ప్రజల కల నెరవేర్చిన..టీఆర్‌ఎస్


Thu,November 15, 2018 01:27 AM

-చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తా
-కేసీఆర్ ఆదేశం, ప్రజల అభీష్టం మేరకు పోటీ
-అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తా
-వనపర్తి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
-నామినేషన్ అనంతరం మీడియాతో సమావేశం
వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల స్వప్నాన్ని నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్ ఆధ్వర్యాన ఏర్పాటైన టీఆర్‌ఎస్ పార్టీదేనని ఆ పార్టీ వనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధన అనంతరం 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు అధికార పగ్గాలిచ్చి సంపూర్ణంగా మద్దతు పలికారన్నారు. అమరుల త్యాగఫలం నెరవేరేందుకు టీఆర్‌ఎస్ సర్కారు కృషి చేసిందని వివరించారు. నాలుగున్నరేళ్లుగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. బుధవారం వనపర్తి ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి చంద్రారెడ్డి సమక్షంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి ప్రజాదరణ పొందిందన్నారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని నడిపిన టీఆర్‌ఎస్‌కే ఉందన్నారు. మిగతా పార్టీలకు ఎవరికీ ఆ ఉద్దేశం లేదని అర్థం అయిపోయిందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలోనే వనపర్తి నుంచి ఈ సారి జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయాలని కేసీఆర్ తనను ఆదేశించారన్నారు. నియోజకవర్గంలోని వేలాది మంది నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు నామినేషన్ వేసినట్లు తెలిపారు.

రెండు సెట్ల నామినేషన్లను సాదాసీదాగా వేసినట్లు వివరించారు. నియోజకవర్గంలో ఉండే ప్రజలంతా సంపూర్ణంగా వారి మద్దతును, ఆశీర్వాదాన్ని, సహకారాన్ని అందిస్తున్నారన్నారు. ఇప్పటికే నియోజకవర్గం అంతా రెండు విడతలుగా పూర్తి స్థాయిలో ప్రచారం పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. 79 వేల మంది సభ్యత్వం కలిగిన టీఆర్‌ఎస్ పార్టీ అజేయమైన శక్తిగా వనపర్తిలో రూపుదిద్దుకుందన్నారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించే నియోజకవర్గాల్లో వనపర్తి కూడా ఒకటిగా ఉండబోతోందన్నారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు నియోజకవర్గం అభివృద్ధికి, పార్టీ ఎదుగుదలకు కఠోరమైన శ్రమ చేశారని వివరించారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల సంపూర్ణ మద్దతు తమకు లభిస్తోందని, ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారని నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని, పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నామని ఆయన వివరించారు. ప్రజాదరణ సంపూర్ణంగా తమకే ఉందని, నియోజకవర్గ ఓటర్లు తనకు మద్దతు తెలిపి ఆదరిస్తారనే విశ్వాసం ఉందన్నారు. భారీ మెజార్టీతో విజయం సాధించి.. ప్రజల ఆకాంక్షలను తీర్చి ఈ ప్రాంతానికి భవిష్యత్తులో మరింత న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో గతంలో ఎవరూ చేయనంత అభివృద్ధి చేసి చరిత్రలో నిలిచిపోయేలా పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల నుంచి అదే స్థాయిలో మద్దతు కోరుతున్నట్లు తెలిపారు.

129
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...