సజీవ సమాధి


Thu,April 11, 2019 01:39 AM

నారాయణపేట నమస్తే తెలంగాణ ప్రతినిధి/ మరికల్ : బతుకుదెరువు కోసం ఉపాధి హామీ పనులకు వెళ్తున్న మహిళల జీవితాలు మట్టిలో కలిసి పోయాయి. సేద తీరేందుకు గుట్ట నీడకు వెళ్లగా మట్టి పెళ్లలు కూలి ఒకేసారి పది మంది మహిళలు మృత్యువాత పడగా వారి కుటుంబాల రోదనలు మిన్నంటాయి. ఈ విషాదకర ఘటన బుధవారం నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం తీలేరు గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడే ఉన్న కూలీలు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన దాదాపు 100 మంది ఉపాధి హామీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజువారీగానే బుధవారం సైతం కూలీలు పనులకు వెళ్లారు. ఉదయం 9 గంటలకు తాము పని చేయాల్సిన ఎడ్మార్‌తిప్ప గుట్ట సమీపానికి చేరుకొని కందకాల తవ్వకాలు చేశారు. వేసవిలో 11 గంటల్లోపే పనులు ముగించుకోవాలన్న నిబంధనలు ఉండడంతో వారు పనులను ముగించారు. హాజరు వేసుకున్న తర్వాత ఇళ్లకు వెళ్లాలని నిర్ణయించుకొన్నారు. ఎడ్మార్‌తిప్ప గుట్టకు గతంలో జరిపిన తవ్వకాల వల్ల ఏర్పడిన నీడలో కొంత సేపు సేద తీరేందుకు 12 మంది అక్కడికి చేరుకున్నారు. 11 మంది పూర్తి మట్టి దిబ్బలకు దగ్గరగా కూర్చోగా ఒక్క మహిళ మాత్రం కొంచెం దూరంలో కూర్చొంది.

మంగళవారం సాయంత్రం కొద్దిపాటి వర్షం కురవడం.. మట్టిదిబ్బలు నాని ఉండడంతో అవి ఒక్కసారిగా కూలి అక్కడే కూర్చున్న 10 మందిపై పడింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో 10 మంది మట్టి దిబ్బకింద కూరుకుపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో మహిళ ఎలాంటి ప్రమాదానికి లోనుకాకుండా ప్రాణాలతో బయట పడింది. ఘటన జరిగిన వెంటనే ప్రాణాలతో బయట పడిన మహిళ భయంతో బిగ్గరగా అరవడంతో చుట్టుపక్కల ఉన్న కూలీలందరూ అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కూలీల మీద పెద్ద ఎత్తున మట్టి కూలడంతో ఆ మట్టిని తొలగించడం వారికి సాధ్యం కాలేదు. తీవ్రంగా గాయపడి ఉన్న చర్లపల్లి లక్ష్మీని మట్టి దిబ్బల నుంచి బయటికి తీయగలిగారు. మిగిలిన వారిని తీయడం సాధ్యం కాకపోవడంతో వారు క్షణాల్లో ప్రాణాల్ని కోల్పోయారు. అక్కడే వ్యవసాయ పొలంలో ఉన్న డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి హుటాహుటినా జేసీబీని పిలిపించి మట్టి దిబ్బల కింద విగతా జీవులై ఉన్న మహిళా కూలీల మృత దేహాలను బయటకు తీయించారు. బుర్రమొల్ల అనంతమ్మ అనే వృద్ధురాలు కొన ఊపిరితో ఉండి బయటకు తీసుకువచ్చి కూర్చుండ బెట్టిన వెంటనే ప్రాణాలు కోల్పోయింది.

అత్తా కోడళ్లిద్దరు అనంతలోకాలకు..
బుధవారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన 10 మంది మహిళా కూలీల్లో ఇద్దరు అత్తా కోడళ్లు ఉన్నారు. చర్లపల్లి లక్ష్మీ (45), అనురాధ (25) ఇద్దరు అత్తా కోడళ్లు. లక్ష్మీ కూలీ పనులు చేస్తుండగా అనురాధ మెయిట్‌గా పని చేసేది. ఈ సంఘటనలో ఇద్దరు మరణించడంతో వారి కుటుంబంలో విషాదం మిన్నంటింది. మిగతా వారిలో చాకలి అనంతమ్మ (65), గాలితిప్ప బుడ్డమ్మ (40), పల్లెగడ్డ కేశమ్మ (50), మరాఠి మంగమ్మ (26), కుమ్మరి లక్ష్మీ (35), పల్లెగడ్డ అరుణమ్మ (35), బుర్రమల్ల అనంతమ్మ (56), బోడి లక్ష్మీ (35) ఉన్నారు. కాగా లక్ష్మీ అనే మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈమెను హుటాహుటిన మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. సాయంత్రానికి పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాలను వారి వారి కుటుంబాలకు అందజేశారు.

పరామర్శించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ప్రమాద విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్‌గౌడ్ హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని మంత్రి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అక్కడికి వెళ్లి ప్రాణనష్టం జరగకుండా చూడాలని, గాయపడిన వారిని మెరుగైన వైద్యసేవలకు తరలించాలని మంత్రిని సీఎం ఆదేశించారు. దీంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, కలెక్టర్లు రోనాల్డ్‌రోస్, వెంకట్రావ్, సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని వెంటనే మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్వయంగా దగ్గరుండి వాహనాలలో ఎక్కించి నారాయణపేట ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేయడంతో ఎన్నికల కోడ్ కారణంగా ఎటువంటి హామీలు ఇవ్వలేమని, కోడ్ ఎత్తివేసిన వెంటనే బాధిత కుటుంబాలకు అన్నివిధాలుగా న్యాయం చేస్తామని మంత్రి బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు నచ్చజెప్పారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, కలెక్టర్లు రోనాల్డ్‌రోస్, వెంకట్రావ్ ఎటువంటి ఆందోళనలు చెందవద్దని, హామీలు ఇవ్వడానికి ఇది సమయం కాదని వివరించారు. తప్పనిసరిగా న్యాయం చేకూరుతుందని, ఘటనకు కారణాలను గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు చెప్పారు.

దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
తీలేరు ఘటనలో 10 మంది ఉపాధి మహిళా కూలీలు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో ప్రత్యేకంగా మాట్లాడి కూలీల ప్రాణాలను కాపాడేందుకు ఎంతకైనా వెనుకాడవద్దని సూచించారు. అప్పటికే కూలీల ప్రాణాలు పోయాయని మంత్రి వివరించడంతో సీఎం కేసీఆర్ ఈ దుర్ఘటన పట్ల విచారం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆందోళన చెందవద్దని బాధిత కుటుంబాలకు చెప్పాలని మంత్రికి తెలిపారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఘటనకు కారణాలకు గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...