మిషన్ భగీరథ..పనులు పూర్తి చేయండి


Thu,March 21, 2019 01:41 AM

అడ్డాకుల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైపులైన్ పనులను పూర్తి చేయాలని సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులను నిలదీశారు. బుధవారం ఎంపీపీ కమలమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మూసాపేట, అడ్డాకుల మండలాలలోని ఏ గ్రామంలో చూసినా మిషన్ భగీరథ పైపులైన్లకు గుంతలు తీసి వదిలేశారని, రాత్రి సమయాలలో పాదాచారులు గుంతలలో పడి గాయాలపాలవుతున్నారని కోఆప్షన్ సభ్యుడు షఫీ అహ్మద్, సర్పంచ్ తిరుపతయ్య యాదవ్ సభ దృష్టికి తెచ్చారు. కాంట్రాక్టర్లు పైపులైన్లను ఇష్టారాజ్యంగా వేస్తూ రోడ్లపై పైపులను వృధాగా వదిలేయటంతో అవి పగిలిపోతున్నాయని వాపోయారు. కొన్ని ఇండ్లకు రెండు మీటర్ల పైపులను వేస్తూ వదిలేస్తున్నారని పనులపై అధికారుల పర్యవేక్షణ కరువైందని సభ్యులు వివరించారు. సమస్యలను త్వరలోనే పరిస్కరిస్తామని మిషన్ భగీరథ ఏఈ రఘు సభ్యులకు తెలిపారు. రాచాల గ్రామానికి 133కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరుకు నివేదికలు తయారు చేసి అధికారులకు పంపించామని విద్యుత్ అధికారులు తెలిపారు. హరితహారం కింద ఏర్పాటు చేస్తున్న నర్సరీల వివరాలు సర్పంచులకు తెలియకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని సర్పంచులు ప్రశ్నించారు.

రాచాల, జానంపేట, తాళ్లగడ్డ, గాజులపేట గ్రామాలలో విద్యుత్ స్తంభాలు తుప్పుపట్టి ప్రమాదభరితంగా ఉన్నాయని సభ్యులు సభకు వివరించారు. త్వరలోనే కొత్త విద్యుత్ స్తంభాలను అందజేస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు. గత వేసవికాలంలో ఉన్న నీటి ఎద్దడి ప్రస్తుతం మిషన్ భగీరథ నీటితో నీటి కొరత తీరిందని ఇందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామని కందూరు సర్పంచ్ శ్రీకాంత్ సభలో ప్రకటించారు. రేషన్ దుకాణంలో బియ్యం, చక్కెర, మంచినూనె ప్రతి నెల ఇస్తున్నట్లు అధికారులు నివేదికలో పొందుపరిచారని రెండు మండలాల్లోని చాలా గ్రామాల్లో చక్కెర ఇవ్వటం లేదని సభ్యులు సభకు వివరించారు. త్వరలేనే డీలర్ల నుంచి నివేదికలు తెప్చించి చర్యలు తీసుకుంటామని అడ్డాకుల డిప్యూటీ తహసీల్దార్ కిశోర్ వివరించారు. కేసీఆర్ కిట్ల ద్వారా ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య పెరుగుతుందని అడ్డాకుల, మూసాపేట వైద్య సిబ్బంది తెలిపారు. ప్రతి గ్రామంలో శ్మశాన వాటికకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తున్నారని సర్పంచులందరూ ఇందుకు తగిన ప్రతిపాదనలు కార్యాలయంలో అందజేయాలని ఇన్‌చార్జి ఎంపీడీవో ప్రభాకర్ సభ్యులకు వివరించారు. నూతన పంచాయతీ రాజ్ చట్టంలోని 7వ చాప్టర్‌లో గ్రామ సభల గురించి వివరించారని ప్రతి నెల పంచాయతీ సిబ్బంది సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ఇందులో వివిధ శాఖలకు చెందిన 17 మంది సభ్యులు ఉంటారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు పొన్నకల్ మహిమూద్, ఎంఈవో నాగయ్య, వ్యవసాయ అధికారి శ్రీనివాసులు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...