నాణ్యత నవ్వుల పాలు


Fri,October 18, 2019 10:55 PM

-తాండూరులో రోడ్డు విస్తరణ పనుల్లో నిబంధనలు,నాణ్యత డొల్ల రోడ్లపై స్తంభాలు, బోర్లు తొలిగించకుండానే వేసిన రోడ్లు
-చిన్న వర్షానికే తారు తొలిగిపోతున్న వైనం
-కాసుల కోసం కాంట్రాక్టర్ల కక్కర్తి
-కన్నెత్తి చూడని క్వాలిటీ కంట్రోల్ అధికారులు
-ఇబ్బందుల్లో ప్రజలు, ప్రయాణికులు
తాండూరు, నమస్తే తెలంగాణ: తాండూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో విశాలమైన రోడ్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుం రూ. 25 కోట్లతో సీసీ రోడ్డ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ప్రజా ప్రయోజనం కోసం ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు చేసిన కాంట్రాక్టర్ల చేతివాటం, అధికారుల అలసత్వంతో నాసిరకంగా రోడ్లు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. వేసిన పదిహేను రోజులకే రోడ్డు కుంగిపోవడంతో నాణ్యత నవ్వుల పాలుగా కన్పిస్తుంది. మున్సిపల్ పరిధిలోని ప్రధాన రోడ్లు విస్తీర్ణత పెంచడంతో నడి రోడ్డుపైకి వచ్చిన కరెంటు స్తంభాలు, చేతి పంపులు అలాగే ఉన్నాయి. దీంతో ప్రయాణికులు తరచూ ఇబ్బందులకు గురవుతున్నారు. నిరూపయోగంగా ఉన్న చేతిపంపులను తీసి రోడ్లు వేయాల్సింది ఉండగా నూతనంగా వేసిన సీసీ రోడ్ల మధ్యలోకి బోర్లు, విద్యుత్ స్తంభాలు రావడంతో ప్రజలు నవ్వుకుంటున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంతో కాంట్రాక్టర్లు కూడా తమ ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. తాండూరు నలుమూలల రోడ్ల విస్తీర్ణత పనులు చేపట్టి చక్కటి రోడ్లు వేసి మధ్యలో డివైడర్లు పెట్టి వాటిపై రంగు రంగుల పూల మొక్కలు, ఆకర్శణీయంగా కన్పించేందుకు పచ్చటి గడ్డి ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ డివైడర్లపై మొక్కలు మంచిగా బతికేందుకు ఎర్రమట్టితో పాటు రాళ్లు లేని నాణ్యమైన మట్టిని వేయాల్సి ఉంటుంది. కానీ సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులు సరైన శ్రద్ధ చూపకపోవడంతో లోపల మొరం (రాళ్లతో కూడిన మట్టి) వేసి పైన మాత్రం నాణ్యమైనదిగా కనిపించేందుకు ఎర్రమట్టిని వేస్తున్నారు. దీంతో మొక్కలు ఎలా ఎదుగుతాయని స్థానికులు నవ్వుకుంటున్నారు. అంతారం రోడ్డు మార్గంలో రోడ్డు రోడ్లను విభజిస్తూ డివైడర్ ఏర్పాటు చేయాల్సి ఉండగా రోడ్డు విస్తీర్ణంకు భూమి ఇవ్వడం లేదనే సాకుతో డివైడర్ లేకుండా నామమాత్రంగా సీసీ రోడ్డు వేయడం గమనర్హం. రూ. 25 కోట్లతో తాండూరు మున్సిపల్ పరిధిలో జరుగుతున్న రోడ్ల విస్తీర్ణం నాణ్యతను చూడాల్సిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు సైతం ఇప్పటి వరకు ఇటువైపు కన్నెత్తికూడా చూడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నేతలు స్పందించి పట్టణంలో రూ.కోట్ల ఖర్చుతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి నాణ్యత నవ్వుల పాలు కాకుండా చూడడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు జరిపించాలని స్థానికులు కోరుతున్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...