చెయ్యిస్తున్నారు..!


Sat,November 10, 2018 01:51 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న సామేతకు విరుద్ధంగా మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి తీరు ఉన్నది. తన స్వగ్రామం జయన్న తిరుమలాపూర్, సొంత మండలం గోపాల్‌పేటతో పాటు అన్ని గ్రామాల్లో కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేస్తున్న కార్యకర్తలు హస్తానికి గుడ్‌బై చెబుతున్నారు. అభివృద్ధి కోసం శ్రమించే నిరంజనుడి వెంటే మేమంతా అంటూ గులాబీ పార్టీలోకి చేరుతున్నారు. తన సొంత మండలంలోనే ప్రజలు హస్తానికి గుడ్‌బై చెబుతుంటే ఇక నియోజకవర్గంలో హస్తం పరిస్థితి ఏమైతుందో అని పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి సభలు పెట్టేందుకు గోపాల్‌పేట మండలం బుద్దారం గ్రామానికి వెళ్లగా.. ఇన్నేళ్లు మీరు మాకు చేసిన సేవలు చాలు.. గో బ్యాక్ అంటూ ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేశారు. తన సొంత మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడి గులాబీ తీర్థం పుచ్చుకుంటుంటే దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 18వ తేదీన తాతలు, ముత్తాతల కాలం నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న గోపాల్‌పేట మండలం చెన్నూర్ వెనుకటి తండా ప్రజలు 400 మంది కాంగ్రెస్ తీరు పట్ల విసుగుచెంది తండా మొత్తం మూకుమ్మడిగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు.

రెండు రోజుల కిందట కాంగ్రెస్ కంచుకోటలా ఉన్న గోపాల్‌పేట, రేవల్లి మండలాల్లో నిరంజన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ప్రచారాన్ని నిర్వహిస్తుండగా నిత్యం వందల సంఖ్యలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లోకి స్వచ్ఛందంగా వచ్చి చేరారు. సొంత గ్రామానికి, మండలానికి సాగునీరందించక ఇన్నేళ్లు పదవిని అనుభవించి ముసిముసి నవ్వులతో కళ్లబొళ్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేశాడే తప్ప గ్రామానికి, మండలానికి చేసిందేమీ లేదని టీఆర్‌ఎస్‌లో చేరుతున్న కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. ఇటీవలే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి ఎంజే-2ఏ కాలువ ద్వారా చిన్నారెడ్డి సొంత గ్రామం జయన్నతిరుమలాపూర్‌తో పాటు మున్ననూర్ గ్రామానికి నిరంజన్‌రెడ్డి సాగునీరందించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా నాలుగుసార్లు, మంత్రిగా ఒకసారి పనిచేసినా సొంత గ్రామానికి సాగునీరు అందించలేదని, గత ఎన్నికల్లో ఓటమి చెందినా నిరంజన్‌రెడ్డి మాత్రం ప్రజల వెంటే ఉండి సుమారు 70 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించారని స్థానికులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ తన సొంత గ్రామానికే సాగునీరు అందించలేక మాజీ ఎమ్మెల్యే వైఫల్యం చెందగా నిరంజన్‌రెడ్డి మాత్రం పట్టువదులకుండా రైతుల పక్షాన నిలిచి సాగునీరు వచ్చేందుకు కృషి చేశారని అంటున్నారు.

రైతులకు సాగునీరు అందిస్తూ రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నందున కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా, తమకు చెప్పకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ చిన్నారెడ్డి తమను అవమానిస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట ఖిల్లాఘణపురం వైస్‌ఎంపీపీ ఉమామహేశ్వరి, సుభాష్‌గౌడ్ దంపతులు కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలో లేకున్నా కాంగ్రెస్‌లో కొనసాగామని, అలాంటి మాకు సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరించినందుకు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఇలా ఒక్కచోట కాకుండా నియోజకవర్గం మొత్తం ఇలాగే ఉండడంతో పార్టీ నాయకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...