బీమాతో.. ధీమా


Thu,November 14, 2019 11:46 PM

-రైతు ఏ విధంగా మృతి చెందినా బీమా వర్తింపు
-రైతు కుటుంబాలకు అండగా సీఎం కేసీఆర్
-జిల్లాలో 764మంది కుటుంబాలకు చేయూత
-జిల్లా వ్యాప్తంగా అందిన రూ.38.20కోట్ల బీమా సొమ్ము
-రైతు మృతి చెందిన వారంలోగా రూ.5లక్షల పరిహారం ఖాతాల్లో జమ
-జిల్లాలో మొత్తం 1.83లక్షల మంది రైతులు
-పథకానికి 1,02,922మంది రైతులు అర్హులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రైతు సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ఐదేళ్ల పాలనలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి 9గంటల విద్యుత్‌ను సరఫరా చేసిన రాష్ట్ర ప్రభుత్వం, రెండేళ్లలోనే విద్యుత్ రంగంలో నవశకం మొదలయ్యిందనే విధంగా వ్యవసాయానికి ఉచితంగా 24గంటలు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. అదేవిధంగా రూ.లక్ష రుణమాఫీని పూర్తి చేసిన ప్రభుత్వం, మరోసారి రూ.లక్ష రుణమాఫీని చేసేందుకు కసరత్తు చేస్తున్నది.

రైతు కుటుంబాలకు భరోసా...
మరోవైపు రైతులు అప్పుల ఉబిలో చిక్కుకోకుండా పంటలను సాగు చేసేందుకు పెట్టుబడి సాయందించేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. అదేవిధంగా రైతు మృతి చెందితే సంబంధిత రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకుగాను రూ.5లక్షల బీమాను ప్రభుత్వం అందజేస్తూ బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తుంది. అయితే మృతి చెందిన రైతు కుటుంబ సభ్యులకు తొలుత రూ.5లక్షల బీమా డబ్బును బాండ్ల రూపంలో అందజేసిన ప్రభుత్వం ప్రస్తుతం నేరుగా సంబంధిత రైతు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది.

764మంది రైతు కుటుంబాలకు లబ్ధి
జిల్లాలో రైతుబీమా పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ కారణాలతో మృతి చెందిన 764మంది రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.38.20 కోట్లను వారి కుటుంబ సభ్యులకు పరిహారాన్ని అందజేసిన ప్రభుత్వం మేమున్నామంటూ అండగా నిలిచింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 738మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందగా 731మంది రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున 36.55 కోట్ల బీమా సొమ్మును సంబంధిత రైతు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అయితే మరో ఏడుగురు రైతులకు సంబంధించి ఎల్‌ఐసీ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అదే విధంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 62మంది రైతులు ఆయా కారణాలతో మృతిచెందగా ఇప్పటివరకు 33మంది రైతులకు రూ.5లక్షల చొప్పున రూ.1.65కోట్ల బీమా సొమ్మును సంబంధిత రైతు కుటుంబ సభ్యులకు అందజేశారు. అయితే మరో 29మంది రైతులకు సంబంధించి ఎల్‌ఐసీ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. అదేవిధంగా రైతుల ఆత్మహత్యలను నివారించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబీమా పథకాన్ని మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రైతు ఏ విధంగా మృతి చెందినప్పటికీ బీమా వర్తించే విధంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది.

పెరిగిన ప్రీమియం ధర..
అదేవిధంగా ప్రతీ రైతుకు సంబంధించిన ప్రీమియం డబ్బును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అయితే గతేడాది ఒక్కో రైతుకు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బు రూ.2,271 కాగా ఏడాదికాలంగా చెల్లించిన పరిహారం, రైతు మరణాల సంఖ్యతోపాటు ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకొని ఈ ఏడాది ప్రీమియం ధరను పెంచుతూ బీమా సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది ఒక్కో రైతుకు చెల్లించాల్సిన ప్రీమియాన్ని రూ.3,013కు పెంచుతూ నిర్ణయించారు. అయితే జిల్లా వ్యాప్తంగా 1.83లక్షల మంది రైతులు ఉండగా 1,02,922మంది రైతులు బీమాకు అర్హులుగా జిల్లా వ్యవసాయశాఖ యంత్రాంగం గుర్తించింది. అయితే గతేడాది ఒక్కొ రైతుకు రూ.2,271 చొప్పున రూ.23.71కోట్ల ప్రీమియం డబ్బును ప్రభుత్వం చెల్లించింది.

అయితే ఈ ఏడాది ప్రీమియం పెరగడంతో ఒక్కో రైతుకు రూ.3,013 చొప్పున రూ.31.01కోట్ల ప్రీమియం డబ్బును రాష్ట్ర ప్రభుత్వం బీమా సంస్థకు చెల్లించనుంది. అయితే 18నుంచి 59ఏళ్ల మధ్య వయస్సు రైతులకు రైతుబీమా వర్తిస్తుంది. ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే సంబంధిత రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకుగాను రూ.5లక్షల బీమా సొమ్ము చెల్లిస్తున్నారు. అంతేకాకుండా మృతి చెందిన రైతు కుటుంబాలు ఇబ్బందులకు గురికాకుండా వారం రోజుల్లో బీమా డబ్బును సంబంధిత రైతు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

బీమా రైతు కుటుంబాలకు వరం...
రైతు బీమా పథకం మృతి చెందిన రైతు కుటుంబాలకు వరం. మా నాన్న కాకి నర్సింహులు గుండెపోటుతో మృతి చెందగా రైతుబీమా కింద రూ.5లక్షలు వచ్చాయి. రైతుబీమాలో పేర్కొన్న నా పేరిట గల బ్యాంకు ఖాతాలో 15రోజుల్లోనే రూ.5లక్షల బీమా డబ్బు జమయ్యాయి. ఎటువంటి పైరవీలకు ఆస్కారం లేకుండా బీమా డబ్బు అందింది. వాటిని మా కుటుంబ అవసరాల కోసం వాడుకుంటున్నాం. తమ కుటుంబం సీఎం కేసీఆర్‌కు ఎలప్పుడు రుణపడి ఉంటుంది. - కాకి శ్రీనివాస్, మిట్టకోడూర్, పరిగి

కుటుంబ అవసరాలకు వాడుకుంటున్నాం..
మా నాన్న అనంతయ్య పాముకాటుతో మృతి చెందగా రైతు బీమా కింద రూ.5లక్షలు డబ్బు వచ్చింది. సంవత్సరం క్రితం పాముకాటుతో మృతిచెందాడు. రైతుబీమా కింద రైతు బీమా బాండు, ఆధార్‌కార్డు, డెత్ సర్టిఫికెట్ అందజేయగా నా బ్యాంకు ఖాతాలో బీమా డబ్బు రూ.5లక్షలు జమ చేశారు. ఈ డబ్బును మా కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నాం. రైతుబీమా పథకం ద్వారా సీఎం కేసీఆర్ మా కుటుంబానికి అండగా నిలిచారు.
- శిరీష, నస్కల్, పరిగి

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...