స్వచ్ఛ గ్రామాలే..సర్కారు లక్ష్యం


Fri,November 15, 2019 11:31 PM

-ప్లాస్టిక్‌ను నిషేధించాలి.. నార సంచులు వాడాలి
- చెత్త తరలింపునకు ట్రాక్టర్లను కొనుగోలు చేయాలి
- డిసెంబరు 31లోగా మరుగుదొడ్లు నిర్మించుకోవాలి
- కలెక్టర్ ఆయేషా
- బొంరాస్‌పేట మండలంలోని నాగిరెడ్డిపల్లి,లింగన్‌పల్లి గ్రామాల్లో పర్యటన

బొంరాస్‌పేట : గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మిం చి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆమె మండలంలోని నాగిరెడ్డిపల్లి, లింగన్‌పల్లి గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలను పరిశీలించారు. పలువురి ఇళ్ల ముందుకు వెళ్లి ఇంకుడు గుంతల నిర్మాణానికి ముగ్గు లు పోయించి పనులు ప్రారంభించారు. నాగిరెడ్డిపల్లి గ్రామ ఐక్య సహకారం సంఘం కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ను ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని చెప్పారు. గ్రామాల్లో ప్రజలు, మహిళలు ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలని సూచించారు. ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, డబ్బాలను సంచుల్లో నిల్వచేసి ప్రతి పదిహేను రోజులకోసారి నిర్వహించుకునే మహిళా సంఘం సమావేశాలకు వ్యర్థాలను నిల్వచేసిన సంచులను తీసుకుని వచ్చి డీఆర్‌సి కేంద్రాలలో తూకం వేసి ఇవ్వాలని సూచించారు.

ఈ విధంగా తూకం వేసిన ప్లాస్టిక్ వ్యర్థాలకు డబ్బులు కూడా చెల్లిస్తారని అన్నారు. కూరగాయలు కొనడానికి, దుకాణాలకు వెళ్లేటప్పుడు బట్టతో తయారు చేసిన బస్తాలను తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకున్న మాదిరిగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. నాగిరెడ్డిపల్లిలో రెండు రోజుల్లో ఇంటింటికీ ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోని వారు వచ్చే నెల 31వ తేదీ వరకు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి కొంత ఆలస్యమైనా బిల్లులు తప్పక వస్తాయని కలెక్టర్ భరోసా ఇచ్చారు.

రుణాలు తీసుకుని ట్రాక్టర్లు కొనండి
గ్రామాల్లో చెత్తను తరలించడానికి బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని ట్రాక్టర్లు కొనాలని కలెక్టర్ సర్పంచ్‌లకు సూచించారు. మండలంలోని లింగన్‌పల్లి గ్రామంలో సర్పంచ్ కాశప్పను మీ గ్రామ పంచాయతీలో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ట్రాక్టర్‌ను కొన్నారా అని కలెక్టర్ ప్రశ్నించగా పంచాయతీ ఖాతాలో రూ. 2లక్షలే ఉన్నాయని ట్రాక్టర్ కొనుగోలుకు సరిపోవని చెప్పారు. దీంతో స్పందించిన కలెక్టర్ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని ట్రాక్టర్లు కొనాలని ఆదేశించారు. లింగన్‌పల్లిలో పవర్ వీక్ సందర్భంగా విద్యుత్ స్తంభాలు లేక ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ తీసుకున్న వైర్లు వేలాడుతున్నాయని, 15స్తంభాలు కావాలని వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి కలెక్టర్‌ను కోరారు. దీంతో కలెక్టర్ ట్రాన్స్‌కో ఎస్‌ఈకి ఫోన్ చేసి స్తంభాలు సమకూర్చాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరిందని కొత్త భవనానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ కాశప్ప కలెక్టర్‌ను కోరారు.

మహిళా సంఘాలకు కలెక్టర్ కితాబు
నాగిరెడ్డిపల్లి మహిళా సంఘాల మహిళలకు కలెక్టర్ కితాబిచ్చారు. గ్రామంలోని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకుని జిల్లాలో మొదటి ఓడీఎఫ్ గ్రామంగా గుర్తింపు పొందిందని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తారని ఎంపీడీవో హరినందనరావు చెప్పగా శభాష్ అంటూ మెచ్చుకున్నారు. గ్రామంలో కొన్ని ఇళ్ల ముందు ఉన్న పెంట కుప్పలను తొలగించాలని కలెక్టర్ సూచించగా పెంట కుప్పలను తొలగించి వాటిని పొలాల వద్దే వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా.. పొలాలకు వెళ్లడానికి తమకు రోడ్డు సౌకర్యం లేదని మహిళలు కలెక్టర్‌కు వివరించారు.

ఉపాధిహామీలో అప్రోచ్ రోడ్డు నిర్మించాలని ఈసీ సత్యనారాయణను ఆదేశించారు. అదే విధంగా పొలాల వద్ద నాడెపు కంపోస్టు గుంతలను నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. రేషన్ కార్డు ల్లో పేర్లు లేకపోవడం వల్ల తమకు బియ్యం రావడం లేదని లింగన్‌పల్లిలో కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, సైట్ ఓపేన్ కాగానే పేర్లు నమోదు చేసకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ చౌహన్ అరుణాదేశు, వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మండల ప్రత్యేకాధికారి పుష్పాలత, సర్పంచ్‌లు హ న్మంతు, కాశప్ప, ఎంపీడీవో హరినందనరావు, తహసీల్దార్ వీవీ వరప్రసాదరావు, మండల పంచాయతీ అధికారి పాండు, ఏపీఎం అంజిలయ్య పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...