74.58శాతం!


Wed,May 15, 2019 03:12 AM

-ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక ఎన్నికలు
-ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు
-పెరిగిన ఓటింగ్‌
-అత్యధికంగా వీపనగండ్ల
-అత్యల్పంగా శ్రీరంగాపురంలో నమోదు
-పర్యవేక్షించిన కలెక్టర్‌, ఎస్పీలు
-స్ట్రాంగ్‌ రూంలకు చేరిన బ్యాలెట్‌ బాక్సులు
వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో చివరి విడత పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌, సాయంత్రం 5గంటలకు ముగిసింది. అయితే, ఉదయం వేళల్లోనే ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చారు. మధ్యాహ్నం నుంచి ఓటింగ్‌ ప్రక్రియ అంతంత మాత్రంగానే సాగింది. పాన్‌గల్‌, వీపనగండ్ల, చిన్నంబాయి, పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లో మూడో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ జరిగింది. ఐదు మండలాల్లో 1,25,933 లక్షల ఓటర్లుండగా, 93,926 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 48318మంది ఉండగా.. మహిళలు 45608 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు.

అత్యధికంగా వీపనగండ్ల..
పాన్‌గల్‌, వీపనగండ్ల, చిన్నంబాయి, పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లో తుది విడత పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగింది. వీటిలో వీపనగండ్ల మండలంలో 76.84శాతం అత్యధికంగా పోలింగ్‌ నమోదవగా.. అత్యల్పంగా శ్రీరంగాపురం మండలంలో 72.36శాతం పోలింగ్‌ నమోదైంది. పాన్‌గల్‌లో 73.23శాతం, పెబ్బేరులో 73.13శాతం, చిన్నాంబాయిలో 73.23శాతం నమోదైంది. ఒకటి, రెండడో విడత కంటే కూడా చివరి విడత ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.

బారులు తీరిన ఓటర్లు..
పరిషత్‌ ఎన్నికల్లో పల్లె ఓటర్లు ఉదయం వేళలోనే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియలో ఉదయం వేళల్లోనే ఓటు వేసేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే, ఉదయం నుంచి 12 గంటల వరకు ఓటర్లు ఆసక్తిగా పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చారు. మెజార్టీ ఓటర్లు మధ్యాహ్నం వరకే ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌లో కొన్ని గ్రామాల్లో వలస ఓటర్లను సహితం రప్పించడంతో రసవత్తరంగా సాగింది. నువ్వా.. నేనా అన్న పోటీ ఉన్న గ్రామాల్లో ఈ వలస ఓట్ల ప్రభావం బాగా కనిపించింది.

కలెక్టర్‌, ఎస్పీల పరిశీలన..
జిల్లాలో మూడో విడత పరిషత్‌ పోలింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ శ్వేతా మొహంతి, ఎస్పీ అపూర్వ రావు పాన్‌గల్‌, వీపనగండ్ల, చిన్నంబాయి మండలాల్లో పర్యవేక్షణ జరిపారు. సమస్యాత్మక గ్రామాల్లో జరుగుతున్న పోలింగ్‌ సరళిని సహితం కలెక్టర్‌ తహసీల్దార్‌, ఎంపీడీవోల ద్వారా తెలుసుకున్నారు. కలెక్టర్‌ శ్వేతా మొహంతి వీపనగండ్ల, చిన్నంబాయి మండల గ్రామాల్లో పర్యవేక్షించారు.

స్ట్రాంగ్‌ రూంలకు బ్యాలెట్‌ బాక్సులు..
పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు. ఇప్పటికే రెండు విడతల్లో జరిగిన ఎన్నికల బ్యాలె ట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూంలకు తరలించిన సంగతి విధితమే. జిల్లాలోని మొత్తం 14మండలాలకు సంబంధిన బాక్సులను మూడు ప్రాంతాల్లో భద్రపరిచారు. పాలిటెక్నిక్‌ భవణంలో వనపర్తి, గోపాల్‌పేట, రేవళ్లి, పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచారు. అలాగే జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో కొత్తకోట, ఆత్మకూరు, మదనాపురం, అమరచింత, వీపనగండ్ల, చిన్నంబాయి మండలాల బాక్సులకు కేటాయించారు. ఇక పాన్‌గల్‌, పెద్దమందడి మండలాల బ్యాలెట్‌ బా క్సులను జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...