పోటెత్తిన భక్తులు


Mon,November 18, 2019 12:00 AM

ధారూరు : ప్రభువును ప్రార్థించిన ప్రతి ఒక్కరికి సుఖసంతోషాలు కలుగుతాయని హైదరాబాద్, బెంగళూరు రిజియన్ బిషప్‌లు ఎంఏ డానియాల్, ఎన్‌ఎల్ కర్కరేలు తెలిపారు. ఆదివారం ధారూరు మండల పరిధిలోని ధారూరు స్టేషన్, దోర్నాల్ గ్రామాల మధ్య కాగ్నానది ఒడ్డున 97వ ధారూరు మెథడిస్టు క్రైస్తవ జాతర ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్‌లు మాట్లాడుతూ 97 ఏండ్లుగా ధారూరు ప్రాంతంలో నిర్వహిస్తున్న జాతరకు భక్తుల సంఖ్య ప్రతి ఏటా భారీగా పెరుగుతుందన్నారు. 150మందితో ప్రారంభించిన జాతర నేడు 10లక్షలకు పెరిగిందన్నారు. అనంతరం రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ కమ్రూద్దీన్ మాట్లాడుతూ ధారూరు మండల కేంద్రంలోని మెథడిస్టు జాతర ఇంత పెద్ద ఎత్తున జరుగడం చాలా సంతోషమన్నారు. జాతర అభివృద్ధికి మైనార్టీ కమిషన్ నుంచి నిధులు మంజూరు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉన్నప్పుడే మనస్సులు సంతోషంగా ఉంటాయన్నారు. భక్తులకు అవసరమైన సదుపాయాలు ప్రతి ఏటా కల్పిస్తామన్నారు. చాలా కాలంగా సాగుతున్న ఈ జాతరకు క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రార్థనలు చేస్తుంటారని తెలిపారు.

జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి శాంతిభద్రతలను కాపాడారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాగు నీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు సంబంధిత అధికారులు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం భక్తులు ప్రార్థన మందిరంలో ఏర్పాటు చేసిన హుండీల్లో కానుకలు సమర్పించారు. మేకలు, కోళ్లను భక్తులు ఏసు ప్రభుకు కానుకగా అందించారు. అనంతరం మేకలను, కోళ్లను వేలం పాట నిర్వహించారు. జిల్లా ఎస్పీ నారాయణ కుటుంబ సభ్యులతో వచ్చి జాతరలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జాతర ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ శంకర్‌లుక్, మెథడిస్టు జాతర ప్రధాన కార్యదర్శి దయానంద్, కోశాధికారి స్వీవెన్, అమెరికాకు చెందిన క్రైస్తవ మత పెద్ద మెసెల్ రికర్, స్యాండిమైసెల్‌రికార్ (యూఎస్‌ఏ), కర్ణాటక ఎమ్మెల్యే బందెప్ప, ఎస్పీ నారాయణ, అడిషనల్ ఎస్పీ ఎంఏ. రషీద్, డీఆర్‌వో, మైనార్టీ జిల్లా అధికారి మోతీలాల్, ఆయా జిల్లాల పాస్టర్లు, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...