‘డబుల్‌' వేగం పెంచండి


Thu,December 5, 2019 12:04 AM

-మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం
-త్వరితగతిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం
-మున్సిపాలిటీల్లో రూ.5కే భోజనం
-రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన డబుల్‌ బెడ్‌రూం పథకాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి డబుల్‌ బెడ్‌రూం, మున్సిపాలిటీలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపల్‌ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మించాలని తెలిపారు. ఇందుకు సంబంధిత నియోజకవర్గాల శాసన సభ్యులు వెంటనే ప్రతిపాదనలను అందజేయాలన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికిగాను యుద్ధ ప్రతిపాదికన స్థలాలను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇప్పటివరకు ప్రారంభించని ఇండ్ల నిర్మాణాలను 15 రోజుల్లో ప్రారంభించాలన్నారు.

ఇండ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుక బాధ్యతను కలెక్టర్‌కు అప్పగించినట్లు మంత్రి వెల్లడించారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం అయిన తరువాత ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా 30 రోజుల ప్రణాళికలో భాగంగా ట్రాక్టర్లు కొనుగోలు చేసేందుకు ఆర్థిక స్థోమత లేని గ్రామ పంచాయతీలకు జిల్లా మినరల్‌ ఫండ్‌ నుంచి నిధులు విడుదల చేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని ఎమ్మెల్యేలకు మంత్రి సూచించారు.

జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లను సమకూర్చుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను బాగు చేసేందుకుగాను మినరల్‌ ఫండ్‌ నిధులను వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో త్వరలో రూ.5ల భోజన పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల్లో రూ.5కే భోజన పథకాన్ని త్వరితగతిన ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌కు మంత్రి ఆదేశించారు.

రూ.5లకే అన్నం, పప్పు, సాంబర్‌, కూరగాయలతో కూడిన రుచికరమైన భోజనాన్ని సమకూర్చనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జిల్లా కేంద్రంలో నైట్‌ షెల్టర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామని, ఇందు కోసం శాశ్వత భవనాన్ని నిర్మించాలని తెలిపారు. పట్టణ ప్రాంతంలోని మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన భనవ నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. వికారాబాద్‌ సమీపంలో నిర్మించతలపెట్టిన క్రీడా స్టేడియాన్ని పట్టణంలో నిర్మిస్తే సౌకర్యాలు కల్పించేందుకు సులువు అవుతుందని అధికారులకు మంత్రి సబితారెడ్డి సూచించారు. కార్యక్రమంలోఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, యాదయ్య, నరేందర్‌రెడ్డి, ఆనంద్‌, రోహిత్‌రెడ్డి, కలెక్టర్‌ ఆయేషా, జిల్లా రెవెన్యూ అధికారి మోతీలాల్‌, డీఆర్డీవో జాన్సన్‌, అధికారులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...