ప్రచార హోరు


Sun,March 24, 2019 12:57 AM

మహబూబ్ నగర్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణులు పనిచేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అందిన ఘన విజయం స్ఫూర్తితో పార్టీ క్యేడర్ అంతా రంగంలోకి దిగాయి. ఇప్పటికే మండల, నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మహబూబ్ నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలకు హాజరవుతున్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. శనివారం షాద్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు పూర్తి కాగా.. ఆదివారం మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో సమావేశాలు జరుగనున్నాయి. మరోవైపు నాగర్‌కర్నూల్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శనివారం గద్వాల, ఆలంపూర్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశాలకు ఎంపీ అభ్యర్థి రాములు, జెడ్పీ చైర్మన్ భాస్కర్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం హాజరయ్యారు. నేడు వంగూరులో, రేపు కల్వకుర్తిలో సమావేశాలు జరుగునున్నాయి. ఈ సమావేశాలకు తోడు ఈనెల 31న మహబూబ్‌నగర్, వనపర్తిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరుగనుండటంతో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

భారీ మెజార్టీ లక్ష్యంగా..
రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ హవా నడుస్తోంది. అత్యధిక స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు టీఆర్‌ఎస్ పార్టీ వారే. దానికితోడు అభివృద్ధి కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ పార్టీలోకి వరదలా వస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రతిపక్షాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సైతం టీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకునడంతో ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. ఇక ఎన్నికల ముందు మాత్రమే హడావిడి చేసే బీజేపీ పరిస్థితి సైతం అదే రీతిన ఉంది. కాంగ్రెస్‌కు చెందిన డీకే అరుణను బీజేపీలోకి తీసుకుని మహబూబ్ నగర్ టిక్కెట్ ఇచ్చారు. అచ్చంగా గత ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు నాగర్ కర్నూల్‌లో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి రాములు, మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలుపు లాంఛనమేనని భావిస్తున్నారు. పకడ్బందీగా నియోజకవర్గాలు, మండలాల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

నాగర్ కర్నూల్‌లో..
ఆదివారం వంగూరు, సోమవారం కల్వకుర్తి, మంగళవారం వనపర్తి, బుధవారం నాగర్‌కర్నూల్, గురువారం కొల్లాపూర్‌లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూల్ పరిధిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శనివారం గద్వాల, ఆలంపూర్‌లో జరిగిన సమావేశాలకు ఎంపీ అభ్యర్థి రాములుతో పాటు ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, జెడ్పీ చైర్మన్ భాస్కర్ హాజరయ్యారు. కార్యకర్తలకు ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపు ఎంత ముఖ్యమే నేతలు స్పష్టంగా వివరించారు.

మహబూబ్‌నగర్‌లో..
మహబూబ్ నగర్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో శనివారం షాద్‌నగర్, జడ్చర్ల, దేవరకద్రలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాలు జరిగాయి. ఆదివారం మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు జరుగుతాయి. శనివారం మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి లకా్ష్మరెడ్డి, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశమంతా ప్రస్తుతం తెలంగాణ వైపు, సీఎం కేసీఆర్ వైపు ఎదురుచూస్తోందని... పలు రాష్ర్టాలు సైతం కేసీఆర్ నాయకత్వాన కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు. సోమవారం మహబూబ్ నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుగనుంది. ఆ తర్వాత వివిధ రోడ్ షోలు, బహిరంగ కార్యక్రమాలు కొనసాగుతాయి.

31 సీఎం కేసీఆర్ రాక..
ఈ నెల 31న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్, వనపర్తిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. 31వ తేదీన సాయంత్రం వనపర్తిలో 4గంటలకు, మహబూబ్‌నగర్‌లో 5:30 గంటలకు జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...