300మందికి ముప్పుతిప్పలు


Fri,April 19, 2019 03:27 AM

నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి మహబూబ్ నగర్/నవాబ్‌పేట : రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది నవాబ్‌పేట మండలం పో మాల్ గ్రామం. ఈ గ్రామంలో ఏ ఇంటికి వెళ్లినా.. ఏ రైతును కదిలించినా రెవెన్యూ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రైతుబంధు రాక.. రైతు బీమా వర్తించక కుటుంబాలు వీధిన పడటం, పాసుపుస్తకాలు రాక రుణాలు తీసుకునే అవకాశం లేక వలస బాట పట్టిండ్రు ఇక్కడి జనం. లక్షలు ఖర్చు చేసి భూములు కొన్నా నేటికీ వాటికి ఆన్‌లైన్ చేయక అవస్థలు.. ఇలా ఒక్కటి రెండూ కాదు సుమారు 300 మందికి పైగా రైతులు వివిధ సమస్యలతో రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ సమస్యలు తీర్చమని వేడుకుంటున్నారు. అయినా పరిస్థితిలో మార్పు లేదు. రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదు. వారసత్వంగా సంక్రమించినా, కష్టపడి సంపాదించిన రైతు తన భూ మిని ప్రాణానికంటే ఎక్కువగా చూసుకుంటాడు. కానీ ఆ ప్రాణం లాంటి భూమి రికార్డులు సరిగా లేక అన్నదా త అవస్థలు పడుతున్నాడు. రెవెన్యూ సిబ్బంది, అధికారుల తీరుతో కునారిల్లుతున్నాడు. ఒక్క పోమాల్ గ్రామంలోనే అనేక మంది రైతులు రెవెన్యూ అధికారుల తీరుతో నీరుగారిపోతున్నారు. గ్రామానికి వెళ్లిన నమస్తే తె లంగాణ ప్రతినిధులతో తమ ఆవేదనను పంచుకొన్నారు.

భర్త పోయి వలస కూలీగా మారినం..
నా పేరు లక్ష్మమ్మ. నా భర్త గత ఏడాది డిసెంబర్ 27న మృతి చెందాడు. మా మామ నర్సయ్య నుంచి సర్వే నెంబర్ 222ఈ, 223ఈ ద్వారా వారసత్వంగా వచ్చిన 20 గుంటల భూమిని రికార్డుల్లో ఎక్కించలేదు. కేవలం 9 గుంటల భూమి మాత్రమే ఎక్కించిండ్రు. అధికారుల నిర్లక్ష్యంతో ఒకే శివారులో ఉన్న భూమికి రెండు పాసు పుస్తకాలు వచ్చాయి. అందులోనూ 9 గుంటల భూమి మాత్రమే ఉంది. పాసు పుస్తకాలు రెండు వచ్చాయని... ఒక్కటి చేసి ఇస్తామని ఇంత వరకు మాకు ఇవ్వనే లేదు. నా భర్త పేరిట సకాలంలో పొలం మార్పు చెంది ఉంటే మాకు రైతు బీమా పథకం వచ్చేది. కానీ మా వీఆర్‌ఓ, అధికారుల తీరువల్ల పొలం నా భర్త పేరిట మారలేదు. 20 గుంటల పొలం ఉంటే కేవలం 9 గుంటల పొలం మాత్రమే చూపించారు. నా భర్త మృతితో నేను నా కొడుకు వలస వెళ్లి బతుకుతున్నాం. మాకు న్యాయం చేయాలి.
- లక్ష్మమ్మ, పోమాల్, నవాబ్ పేట మండలం

నేటికీ పాసుపుస్తకాలు లేవు...
మా తండ్రి దార చిన్న నర్సయ్య నుంచి సర్వే నెంబర్ 53, 71లో నాకు వారసత్వంగా ఒక ఎకరా భూమి సంక్రమించింది. 2017లో విరాసత్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. గ్రామ సభ ద్వారా మే 2018లో నాకు అధికారులు ప్రొసీడింగ్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత నా భూమి విషయం మర్చిపోయారు. నేటి వరకు నా ఎకరా భూమిని ఆన్‌లైన్ చేయలేదు. కనీసం నాకు పాసుపుస్తకం రాలేదు. ఖాతా నెంబర్ ఇవ్వలేదు. దీనివల్ల నాకు రైతు బంధు రాలేదు. రైతు బీమా పంట అందలేదు. నరేంద్ర మోడీ కిసాన్ యోజన అందలేదు. బ్యాంకుల నుంచి రుణం తీసుకునే అవకాశం లేదు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అసలే లేవు. ప్రభుత్వం మాకోసం ఎంతో చేస్తున్నా అధికారులు మాత్రం మాకు ఏ మాత్రం సాయం చేయడంలేదు. గ్రామంలో నాలాంటి అనేక మంది రైతులకు వీఆర్‌ఓ కృష్ణయ్య వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయనపై చర్యలు తీసుకుని మాకు వెంటనే పాసుపుస్తకాలు వచ్చేలా చూడమని వేడుకుంటున్నా.
- దార కృష్ణయ్య, పోమాల్, నవాబ్‌పేట మండలం

తిరిగి తిరిగి అలిసిపోయాం..
మా తల్లి పిడుగు మన్నెమ్మ పేరిట ఉన్న 10 ఎకరాల 15 గుంటల భూమి నుంచి నలుగురు అన్నదమ్ములకు ఒక్కొక్కరికి ఒక్క ఎకరా 31 గుంటలు వారసత్వంగా లభించింది. ఈ భూమిని గిఫ్ట్ కింద మా తల్లి మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. 2017లో రిజిస్టర్ కాగా... అదే ఏడాది మాకు ప్రొసీడింగ్స్ కూడా వచ్చాయి. రెండు సార్లు మ్యుటేషన్ అయింది. కానీ ఆన్‌లైన్ చేయలేదు. వీఆర్‌ఓ కృష్ణయ్యకు ఆన్‌లైన్ చేయమని పదుల సార్లు జిరాక్స్ కాపీలు ఇచ్చాం. ఇచ్చిన ప్రతి సారి వాటిని పక్కకు పడేశాడు తప్పించి మా పని చేయలేదు. నలుగురు సోదరులకు నేటికీ పాసుపుస్తకాలు లేవు. రెవెన్యూ అధికారుల తప్పిదం వల్ల నేటికీ మాకు రైతు బంధు రావడం లేదు. ఎలాంటి రుణం తీసుకునే అవకాశమే లేదు. రైతు బీమా బాండ్లు కూడా రాలేదు. పనిచేసే ముఖ్యమంత్రి వచ్చాడని సంతోషిస్తున్నా... కిందిస్థాయి సిబ్బంది, అధికారులు మాత్రం పనిచేయడం లేదు అని చెప్పేందుకు మా ఊరే నిదర్శనం. ఇలాంటి వారిపై కొరడా ఝులిపించి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నా.
- పిడుగు మశ్చేందర్, పోమాల్, నవాబ్ పేట మండలం

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...