జాతీయ రహదారులతో గ్రామాలకు కొత్త అందాలు


Fri,October 18, 2019 10:49 PM

బొంరాస్‌పేట : హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి నిర్మాణంతో మండలంలోని రెండు గ్రామాలకు కొత్త అందాలు వచ్చాయి. తుంకిమెట్ల, రేగడిమైలారం గ్రామాలు పట్టణాలుగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్-బీజాపూర్ అంతరాష్ట్ర రహదారిని ప్రభుత్వం జాతీయ రహదారిగా ప్రకటించి సుమారు రూ.300 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టింది.

దీనిలో భాగంగా పూడూరు మండలం మన్నెగూడ నుంచి కొడంగల్ మండలం చంద్రకల్ వరకు రోడ్డు విస్తరణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. రోడ్డు విస్తరణలో భాగంగా మండలంలోని తుంకిమెట్ల, రేగడిమైలారం గ్రామాల్లో రోడ్డును నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసి మధ్యలో డివైడర్లను ఏర్పాటు చేశారు. సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటులో భాగంగా డివైడర్లపైనే పొడవైన విద్యుత్ స్తంభాలను పాతి వాటికి ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు కాలినడకన వెళ్లేందుకు వీలుగా రోడ్డుకు ఇరువైపులా పుట్‌పాత్‌లను కూడా నిర్మించారు. పుట్‌పాత్‌లకు వెనుక ఇరువైపులా మురుగు కాల్వలను నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం వల్ల గ్రామాల్లో రోడ్డు విశాలంగా కనిపిస్తుండటంతో పాటు పట్టణాల్లో మాదిరిగా గ్రామాలు కనిపిస్తున్నాయి. ఎల్‌ఈడీ వీధి దీపాలు వెలిగితే గ్రామాలకు మరింత శోభ వస్తుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన వాహనాల రద్దీ
హైదరాబాద్-బీజాపూర్ అంతరాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రభుత్వం అభివృద్ధి చేయడంతో రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. రోడ్డు విస్తరణ జరుగడంతో వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రాయానికి వెళ్లేవారు ఈ రూట్లోనే వెళ్తుంటారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంతో పాటు జిల్లాలోని తాండూరు పరిసర ప్రాంతాల్లో నాపరాయి, సిమెంటు పరిశ్రమలు విస్తరించాయి. ప్రతినిత్యం సిమెంటు, నాపరాయిని లారీల్లో హైదరాబాద్ తదితర పట్టణాలకు జాతీయ రహదారిపై నుంచే తరలిస్తుంటారు. వాహనాల రాకపోకలు పెరగడం వల్ల మండలంలోని పలు గ్రామాల్లో వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. జాతీయ రహదారికి ఇరువైపులా తుంకిమెట్ల తదితర గ్రామాల్లో దాబాలు వెలిశాయి.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...