చివరి దశలో యాసంగి పంట


Mon,April 22, 2019 02:52 AM

పెద్దమందడి : గత దశాబ్దాల కాలం నుంచి కరువు కాటకాల అల్లాడుతున్న మండలానికి సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కృషి వల్ల పెద్దమందడి మండలానికి కృష్ణా జలాలు పుష్కలంగా రావడంతో రైతులు యాసంగిలో రైతులు భారీగా సేద్యం చేశారు. మండలంలోని ఆయా గ్రామాలలోని చెరువులు, కుంటలు కృష్ణా నీటితో నిండడంతో భూగర్భ జలాలు పెరిగి ఎండిపోయిన బోరుబావులలో కూడా నీరు పుష్కలంగా పెరడంతో యాసంగిలో రైతులు భారీగా సేద్యాలు చేశారు. ముఖ్యంగా వేరుశనగ, వరి పంటలు గతంలో ఎప్పుడు సాగు చేయ్యని విధంగా ఈ ఏడాది రైతన్నలు సాగుచేశారు. ఇప్పటికే వేరుశనగ పంట పూర్తి కావడంతో బోరుబావుల కింద సాగుచేసిన వరిపంటలకు అవసరమయ్యే నీటికి ఎలాంటి డోకా లేకుండా కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాదే అత్యధికంగా పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కారు ఏర్పడిన తర్వాత గ్రామాలలోని చెరువులను, కుంటలను మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరణ చేయ్యడంతో ప్రస్తుతం రైతన్నకు ఈ ఫలితం లాభాదాయకంగా ఉందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా గ్రామాలలోని చెరువులు, కుంటలు పూడికలు తీయడంతో గత ఏడాది కృష్ణా జలాలు మండలానికి రావడంతో ఆయా గ్రామాల చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. దీంతో రైతన్నలు కూడా పంటలు అధికంగా సాగుచేసుకున్నారు. చెరువులు, కుంటలలో కృష్ణా జలాలు రావడంతో భూగర్భ జలాలు పెరిగి ఎండిపోయిన పంటలకు కావాల్సిన నీరు అందిస్తున్నాయి. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులో తీసిన ఒండ్రుమట్టిని పొలాలలో వేసుకోవడం ద్వారా పంటల దిగుబడి మరింత ఎక్కువగా వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరువు కాటకాలతో ఏండ్ల తరబడి భీడుగా ఉన్న వ్యవసాయ పొలాల్లో ఈ ఏడాది సాగుచేయడంతో పంటలు ఏపుగా పెరిగి పసిడి సిరులు కురిపించే విధంగా ఉన్నాయి.

24 గంటల కరెంట్ ఎంతో ఉపయోగం
మండలంలోని వెల్టూర్, జగత్‌పల్లి, గట్లఖానాపూర్, మోజర్ల గ్రామాలు మినహా ఇతర గ్రామాలకు కృష్ణాజలాలు రావడంతో చెరువులు, కుంటల కింద వరి పంటలు సాగుచేశారు. బోరుబావులపై ఆధారపడి రైతన్నలు కూడా భూగర్భ జలాలు పెరగడం వల్ల భారీగా పంటలను సాగుచేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరా చేయడం వల్ల వరి పంటలు రైతన్నలు అధికంగా సాగు చేసుకున్నారు. మొత్తానికి 24 గంటల కరెంట్ వల్లనే ఈ యాసంగిలో అధికంగా వరి పంటలను సాగు చేసినట్లు తెలుస్తుంది.

గత సంవత్సరం కంటే పంటల సాగు ఎక్కువే..
మండలంలో గత సంవత్సరం కంటే ఈ ఏడాది వేరుశనగ, వరి పంటలను ఎక్కువగా సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం యాసంగిలో వరి పంట 1940 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది వరి పంటను 2633 ఎకరాల్లో సాగు చేశారు. అందులో బోరుబావుల కింద 1223 ఎకరాలు, ఎంజీకేఎల్‌ఐ నీటితో 1410 ఎకరాలలో వరిపంటలను సాగుచేసినట్లు అధికారులు తెలిపారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...