ఆదరించండి.. ఆశీర్వదించండి..


Sat,September 8, 2018 02:48 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : సారవంతమైన భూములున్నా నీళ్లు లేక ఇన్నాళ్లు పాలమూరు రైతన్న వలసలు పోయిండు.. నీళ్ల కోసం అన్నదాతలు ఆగమాగమైండ్రు. పిల్లా పాప గొడ్డు గొదుమ వదిలేసి బతుకుదెరువు కోసం ముంబయి బాట పట్టిండు. అయితే గత సమైక్య పాలకులు పాలమూరు వలస కూలీల కన్నీటి గాథలను కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నరు. పాలమూరు వలస బతుకులను చూపించి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకున్నారు. సమైక్య పాలకులు తమ ప్రాంతానికి ఆ నిధులను మళ్లించుకున్నారు. కానీ వనపర్తికి ప్రాతినిథ్యం వహించిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులైండ్రు. పెద్ద పెద్ద పదవులు అనుభవించిండ్రు. కానీ ఏం చేసిండ్రు.. ఏమీ చేయలే. పక్కపోంటి ఎంజీకేఎల్‌ఐ ప్రధాన కాలువ పోతున్నా.. వనపర్తికి సాగునీరు కావాలని కూడా అడగలే. అప్పుడు వీళ్ల నోళ్లు మూసుకుపోయినయ్. వారికి కావాల్సింది పదవులు మాత్రమే.. స్థానిక రైతుల కష్టాలు వాళ్లకు పట్టలే. రైతులు ఆశలు వదులుకున్నారు. ఇక తమ కష్టాలు తీరవనుకున్నారు. అప్పుడే దేవుడిలా సీఎం కేసీఆర్ వచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిండ్రు. ఆయన పోరాటం వృథా కాలే. స్వరాష్ట్రం సిద్ధించ్చింది. సమైక్య పాలకుల దుర్మార్గపు పాలన అంతమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు వనపర్తి కష్టాలు తీరాయి. గతంలో కనీసం తాగునీటికి కూడా ఇక్కడ కష్టాలే.. ఇప్పుడు తాగు, సాగు నీరు అందుతోంది.

గత పాలకులు చేసిన దుర్మార్గపు డిజైన్‌లకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి సీఎం కేసీఆర్ సహకారంతో చరమగీతం పాడిండ్రు. రావని చెప్పిన చోటు నుంచే 70వేల ఎకరాల ఆయకట్టును సాధించిండ్రు. ఇప్పుడు ఆ కష్టాలు లేవు, కన్నీళ్లు లేవు. వలసలు వెళ్లిన అన్నదాతలు తిరిగి వచ్చేసిండ్రు. కృష్ణానది జలంతో బంగారు పంటలు పండించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓడినా కూడా ప్రజలను వారి కష్టాలను తీర్చేందుకు నిరంజన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. నీళ్లు తీసుకువచ్చిండ్రు. ఇప్పుడు నియోజకవర్గంలో ఎక్కడ చూసిన సాగునీరే. గలగలా పారే కృష్ణమ్మే దర్శనమిస్తోంది. సాగునీటి విజయ గాథే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని నియోజకవర్గంలో ఉన్న 80వేల మంది రైతాంగానికి వివరిస్తూ నిరంజన్ రెడ్డి ఓ కరపత్రాన్ని విడుదల చేసిండ్రు. ఖిల్లాఘనపురం మండలం మామిడిమాడ, సల్కలాపురం గ్రామాల్లో వాటిని ఇంటింటికి తిరిగి రైతులకు అందచేసిండ్రు. తనను ఆశీర్వదించాలని కోరిండ్రు.

ఏమున్నదీ కరపత్రంలో..
వనపర్తి నియోజకవర్గంలోని రైతులు సాగునీటి కోసం పడిన కష్టాలు, వాటికి చరమగీతం పాడిన విధానం తెలిపిండ్రు. సమైక్య సర్కారు కుట్రలను చెప్పిండ్రు. రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకున్న తీరును వివరించిండ్రు. కరెంట్ కష్టాలకు ముగింపు పలుకుతూ 24 గంటల ఉచిత నిరంతర విద్యుత్ అందించిన విషయాన్ని చెప్పిండ్రు. విత్తనాలు, ఎరువుల సమస్య లేకుండా చేసిన తీరును వెల్లడించిండ్రు. భూ రికార్డులు నవీకరణ, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ.. ఇలా ఒక్కటేమిటి చేసిన అభివృద్ధిని ఆ కరపత్రంలో వివరించిండ్రు. వేగంగా సాగుతున్న పాలమూరు ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను ఏకరువు పెట్టిండ్రు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను అడ్డుకునేందుకు 164 కేసులు వేసిన విషయాన్ని వెల్లడించిండ్రు. వనపర్తి నియోజకవర్గానికి సాగు నీరు లేకుండా చేసిన గత పాలకుల దుర్నీతిని ఎండగట్టిండ్రు. ఎంజీకేఎల్‌ఐ ప్రధాన కాలువ తలాపునే పోతున్న ఇన్నాళ్లు సాగునీళ్లు లేకుండా చేసిన స్థానిక నేతల నిర్లక్ష్యానికి చరమగీతం పాడిన నిరంజన్ రెడ్డి.. సీఎం కేసీఆర్ సహకారంతో ఎంజీకేఎల్‌ఐ ప్రధాన కాలువ నుంచి డిస్ట్రిబ్యూటరీ ఏర్పాటు చేసి బుద్ధారం కుడి ఎడమ కాలువలతో పాటు, ఘనపురం బ్రాంచి కెనాల్‌తో కృష్ణమ్మను చెంతకు తీసుకువచ్చిన అంశాన్ని అన్నదాతకు తెలిపిండ్రు. రికార్డు స్థాయిలో నాలుగేళ్లలో సుమారు 70వేలకు పైగా ఆయకట్టు సాధించిన తెలంగాణ సర్కారు గొప్ప తనాన్ని వెల్లడించిండ్రు. ఇన్ని విషయాలు రైతులకు వివరిస్తూ వారిని ఉద్దేశించి ప్రచురించిన 80వేల కరపత్రాలను ఇంటింటికి తిరిగి అందచేస్తున్నరు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...