ఇక మూడు రోజులే..


Wed,March 20, 2019 02:50 AM

- ఈనెల 20,22,25తేదీల్లోనే అవకాశం
- 21,23,24తేదీల్లో సెలవులు
- ఇంకా ముందుకు రాని స్వతంత్రులు
- సర్వత్రా ఆసక్తి రేపుతోన్న నామినేషన్లు
నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ లోక్‌సభకు నామినేషన్ల గడువు మరో ఆరు రోజుల్లో ముగియనున్నాయి. ఈనెల 18న సోమవారం నామినేషన్లు ప్రారంభం కాగా ఇప్పటికే రెండు రోజులు పూర్తయ్యాయి. కాని ఇప్పటికీ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీనికి ప్రధాన కారణం ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఖరారు కాకపోవడమే. సోమవారం రాత్రి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి ఖరారయ్యారు. మిగతా పార్టీల అభ్యర్థులు తేలాల్సి ఉంది. దీంతో ఆయా పార్టీల నుంచి ఎవరెవరు పోటీ చేసేదీ తెలియని పరిస్థితి ఉంది. నాగర్‌కర్నూల్ ఎస్సీ లోక్‌సభ స్థానానికి గాను ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు 8 రోజులు నామినేషన్ల గడువు ఉంది. ఇందులో ఈనెల 21, 23, 24వ తేదీల్లో సెలవులు ఉన్నాయి. ఈనెల 21న హోలీ పండుగ ఉంది. 23వ తేదీ నాలుగో శనివారం. 24వ తేదీ ఆదివారం కావడంతో నామినేషన్లను ఆయా రోజుల్లో స్వీకరించడం లేదు. దీంతో సోమ, మంగళవారాలతో పాటుగా ఈనెల 20,22,25తేదీల్లో మూడు రోజులు మాత్రమే నామినేషన్లకు అవకాశం ఉంది.

ఇందులోనూ ఒకవేళ అభ్యర్థులు ఖరారైతే తమ పేర్లకు సరిపోయే జ్యోతిష్ట బలం ప్రకారం నామినేషన్ల తేదీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రస్తుతం మిగిలిన ఆరు రోజుల్లో మూడు రోజులు మాత్రమే నామినేషన్లు వేసేందుకు వీలవుతుంది. అయితే ఇప్పటి వరకూ ఓవైపు పార్టీల అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఎవరు పోటీ చేస్తారోననే ఉత్కంఠ రాజకీయ వర్గాలు, ప్రజానీకంలో కనిపిస్తోంది. రెండు రోజుల నామినేషన్ల గడువు ముగిసినా కనీసం స్వతంత్రులు ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయకపోవడం గమనార్హం. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క నియోజకవర్గం నుంచి దాదాపుగా 15మంది వరకు పోటీ చేశారు. ఇందులో ప్రధాన పార్టీలతో పాటుగా చిన్న పార్టీలు, రిజిష్టర్డ్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులూ ఉన్నారు. కాగా లోక్‌సభ స్థానానికి జరిగే ఈ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు వస్తాయనే ప్రచారం జరుగుతోండగా ఇలా రెండు రోజుల్లో ఒక్కటీ దాఖలు కాకపోవడం గమనార్హం. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అచ్చంపేట, అలంపూర్‌లాంటి ఎస్సీ రిజర్వుడు శాసన సభ స్థానాలు సైతం ఉన్నాయి. దళిత సంఘాలు, ఉద్యమాలు, చైతన్యం గల నాయకులూ అధికమే. అలాంటి నియోజకవర్గం నుంచి నామినేషన్ల నిశ్శబ్ధం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...