తెలంగాణ ఊటీగా అనంతగిరి


Wed,November 13, 2019 10:57 PM

-రూ.300కోట్లతో అనంతగిరి అభివృద్ధి
-జిందాల్ తరహాలో పర్యాటకం
-వైజాగ్ తరహాలో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తాం
-15 రోజుల్లో ప్రణాళికను రూపొందించి, కార్యాచరణ చేపడుతాం
-రాష్ట్ర పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రూ. 300 కోట్లతో అనంతగిరి ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామని పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బుధవారం మంత్రి అనంతగిరి ప్రాంతంలోని వాచ్ టవర్, వ్యూ పాయింట్, నందిఘాట్‌తో పాటు శివారెడ్డిపేట్ చెరువులను విద్యాశాఖ మంత్రి పి. సబితారెడ్డితో కలిసి సందర్శించిన అనంతరం అనంతగిరిలోని హరిత రిసార్ట్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతగిరి ప్రాంతాన్ని మూడు విధాలుగా పర్యాటకంగా అభివృద్ధిలోకి తీసుకువస్తామని, టెంపుల్ టూరిజం, వెల్‌నెస్ టూరిజం, ఆడ్వెంచర్ టూరిజంలా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధిపై చర్చించడంతోపాటు పర్యాటక అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలను రూపొందించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే అనంతగిరి ప్రాంతా న్ని సందర్శించామన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. సీఎంకు అనంతగిరిపై పూర్తి అవగాహన ఉంది గనుకనే అనంతగిరిని అభివృద్ధి చేసేందుకు దృష్టి సారించారన్నారు.

అనంతగిరి ప్రాంతం పర్యాటక అభివృద్ధికి చాలా అనువైన ప్రాంతం కాబట్టి తెలంగాణ ఊటీగా తీర్చిదిద్దుతామన్నారు. అదే విధంగా బెంగుళూరులోని జిందాల్ తరహాలో పర్యాటక రంగాన్ని, వైజాగ్ తరహాలో వెల్‌నెస్ సెంటర్‌ను అనంతగిరిలో ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంపై 15రోజుల్లో ప్రణాళికను రూపొందించి, సీఎంకు వివరించి వీలైనంతా త్వరలో పనులు చేపట్టే విధంగా చర్యలు చేపడుతామని మంత్రి వెల్లడించారు. సీఎం కేసీఆర్ వచ్చాక జిల్లాను ఏర్పాటు చేయడంతోపాటు అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు దృష్టి సారించారన్నారు. సెలవుల్లో గోవా తదితర ప్రాంతాలకు వెళ్లకుండా అనంతగిరి ప్రాంతానికి వచ్చేలా అభివృద్ధిలోకి తీసుకువస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. అనంతగిరిలోని ఔషధ మొక్కల ద్వారా వీచే గాలితో సకల రోగాలు నయమవుతాయనే నానుడి మాట ఉంది కాబట్టి దానికి తగిన విధంగా వెల్‌నెస్ సెంటర్‌ను ఏర్పా టు చేస్తామన్నారు.

నగరవాసులు అనంతగిరివైపు చూడాలి..
అనంతగిరి ప్రాంతంలో 214ఎకరాలు పర్యాటక శాఖకు ఉండగా, 120ఎకరాలు ఆసుపత్రికి, మరో 13ఎకరాల అనంతపద్మనాభస్వామి ఆలయానికి సంబంధించిన భూమి ఉంది. మిగిలిన వేల ఎకరాల భూములు అటవీ శాఖకు సంబంధించిందన్నారు. అన్ని శాఖల సహకారంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా సమన్వయంతో అభివృద్ధి చేసి హైదరాబాద్ మహానగరంలో కోటిన్నర జనాభా అనంతగిరి వైపు వచ్చే విధంగా అద్భుతమైన టూరిజాన్ని రూపొందిస్తామన్నారు. చిన్న, చిన్న ప్రదేశాలు సైతం పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. వాటి తరహాలో అనంతగిరిని అభివృద్ధి చేస్తామని, అంతేకాకుండా బుగ్గ రామేశ్వరాలయం, ఎబ్బనూరు, సర్పన్‌పల్లి చెరువులను పర్యాటక రంగంలోనే అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. అంతేకాకుండా జిల్లాలోని ప్రాచీన ప్రాంతాలైన దేవాలయాలు, ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే తెలంగాణలోనే నెంబర్.1లా ఉండేలా అనంతగిరిలో పర్యాటక రంగాన్ని, వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపడుతామన్నారు.

అద్భుతమైన టూరిజం ప్రదేశంగా తీర్చిదిద్దుతాం..
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి
బుగ్గరామేశ్వరం, సర్పన్‌పల్లి, ఎబ్బనూరు, అనంతగిరి ప్రాం తాలను కలిపి అద్భుతమైన టూరిజం ప్రదేశంగా తీర్చిదిద్దుతామని, దీనిపై ప్రణాళిక సిద్ధం చేసి, సీఎంకు అందజేసి ప్రాజెక్టు త్వరితగతిన ప్రారంభమయ్యేలా కృషి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. సీఎంపై పూర్తి నమ్మకం ఉందని, అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. గతంలో అభివృద్ధి పరం గా జాప్యం జరిగిందని, ఇకపై జాప్యం లేకుండా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలోనే ఇటువంటి పర్యాటక ప్రాంతం లేదనే విధంగా అనంతగిరిని తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. అదేవిధంగా జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతామన్నారు.

సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పలేదు..
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ సీఎం ఇచ్చిన మాట ప్రకారం అనంతగిరి ప్రాంతం అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని, ఈ ప్రాంతం చాలా ఏళ్లుగా వెనుకబడి ఉందని, అనంతగిరిని ఊటీలా అభివృద్ధి చేసినట్లయితే ఈ ప్రాంతం అభివృద్ధి సాధిస్తుందని ఆమె అన్నారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా, కార్పొరేషన్ చైర్మన్లు పర్యాద కృష్ణమూర్తి, నాగేందర్ గౌడ్‌లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి, వికారాబాద్ జడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు శుభప్రద్‌పటేల్, ముత్తార్ షరీఫ్, కృష్ణ, రాంచంద్రారెడ్డి, అనంత్‌రెడ్డి, చిగుళ్లపల్లి రమేశ్, శంకర్, దత్తు తదితరులు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles