డంపింగ్‌యార్డులకు స్థల సేకరణ చేయాలి


Fri,October 18, 2019 10:48 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో డంపింగ్‌యార్డుల స్థల సేకరణ, వాటి పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా సంబంధిత మండలాల ఎంపీడీవోలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఏపీవోలు, ఈసీలతో డంపింగ్‌యార్డులు, హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో చెత్త సేకరణకు కొత్త ట్రాక్టర్లు, ట్యాలీ ఆటోలు కొనుగోలు చేస్తామన్నారు. తడి, పొడి చెత్తలను వేర్వేరుగా ప్రతి ఇంటికి తిరిగి సేకరించి డంపింగ్‌యార్డులకు తరలించాలని సూచించారు. అన్ని గ్రామాల్లో డీఆర్‌సీ సెంటర్లను పటిష్టంగా నిర్వహించి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి డీఆర్‌సీ సెంటర్లకు తరలించాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు.

గ్రామాల్లో నాటిన ప్రతి మొక్కకు ఫెన్సింగ్ చేసి నీరు పోసి కాపాడాలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులదేనని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు మొదటి భాగంలో సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శుల పేర్లు, ఫోన్‌నెంబర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు మిగిలి ఉన్న మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఈ నెల 31లోగా పూర్తి చేస్తే వాటికి వెంటనే డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. సమావేశంలో జడ్పీసీఈవో కృష్ణన్, డీటీవో రిజ్వాన, అదనపు పీడీ రాజేంద్రప్రసాద్, మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు,ఈసీలు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...