జాగ్రత్తలతోనే ఆరోగ్యమస్తు


Thu,April 25, 2019 03:48 AM

గద్వాల టౌన్ : దోమ గురించి వినడానికి, చూడటానికి చిన్నదే.. కానీ తన కాటుతో నిలువెత్తు మనిషిని కుప్పకూల్చే శక్తి దానికి ఉంది. దోమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలను సైతం హరిస్తుంది.. దోమ కాటుతో ఎన్నో ప్రమాద కరమైన, నయం కాని రోగాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ముందస్తు జాగ్రత్తలు కాసింత పాటిస్తే దోమ కాటుతో వచ్చే రోగాలను నివారించొచ్చు. నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జాగ్రత్తలు.. దోమ కాటు వల్ల వచ్చే రోగాలు.. కొంచం తెలుసుకుందామా..
దోమ కాటు వల్ల అనేక ప్రమాదకరమైన రోగాలు ప్రభలే అవకాశం ఉంది. దోమ కాటుతో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, మెదడువాపు వ్యాధులతో పాటు బోధకాలు వ్యాధి ప్రబలే అవకాశాలు ఉన్నాయి. దోమకాటులో తరుచుగా ప్రతి ఒక్కరికీ వచ్చేది మలేరియా. మలేరియా ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో కొన్ని పరిశీలిద్దాం.

మలేరియా వ్యాప్తి..
ప్రోటోజువన్ ప్లాస్మోడియమ్ అనే పేరు గల కిటాణువుల సంతతికి చెందిన ఎనోఫిలిజ్ ఆడదోమ కారణంగా మలేరియా వ్యాధి సంక్రమిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వ్యాధి అంటు వ్యాధి. వ్యాధి సోకిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వేగవంతంగా సోకుతుంది.

లక్షణాలు..
మలేరియా వ్యాధికి ప్రముఖమైన లక్షణాలు ఉంటాయి. ప్రతి రోజూ రోగికి ఒకే సమయంలో జ్వరం రావడం, తలనొప్పి ఎక్కువగా వస్తుంది. చలి ఉంటుంది, అలాగే కీళ్లనొప్పులు ఎక్కువగా ఉంటాయి.

ఇలా చేద్దాం..
ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండే ప్రదేశాలను గుర్తించి వెంటనే తొలగించాలి. పనికి రాని వస్తువులు ఉంటే తొలగించాలి. ముఖ్యంగా పాత టైర్లు, డ్రమ్ములు, బకెట్లు లాంటివి వెంటనే తీసివేయాలి. ఓవర్‌హెడ్ ట్యాంకులు, టెర్రర్లు, డ్రమ్ములు లాంటి వాటిపై మూతలు తప్పనిసరిగా వేయాలి. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలి. ఒక సారి వాడి పడేసిన వస్తువులను తిరిగి వాడరాదు. కిటికీలకు జాలీలు బిగించుకోవాలి. దొమ తెరలను వాడాలి.

పరిశుభ్రత శ్రీరామ రక్ష..
పట్టణంలోని, గ్రామంలోని వీధులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. మురుగును, పారిశుధ్యాన్ని పేరుకుపోకుండా చూడాలి. మురుగు కాలువల్లో వర్షాలకు ముందు తరువాత పూడికలు తీయాలి. నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి. దోమ కాటు వల్ల జరిగే నష్టాలను వివరించాలి. వ్యాధులు ప్రబలినప్పుడే వెంటనే ఆరోగ్య సిబ్బందికి గానీ, అధికారులకు గానీ సంబంధిత శాఖలకు గానీ తెలియజేయాలి.

ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
పట్టణాల్లోని కాలనీలలో, గ్రామాల్లోని వీధుల్లో పారిశుధ్యం లోపించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. వ్యాధులు ప్రబలినప్పుడు వెంటనే స్పందించాలి. రోగాలు ప్రబలిన రోగులకు పరీక్షలు నిర్వహించాలి. మెరుగైన చికిత్సకు ఏర్పాటు చేపట్టాలి. ప్రత్యేక ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలి. సదస్సులు, అవగాహన కార్యక్రమాలు తరుచూ నిర్వహించాలి. మందులను అందుబాటులో ఉంచాలి. దోమల నియంత్రణ మందులను పిచికారి చేయాలి.

అధికారులు స్పందించాలి..
ప్రభుత్వ పరంగా దోమల నివారణకు పలు కార్యక్రమాలు చేపడుతున్న మున్సిపాలిటీల నిర్లక్ష్యం కారణంగా ఆచరణకు నోచుకోవడం లేదు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో కాలనీలలో పారిశుధ్యం తాండవిస్తున్న కనీసచర్యలు తీసుకోవడం కూడ లేదన్న ఆరోపణలు ప్రజల నుంచి వినిపి స్తున్నాయి. రోగాలు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న అధికారులు పారిశుధ్యం తొలగింపు, దోమల నివారణలో ఎందుకు శ్రద్ధ చూపలేక పోతున్నారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుధ్యం తొలగింపు, దోమల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇదీ పరిస్థితి...
జోగుళాంబ గద్వాల జిల్లాలో గత ఏడాదిలో ప్రభుత్వ దవాఖానల్లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఏడుగురికి మలేరియా, తొమ్మిది మంది చికున్‌గున్యా, నలుగురు డెంగీ బారిన పడ్డట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అయితే వీరందరికీ సకాలంలో వైద్య సేవలు అందించామన్నారు. తద్వారా పూర్తిగా వ్యాధులు నయం అయినట్లు సంబంధిత శాఖ జిల్లా అధికారి రామకృష్ణ చెప్పారు.

నేడు అవగాహన ర్యాలీలు..
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్‌చార్జి అధికారి డాక్టర్ రాజేంద్రకుమార్ మాట్లాడుతూ తన కార్యాలయంలో సదస్సు ఉంటుందని తెలిపారు. సమావేశానికి వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది తప్పక హాజరు కావాలని కోరారు. అలాగే దోమల నివారణ కోసం ముందస్తు చర్యలు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...