మహానుభావుల జీవిత చరిత్రను వెలుగులోకి తీసుకురావాలి


Sun,April 21, 2019 12:35 AM

- ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- కరువు జిల్లాలో మేధస్సుకు కొదవలేదు: ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి
- ఘనంగా పాలమూరు ప్రజావీరులు పుస్తకావిష్కరణ

నవాబ్‌పేట: మహానుభావుల జీవిత చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చి భావితరాలకు అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి డా.వీ.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. నవాబ్‌పేట జెడ్పీటీసీ ఇందిరాదేవి స్వయంగా రచించిన పాలమూరు ప్రజావీరులు పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని శనివారం నాడు మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి డా.వీ. శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే డా.సీ. లకా్ష్మరెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగానే ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ సమాజానికి మంచి చేసిన వారి జీవిత చరిత్రను తెలుసుకొని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పూర్వకాలంలో రజాకార్లను, పెద్దందారులను ఎదిరించి వారితో ఉన్న అక్రమ సంపాదనను నిరుపేదలకు పంచిన మహనీయులను అప్పట్లో దొంగలుగా చిత్రీకరించడం విడ్డూరమన్నారు. పండుగ సాయన్న, మియాసాహెబ్, నక్కలపల్లి రామన్న, బండ్లోళ్ల కుర్మన్నల జీవిత చరిత్రలను జెడ్పీటీసీ ఇందిరాదేవి పుస్తకరూపంలో వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఎంతో కష్టపడి మహానుభావుల జీవితాలను ప్రజలకు వివరించడం హర్షణీయమన్నారు. అనంతరం మాజీ మంత్రి ఎమ్మెల్యే డా.సీ.లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ పాలమూరు కరువుజిల్లాలో మేధస్సుకు, మేధావులకు కొదవలేదన్నారు.

కపిలవాయి లింగమూర్తి లాంటి గొప్ప మేధావులు పుట్టిన నేలమనదని అన్నారు. వీరుల చరిత్రలు వచ్చే భవిష్యత్ తరాలకు అందేలా పుస్తకాన్ని రాసిన జెడ్పీటీసీ ఇందిరాదేవిని ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో మహానుభావులను అప్పటి పాలకులు నిందితులుగా, దొంగలుగా చిత్రీకరించడం దారుణమన్నారు. మహానుభావుల జీవితాలను పుస్తకరూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, ఎంపీపీ శీనయ్య, జెడ్పీటీసీ ఇందిరాదేవి, జడ్చర్ల జెడ్పీటీసీ జయప్రద, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాడెమోని నర్సిములు, మార్కెట్ చైర్మన్ ముత్యాల రవీందర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ స్వరూప, నాయకులు ఎస్.శ్రీనివాస్, పురుషోత్తం, రాంప్రసాద్, నాగిరెడ్డి, ఉమాపతిరెడ్డి, నారాయణ, మైనోద్దీన్, గోపాల్‌గౌడ్, ప్రతాప్,యాదయ్య, సత్యం, కవులు భీంపల్లి శ్రీకాంత్, నందిగామ కిశోర్, వనపట్ల సుబ్బయ్య, దాసరిరంగా, వెంకట్‌పవార్, గుంటి గోపి తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...