వడ్డీ రాయితీ విడుదల


Mon,November 18, 2019 11:56 PM

-జిల్లాకు రూ.19.19కోట్ల వడ్డీ బకాయి
-12,048మంది ఎస్‌హెచ్‌జీలకు లబ్ధి
-నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమకానున్న వడ్డీ
-హర్షం వ్యక్తం చేస్తున్నస్వయం సహాయక సంఘాల సభ్యులు
- జిల్లాలో 14వేల సంఘాలు

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : స్వయం సహాయక సంఘాలకు శుభవార్త. గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వడ్డీ రాయితీని ప్రభుత్వం విడుదల చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా మరింత బలోపేతమయ్యే విధంగా వడ్డీ డబ్బును ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.650కోట్ల నగదును విడుదల చేసిన ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు చేయూతనందించింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి యాక్టివ్‌గా పనిచేస్తున్న స్వయం సహాయక సంఘాలకు సరిపడా రుణాలను మంజూరు చేస్తూ మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా చర్యలు చేపట్టింది. అయితే 2018-19 ఆర్థిక సంవత్సరంతోపాటు 2019-20ఆర్థిక సంవత్సరానికిగాను స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన రుణాలకు సంబంధించిన వడ్డీ రాయితీని ప్రభుత్వం విడుదల చేసింది. రాయితీ డబ్బు నేరుగా స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. వడ్డీ రాయితీ విడుదలతో జిల్లాలోని 12,048 స్వయం సహాయక సంఘాలకు లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా ఏ సంఘాలైతే రుణాలు తీసుకొని రెగ్యులర్‌గా చెల్లిస్తున్నాయో సంబంధిత సంఘాలు తీసుకున్న రుణాలకు మాత్రమే వడ్డీ రాయితీ వర్తించనుంది. ప్రతి సంఘాన్ని మరింత బలోపేతం చేసి ప్రతి స్వయం సహాయక సంఘం యాక్టివ్‌గా కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

రూ.19.19కోట్ల వడ్డీ రాయితీ విడుదల..
2018-19 ఆర్థిక సంవత్సరంతోపాటు 2019-20ఆర్థిక సంవత్సరానికిగాను స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన వడ్డీలేని రుణాల వడ్డీ రాయితీని ప్రభుత్వం విడుదల చేసింది. అయితే జిల్లాలో రెండేళ్లలో పెండింగ్‌లో ఉన్న రూ.19.19 కోట్ల వడ్డీ డబ్బును ప్రభుత్వం విడుదల చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.15.77కోట్ల వడ్డీ రాయితీ పెండింగ్‌లో ఉండగా ఈ ఏడాది ఇప్పటివరకు మంజూరైన వడ్డీలేని రుణాలకు పెండింగ్‌లో ఉన్న రూ.3.34 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం విడుదల చేసింది. అయితే స్వయం సహాయక సంఘాలకు ఆర్థికంగా చేయూతను అందించేందుకుగాను ప్రభుత్వం వడ్డీలేని రుణాలను అందజేస్తుంది. అదే విధంగా వడ్డీలేని రుణాలకు సంబంధించి మహిళా సంఘాలకు స్వయం ఉపాధి కోసం రూ.లక్ష వరకు మంజూరు చేస్తూ స్వయం సహాయక సంఘాల సభ్యులను ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తుంది. అయితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన వడ్డీలేని రుణాలకు సంబంధించి..

2014-15 ఆర్థిక సంవత్సరంలో 8,712 స్వయం సహాయక సంఘాలకు రూ.13.99కోట్లు, 2015-16లో 11,357 స్వయం సహాయక సంఘాలకు రూ.13.79కోట్లు, 2016-17లో 11,642 స్వయం సహాయక సంఘాలకు రూ.12.82కోట్లు, 2017-18లో 12,153 స్వయం సహాయక సంఘాలకు రూ.12.49 కోట్లు, 2018-19లో 12,048 స్వయం సహాయక సంఘాలకు రూ.15.77కోట్లు, 2019-20గాను ఇప్పటి వరకు 11,213 స్వయం సహాయక సంఘాలకు రూ.3.34కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేయడం జరిగింది. కాగా, ప్రభుత్వం ఈ ఐదేండ్లలో జిల్లాలో మహిళా సంఘాలకు రూ.72కోట్లకు పైగా రుణాలను అందించింది. మరోవైపు మహిళల వ్యాపారం, ఉపాధి కోసం రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు స్త్రీనిధి రుణాలను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అయితే స్త్రీనిధి పథకంలో భాగంగా రుణాలు తీసుకున్న స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంకులు నిర్ధేశించిన మేరకు వడ్డీతోపాటు ప్రతీ నెల వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో స్త్రీనిధి రుణాల మంజూరుకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.64.01కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు రూ.14.54కోట్ల రుణాలను జిల్లా యంత్రాంగం మంజూరు చేసింది. అత్యధికంగా దోమ, బొంరాసుపేట్‌ మండలాల్లోని స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి రుణాలను మంజూరు చేశారు.

మొండికేసిన సంఘాలపై ప్రత్యేక దృష్టి...
జిల్లాలో మొండికేసిన స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలను రికవరీ చేయడంతోపాటు స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలోని పనిచేయని సంఘాల్లో కదలిక తీసుకొచ్చేందుకు తిరిగి యాక్టివ్‌గా పని చేసేందుకుగాను కొత్తగా రుణాలను మంజూరు చేయమని కూడా హెచ్చరిస్తూ, మొండికేసిన స్వయం సహాయక సంఘాల్లో ఏదో విధంగా మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా 996 స్వయం సహాయక సంఘాల నుంచి రూ.22.26కోట్ల రుణాలను రికవరీ చేయాల్సి ఉంది. అయితే జిల్లాలో అత్యధికంగా బషీరాబాద్‌, పూడూర్‌, తాండూర్‌ మండలాల్లో మొండికేసిన సంఘాలు అధికంగా ఉన్నాయి. బషీరాబాద్‌ మండలంలో 164సంఘాల నుంచి రూ.3.64కోట్లు, పూడూర్‌లో 116సంఘాల నుంచి రూ.3.57కోట్లు, తాండూర్‌లో 126 సంఘాల నుంచి రూ.307కోట్లు, ధారూర్‌లో 101సంఘాల నుంచి రూ.2.85కోట్లు, పరిగిలో 56సంఘాల నుం చి రూ.1.70కోట్లు, బొంరాసుపేట్‌లో 63సంఘాల నుంచి రూ.1.55కోట్లు, మోమిన్‌పేట్‌లో 53సంఘాల నుంచి రూ. 1.16కోట్లు, పెద్దేముల్‌ మండలంలో 35సంఘాల నుంచి రూ.80.47లక్షలు, మర్పల్లిలో 25సంఘాల నుంచి రూ. 70.54లక్షలు, యాలాలలో 40సంఘాల నుంచి రూ.76. 85లక్షలు, దోమలో 51సంఘాల నుంచి రూ.71.66లక్షలు, కుల్కచర్లలో 58సంఘాల నుంచి రూ.51.92లక్షలు, వికారాబాద్‌లో 27సంఘాల నుంచి రూ.40.32లక్షలు, నవాబుపేట్‌ మండలంలో 26సంఘాల నుంచి రూ.38.52 లక్షల రుణాలను రికవరీ చేయాల్సి ఉంది.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles