టీబీ రహిత జిల్లాకు కృషి చేద్దాం


Tue,March 26, 2019 02:04 AM

వనపర్తి వైద్యవిభాగం : టీబీ రహిత జిల్లా కోసం అందరం కృషి చేయాలని కలెక్టర్ శ్వేతామొహంతి అన్నారు. ప్రపంచ టీబీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి ఏర్పా టు చేసిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ జిల్లా దవాఖానతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ఉచితంగా మందులు ఇస్తూ టీబీ నిర్ధారణ అయిన ప్రతి ఒక్క రోగికి రూ.500 ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని టీబీ రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడలిలలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని తరుణి ఫంక్షన్ హాల్‌లో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ 2025 వరకు క్షయ వ్యాధిని రూపుమాపాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. టీబీ అనేది ఊపిరితిత్తుల నుంచి మెదడు వరకు శరీరంలోని ఏ భాగానికైనా సోకే అవకాశం ఉంటుందన్నారు. మైక్రో బ్యాక్టీరియా, ట్యూబర్ క్యూలోసిస్ అనే సూక్ష్మజీవి ద్వారా క్షయ వ్యాధి వస్తుందని తెలిపారు. క్లోమం, థైరాయిడ్ గ్రంథి, జుట్టు తప్ప మిగిలిన అవయవాలన్నింటికీ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందన్నారు.

ఈ వ్యాధి ప్రధానంగా శ్వాసకోశాన్ని దెబ్బతీస్తుందని, ఇలాంటి అంటు వ్యాధిని పూర్తిగా నివారించేందుకు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. రెండు వారాల కంటే మించి ఎడతెరిపి లేకుండా దగ్గు వచ్చినప్పుడు క్షయ వ్యాధిగా గుర్తించాలని, సాయంత్రం వేళ జ్వరం రావడం, ఆకలి తగ్గడం, ఛాతిలో నొప్పి రావాడం, ఉమ్మిలో తెమడలు, దగ్గినప్పుడు రక్తం పడటం, బరువు తగ్గడం వంటి లక్షణాలుంటే క్షయ అని గుర్తించాలన్నారు. ఇలాంటి వారు తెమడ పరీక్షలు చేయించుకున్నప్పుడు వ్యాధి నిర్ధారణ అయితే 6 నుంచి 8 నెలల వరకు మందులు వాడాలని సూచించారు. జిల్లాలో క్షయ వ్యాధి గ్రస్తులు జనవరి 2018 నుంచి ఇప్పటి వరకు 1,073 మంది ఉండగా, 2019లో 317 మందికి గాను 298 మందికి చికిత్స కొనసాగుతుందన్నారు. అనంతరం రోగులకు ఉత్తమ సేవలు అందించిన ఏఎన్‌ఎం, ల్యాబ్ టెక్నీషియన్, ఆశ కార్యకర్తలకు ఉత్తమ సేవ అవార్డులను డీఎంహెచ్‌ంఓ చేతుల మీదుగా అందజేశారు. వైద్యాధికారులందరూ టీబీని రూపుమాపేందుకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్.రవిశంకర్, ఆర్‌ఎంవో చైతన్యగౌడ్, డాక్టర్.జోషి, చంద్రయ్య, డాక్టర్ పరిమల తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...