బరిలో ముగ్గురు..!


Wed,November 14, 2018 01:59 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : వనపర్తి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి నిరంజన్ రెడ్డి గత శాసన సభ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి ప్రజల్లోనే ఉన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినా.. ప్రజలకు మాత్రం దూరంగా వెళ్లలేదు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిలో వనపర్తి అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డారు. పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వనపర్తిలో ప్రతిపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్ పార్టీ కేడర్ బలంగా తయారైంది. మిగతా పక్షాలకు కేడర్ కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇక సెప్టెంబర్ 6న పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత వనపర్తి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నిరంజన్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గంలోని పెబ్బేరు, శ్రీరంగాపూర్, వనపర్తి, పెద్దమందడి, ఖిల్లాఘణపరం, గోపాల్‌పేట, రేవల్లి మండలాల్లో ఓ విడత ప్రచారం కూడా పూర్తి చేశారు.

నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారం.. రాత్రి ఏదో గ్రామంలో పల్లె నిద్ర చేయడం, స్థానికంగా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని నోట్ చేసుకునడం నిరంజన్ రెడ్డి దినచర్యగా మారింది. ప్రచారం సందర్భంగా ఎన్నో సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకుపోయారు. వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని హామీ కూడా ఇచ్చారు. వాడవాడలా తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని నిరంజన్ రెడ్డి ప్రజలను కోరారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ఈసారి మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో వివరిస్తూ ముందుకు సాగారు. నిరంజన్ రెడ్డి సతీమణి వాసంతి సైతం గత రెండు నెలలుగా నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. అన్ని గ్రామాలు పర్యటిస్తున్నారు. మహిళా ఓటర్లను ఆమె ఆకట్టుకుంటున్నారు. ప్రజల నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థికి విశేష స్పందన వచ్చింది. మిగతా పక్షాలతో పోలిస్తే టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రచారంలో ముందంజలో కనిపిస్తున్నారు.

ఇప్పుడిప్పుడే బీజేపీ, ప్రారంభించని కాంగ్రెస్..
ఈనెల 2వ తేదీన బీజేపీ అధిష్టానం రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు సంబంధించి రెండో విడత జాబితా ప్రకటించింది. ఆ జాబితాలోనే వనపర్తి అభ్యర్థిగా కొత్త అమరేందర్ రెడ్డికి కేటాయించారు. ఆ తర్వాత ఆయన ప్రచారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఆ పార్టీకి బలమైన కేడర్ లేకపోవడం ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా వచ్చేందుకు ఎంతో ఆలస్యమైంది. సోవారం రాత్రి ప్రకటించిన జాబితాలో వనపర్తి అభ్యర్థిగా చిన్నారెడ్డిని ఖరారు చేశారు. టిక్కెట్ ఎవరికి వస్తుందో తెలియక ఇన్నాళ్లు తర్జనభర్జన పడిన కాంగ్రెస్ శ్రేణులకు కనీసం అభ్యర్థిని ప్రకటించారన్న సంతోషమైతే మిగిలింది. కానీ నేటికీ కాంగ్రెస్ నుంచి కానీ మహాకూటమి నుంచి కానీ నేతలెవ్వరూ ప్రచారంలో పాల్గొనలేదు. అక్కడక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు కానీ నేరుగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు మాత్రం అభ్యర్థించలేదు. ఎన్నికల సందది కనిపిస్తోంది కానీ కేవలం ప్రచారంలో నిరంజన్ రెడ్డి మాత్రమే ప్రజలకు కనిపిస్తున్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

రెండో రోజూ నామినేషన్లు నిల్..
ఈ నెల 12 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. కానీ వనపర్తి నియోజకవర్గం నుంచి మంగళవారం వరకు ఒక్కటంటే ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయలేదు. సోమ, మంగళవారాల్లో మంచి ముహూర్తాలు లేనందునే అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదని తెలుస్తోంది. బుధవారం నాడు దివ్యమైన ముహూర్తం ఉన్నందున ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. వనపర్తి ఆర్డీవో రిటర్నింగ్ అధికారిగా ఉండగా.. నామినేషన్లకు సంబంధించి ఆర్డీవో కార్యాలయం వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. ఇక సీఎం కేసీఆర్ సైతం గజ్వేల్‌లో బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్న సంగతి తెలిసిందే.

201
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...