మల్లుకు ముల్లు..


Thu,March 21, 2019 01:42 AM

నాగర్‌కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవికి ముందుముందు గడ్డుకాలం ఎదురు కాబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ ప్రస్తుత పరిస్థితి ఓ వైపు, విభేదాలు మరోవైపు..స్థానికేతర అం శం ఇంకొకవైపు మల్లు విజయాలకు ముళ్ల కంపలా మారబోతున్నాయి. నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌కు పాతకాపు అయిన మల్లుకు నాటి పరిస్థితులు లేవు. అధికార టీఆర్‌ఎస్ రాష్ట్రంలోనే బలమైన రాజకీయ పార్టీగా మారింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరింట్లో ఘన విజయం సాధించింది. నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాలలో లక్ష ఓట్ల వరకు టీఆర్‌ఎస్‌కు వచ్చాయి.

మొత్తం మీద దాదాపుగా 3 లక్షల ఓట్ల మెజారిటీ టీఆర్‌ఎస్‌కు గత అసెంబ్లీ ఎన్నికల్లో లభించింది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రతి అసెంబ్లీ పరిధిలో 100 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకొంది. ఇలా ఏ రకంగా చూసినా టీఆర్‌ఎస్ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్‌కు అందనంత దూరంలో ఉంది. ఇదిలా ఉంటే మల్లు రవికి సొంత పార్టీ బలహీనత, వివాదాలు కొరకరాని కొయ్యగా మారనున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఒక్క కొల్లాపూర్ అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 80 వేల ఓట్లు తప్పితే మిగతా నియోజకవర్గాల్లో ఘోరంగా ఓట్లను కోల్పోయింది. దీంతో పార్టీ బలాల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలమైన టీఆర్‌ఎస్‌ను ఢీకొనడం మల్లుకు అసాధ్యంగా కనిపిస్తోంది.

సఖ్యత కుదిరేనా..
పార్టీలోనూ వర్గ విభేదాలు కూడా మల్లు కొంపముంచేలా ఉన్నాయి. ఇప్పటికే నాగర్‌కర్నూల్ టిక్కెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బహిర్గతమయ్యాయి. సతీష్ మాదిగ కోసం మాజీ మంత్రి అరుణ పట్టుబట్టగా అధిష్ఠానం మల్లు రవి పేరును ఖరారు చేసింది. ఈ ఎన్నికలకు పార్లమెంటరీ ఇన్‌చార్జిగా నియమింతులైన డీకే అరుణ తాజాగా బీజీపీలో చేరడం మరింత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో జట్టుగా ఎలా సాగుతారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక పార్లమెంటరీ పరిధిలోని కల్వకుర్తి నాయకుడు వంశీచంద్‌రెడ్డి మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు కావడంతో ఇక్కడి పార్టీ ఓటర్లను ఓటింగ్ రూపంలో మల్చుకోవడం మల్లుకు అదనపు భారం. వంశీచంద్‌రెడ్డి తన గెలుపు కోసం మహబూబ్‌నగర్ పార్లమెంట్‌పైనే దృష్టి సారిస్తారు. ఇక అలంపూర్ నేత సంపత్ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో సంపత్ సహకారం ఏ మేరకు అందేనో కాలం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక నాగర్‌కర్నూల్, అచ్చంపేటలో కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన నాయకులు నాగం జనార్దన్ రెడ్డి, వంశీకృష్ణలు నియోజకవర్గాన్ని పట్టించుకోవడం మానేశారు. ఇక వనపర్తి నేత చిన్నారెడ్డి మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండటంతో ఈ నియోజకవర్గ ఓటింగ్‌ను కూడా మల్లు రవి ఒంటరిగా సాధించుకోవాల్సిన పరిస్థితులు రానున్నాయి. ఒక్క కొల్లాపూర్‌లో మాత్రమే కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే ఉన్నారు.

అయితే టీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించారు. ఇక మల్లు రవి ఇక్కడి నుంచి తన అన్న మల్లు అనంతరాములు వారసునిగా వచ్చి 1991-96, 1998-99లో రెండుసార్లు ఎంపీగా పని చేశారు. ఆ తర్వాత ఆయన జడ్చర్ల అసెంబ్లీ స్థానానికి వెళ్లారు. దీంతో ఇక్కడి తన అనుచరగణం కూడా దూరమైంది. ఇక్కడికి మల్లు పాత కాపే అయినా అప్పటి పరిస్థితులు మారిపోయాయి. తన బలగం కూడా దూరమైంది. ఆ బలగాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేసినా అధికార టీఆర్‌ఎస్‌లో చేరడంతో నిస్సహాయత ఎదురు కానుంది. అన్నింటికంటే ప్రధానంగా స్థానికేతర అంశం టిక్కెట్ల కేటాయింపులోనూ ఖమ్మం మూలాలున్న మల్లుకు ఆటంకంగా మారింది. దీన్ని స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి తాను స్థానికుడినేనని చెప్పుకోవాల్సి వచ్చింది. స్థానికేతరులకు టిక్కెట్లు ఇవ్వొద్దని ఢిల్లీలో, గాంధీభవన్ వద్ద ఆందోళన చేసిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో మల్లురవి పోటీ చేసి గెలిచిన నాటి రాజకీయ పరిస్థితులు మారిన నేటి కాలానికి ఈ లోక్‌సభ ఎన్నికలు కఠిన పరీక్షను చూపించబోతున్నాయి. సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్యను కాదని టిక్కెట్ పొందిన మల్లు టీఆర్‌ఎస్ కారు స్పీడ్‌ను ఏ మేరకు అందుకోగలరో ఎదురు చూడాల్సిందేనని పార్టీ శ్రేణులు, మల్లు అనుచరులు అభిప్రాయపడుతున్నారు.

పార్టీ వీడిన జేజమ్మ, బీరం!
గద్వాల జేజమ్మగా పేరుతెచ్చుకున్న డీకే అరుణ మంగళవారం రాత్రి బీజేపీ చేరడంతో అందరినీ ఆశ్చర్యానికి గురుచేసింది. అదే బాటలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో బుధవారం భేటీ అయ్యారు. దీంతో ఉన్న ఆ కాస్త ఆశ కూడాపోయి కాంగ్రెస్ మరింత బలహీనమైంది.

ఓటు.. మన హక్కు ..
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత ప్రధానమైంది. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కు. మన కోసం, మన బాగు కోసం సమర్థులైన ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు ప్రధాన పాత్రను పోషిస్తుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం మనకు కల్పించింది. ఒక రకంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను నిలుపడంలో ఓటుదే ప్రధాన పాత్ర. ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల తరఫున గాని స్వతంత్రులుగా గాని పోటీ చేసే అభ్యర్థుల గెలుపోటములను నిర్ధారించే ఓటును ఓటర్లందరూ సద్వినియోగ పర్చుకోవాల్సిన అవసరం ఉంది. పౌరులుగా ఓటరుగా పేర్లను నమోదు చేసుకోవడంతోపాటు ఆ ఓటును వినియోగించుకోవడం వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ఓటు వేయడం, వేయక పోవడం అనేది మన వ్యక్తిగతానికి సంబంధించిందే అయిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్కొక్కసారి ఒక్కొక్క అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేస్తుంది. దీనివల్ల సమర్థులైన పాలకులను కోల్పోయే ప్రమాదాలు ఉంటాయి. ప్రతి ఎన్నికల్లోనూ ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అంతగా ఆసక్తి చూపరు. స్థానిక ఎన్నికల్లో పోలింగ్ శాతం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. ఎన్నికలలో కులం, మతం, ప్రాంతీయ తత్వం, మద్యం, డబ్బులు ప్రధాన పాత్రను పోషించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానకరం. నిజమైన ప్రజాస్వామ్యవాదులు వీటన్నింటితో ప్రమేయం లేకుండా సమర్ఢుడు, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించగల నాయకులనే మన ప్రజా ప్రతినిధులుగా ఎంపిక చేసుకోవాలి. మన ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే ఓటును వినియోగించుకోవడమే కాదు. సమర్థుడైన నేతను ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం కూడా ప్రజలు బలమైన ఆకాంక్షను ప్రస్పుటించింది. రాష్ర్టాభివృద్ధి చేయగలరని నమ్మి జనం కేసీఆర్‌కు జై కొట్టింది. అలాగే జాతీయ స్థాయిల్లో మనకు, మన రాష్ర్టానికి మేలు చేయగలరన్న అభ్యర్థులను గుర్తించి ఈ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవాలి. మేధావులు, విద్యావేత్తలే కాదు, మహిళలు, విద్యార్థులు, యువత ప్రలోభాలకు గురికాకుండా సమర్థులకు ఓటువేసి మన ఓటు హక్కుకు విలువలను చేకూర్చి పౌరులుగా మన ఆత్మగౌరవాన్ని నిలుపుకుందాం.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...