నవాబుపేట : మండల పరిధిలోని ఎల్లకొండ శివాలయంలో కార్తిక సోమవారం సందర్భంగా నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ఆలయంలో కార్తిక సోమవారం పూజలు చేశారు. ఆలయంలో పర్యటించి ఆలయం విశిష్టత పూజారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె మొదటిసారి మండలానికి రావడంతో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీపీ భవాని, జడ్పీటీసీ జయమ్మ, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, స్థానిక సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ భరత్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రంగారెడ్డి, మల్రెడ్డి, నాయకులు, సర్పంచ్‌లు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయంలో ఆమె అందరిని ఆప్యాయంగా పలకరించారు.
ఈ సందర్భంగా పూజారులు ఆలయ చరిత్రను వివరించారు. తొలి కాకతీయుల పాలనలో ఆలయాన్ని నిర్మించినట్లు పురావస్తుశాఖ వెల్లడించిందని తెలిపారు. తెలంగాణ శ్రీశైలంగా కూడా భక్తులు కొలుస్తారని వివరించారు. శ్రావణమాసం, కార్తికమాసాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వార్లను దర్శించుకుంటారని వివరించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలని సర్పంచ్ ఆధ్వర్యంలో ఆమెకు వినతి పత్రాన్ని అందజేశారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. పర్యటక కేంద్రంగా తీర్చి దిద్దితే ఆలయం అభివృద్ధి చెందడంతోపాటు స్థానికంగా కొందరికి ఉపాధి లభిస్తుందని వారు అన్నారు.