సమర సన్నాహాలు..!


Tue,April 16, 2019 02:48 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : పరిషత్ ఎన్నికల కు పల్లెల్లో రంగం సిద్ధమవుతుంది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల సందడి నుంచి తేరుకోకముందే మళ్లీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోలాహలం ఓటర్ల తలుపు తడుతుంది. దీంతో పంచాయతీ ఓట్ల కంటే ఎక్కువగా పల్లెల్లో పరిషత్ రాజకీయం అలుముకోనుంది. 2014లో జరిగిన పరిషత్ పోరుకు.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం, జిల్లాల పునర్విభజనల తో పల్లె రాజకీయం ఆసక్తిగా మారింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. పూర్వపు మ హబూబ్‌నగర్‌తోపాటు మరో మూడు కొత్త జెడ్పీలు, మరికొన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను సహితం ఏర్పాటైన క్రమంలో నేటి పరిషత్ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

గెలుపు గుర్రాల వేట..
పరిషత్ ఎన్నికల్లో గెలుపు గుర్రాల వేట ప్రారంభమైంది. ఇప్పటికే నియోజకవర్గ బాధ్యులు తమ వ్యూహాలకు పదును పెట్టారు. ముఖ్యులతో సమావేశాలను ఏర్పాటు చేసుకుని పరిషత్ పోరుకు సన్నద్ధమవుతున్నారు. ప్రధానంగా గెలుపు గుర్రాల ఎంపికలకు నేతలు ప్రాధాన్యతనిస్తున్నారు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నారు. పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ, జెడ్పీటీసీలను కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నాలను మొదలు పెట్టింది. ప్రధానంగా ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. వీటిని క్రమ పద్ధతిలో అనుసరించి ఎక్కడా ఎలాంటి బేదాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు గులాబీదళం జాగ్రత్తలు తీసుకుంటున్నది. గత నెలలోనే రిజర్వేషన్లు వెల్లడయినందునా ఏ మండలంలో ఎవరన్నది స్పష్టంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పాటికే నేతలు ఓ అంచనాలో ఉన్నారని, మళ్లీ సమీక్ష నిర్వహించి ఎక్కడ పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుని పరిషత్ పోరులో విజయఢంకా మోగించేందుకు టీఆర్‌ఎస్ నాయకులు సన్నద్ధమవుతున్నారు.

వరుస విజయాలతో ఊపు..
వరుస విజయాలతో గులాబీదళం కొత్త ఊపుతో ఉంది. గ్రామ పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటిన టీఆర్‌ఎస్ పరిషత్ ఎన్నికలపై ప్రణాళికతో ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 14కుగాను 13 అసెంబ్లీ స్థానాలను టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టిన ఓటర్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లోను టీఆర్‌ఎస్ అనుచరులకే అధిక స్థానాలను అందించారు. ఒక్క కొల్లాపూర్ స్థానంలో ప్రతిపక్షం నుంచి గెలిచిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సహితం సీఎం కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌ను కలసి గులాబీ తీర్థం పుచ్చుకునే విధంగా పరిస్థితులు మారడం తెలిసిందే. ఇలా వరుస విజయఢంకాలతో గులాబీ దళం దూకుడుతో ఉంది. ఇక ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు సహితం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటాయని అంచనాలో ఉన్నారు. ప్రస్తుతం వస్తున్న పరిషత్ ఎన్నికల్లోను తమ సత్తా చూయించాలన్న పట్టుదలతో గులాబీ దళం సన్నద్ధమవుతుంది. ఈమేరకు సోమవారం హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ పరిషత్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై దిశా.. నిర్ధేశం చేశారు. జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రాంమోహన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డిలు పరిషత్ ఎన్నికలకు సంబంధించి అన్ని అవకాశాలను పరిగణలోకి తీసుకుని ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు.

డీలాపడ్డ ప్రతిపక్షాలు..
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న వివిధ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఓటర్లు అవకాశం ఇవ్వడం లేదు. గడచిన నాలుగున్నరేళ్లుగా టీఆర్‌ఎస్ ప్రజల పక్షాన నిలబడటంతో ఓటర్లంతా ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌కు అండగా నిలబడుతున్నారు. ప్రధానంగా సాగునీరు, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలుస్తుండటంతో వరుస ఎన్నికల విజయాలకు తార్కాణంగా నిలుస్తుంది. ఈ వరుస ఎన్నికల ఫలితాలను గమనించిన ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా డీలా పడ్డాయి. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లోను అంతంత మాత్రంగానే ప్రచారాలు చేయడం.. ప్రజలు ఆసక్తికనబర్చక పోవడంతో మమ అనిపించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లోను ప్రతిపక్ష పార్టీల నుంచి నిలబడాలంటేనే నాయకులు జంకుతున్నారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేస్తుండటంతో ఓటర్లంతా గులాబీ పార్టీ వైపు అడుగులు వేస్తుండటంవల్ల ప్రతిపక్ష పార్టీలు డీలా పడకతప్పడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...