్తృహ తప్పడం వంటి లక్షణాలతో రోగి మరణించు ప్రమాదం కలదు.
నిర్ధారణ ఇలా..
డెంగీ వ్యాధిచే అనుమానించబడిన రోగికి సంపూర్ణ రక్త పరీక్ష చేయాలి. దీనిలో తెల్లరక్త కణాలు తగ్గడం, ప్లేట్‌ లెట్‌ కణాల సంఖ్య తగ్గడం, ఎర్ర రక్త కణాల పరిమాణం పెరగడం బట్టి ఎలీసా పరీక్ష ద్వారా ఖచ్చితంగా నిర్ధారించవచ్చు.చికిత్స ఇలా..సాధారణంగా వైరస్‌ వల్ల వచ్చే వ్యాధులకు ఖచ్చితమైన చికిత్స ఏమిలేదు. డెంగీ జ్వరానికి కూడా ఖచ్చితమైన చికిత్స లేదు. రోగి లక్షణాలను బట్టి చేయు చికిత్స అనేది సహాయకారిగా మాత్రమే ఉంటుంది. రోగికి పూర్తి విశ్రాంతితో పాటు ద్రవరూప ఆహరం ఇవ్వవలెను. నొప్పి నివారణకు ఆస్ట్రిన్‌ ఐబ్రూపెన్‌ వంటి మాత్రలు వాడకూడదు.

నివారణ, నియంత్రణ చర్యలు..
డెంగీ జ్వరం వ్యాప్తి చెందుటలో ఆడ దోమ ప్రధాన పాత్ర పోషించును. కావున దోమల్లో ఉన్న వైరసులు ఇతరులకు వ్యాప్తి చెందకుండా దోమల నివారణ, నియంత్రణ చర్యలు చేపట్టవలెను.

దోమలు పుట్టకుండా, కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆరోగ్య సిబ్బంది ఆంటీ లార్యా ఆపరేషన్స్‌ నిర్వహించుట. పైరేథ్రం ఫోకల్‌ స్ఫ్రే చేయుట ద్వారా దోమల నివారణ పెరుగుదలను అరికట్టవచ్చు.
డెంగీపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.. వనపర్తి జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలు, గ్రామస్థాయిలో ఆశ కార్యకర్తల సహకారంతో బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ బృందాల ద్వారా ఆంటీ లార్వా ఆపరేషన్స్‌, డెంగీపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వల్ల జిల్లాలో డెంగీని సాధ్యమైనంత వరకు తగ్గిచడం జరిగింది.-జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. శ్రీనివాసులు

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...