బకాయిలపై ప్రత్యేక దృష్టి


Thu,October 17, 2019 10:59 PM

-జిల్లాలో మొండికేసిన స్వయం సహాయక సంఘాలు
-పెండింగ్‌లో రూ.22.26 కోట్ల రుణాల రికవరీ
-జిల్లావ్యాప్తంగా పనిచేయని 996 సంఘాలు
-రుణాల వసూలు కోసం ప్రత్యేక డ్రైవ్
-పనిచేయని ఎస్‌హెచ్‌జీల్లో కదలిక తెచ్చేందుకు చర్యలు చేపట్టిన సంబంధిత అధికారులు
-చెల్లిస్తేనే కొత్త రుణాలు మంజూరు చేసేలా చర్యలు
-ఈ ఏడాది ఇప్పటివరకు ఎస్‌హెచ్‌జీలకు రూ.51.86 కోట్లు
-జిల్లావ్యాప్తంగా 11,364 స్వయం సహాయక సంఘాలు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో రుణాలు పొంది తిరిగి చెల్లించని స్వయం సహాయక సంఘాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. మొండికేసిన స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలను రికవరీ చేసేందుకుగాను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు చర్యలు చేపట్టారు. రెండు, మూడేండ్లుగా రుణాలను తిరిగి చెల్లించని స్వయం సహాయక సంఘాలను గుర్తించి రుణాలను వసూలు చేసేందుకు చర్యలు చేపట్టగా దాదాపు రూ.20కోట్ల వరకు రుణాలను ఎస్‌హెచ్‌జీల నుంచి వసూలు చేయగా మరో 22.26 కోట్ల రుణాలను రికవరీ చేయాల్సి ఉంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఎస్‌హెచ్‌జీ సభ్యుల్లో అవగాహన కల్పిస్తూ, మార్పు తీసుకువస్తున్నప్పటికీ జిల్లాలోని కొన్ని సంఘాల్లో ఇంకా మార్పు రావడం లేదు. జిల్లావ్యాప్తంగా 996 స్వయం సహాయక సంఘాలు మొండికేయడంతో రూ.22.26 కోట్ల రుణాల వసూలు పెండింగ్‌లో ఉన్నట్లు సంబంధిత అధికారులు తేల్చారు. ఈ మొత్తాన్ని సంబంధిత స్వయం సహాయక సంఘాల నుంచి తిరిగి వసూలు చేసేందుకు డీఆర్‌డీవో యంత్రాంగం చర్యలు చేపట్టింది. అంతేకాకుండా పూర్తిగా పనిచేయని సంఘాలను కూడా యాక్టివ్‌గా చేసేందుకుగాను క్షేత్రస్థాయి సిబ్బందికి సూచిస్తున్నారు. అంతేకాకుండా రుణాలను తిరిగి చెల్లించని సంఘాలకు రుణాలను ఎట్టి పరిస్థితుల్లో మంజూరు చేయకూడదని బ్యాంకు అధికారులకు కూడా డీఆర్‌డీఏ యంత్రాంగం సమాచారమిచ్చింది.

అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 11,364 స్వయం సహాయక సంఘాలుండగా,...ఈ ఏడాది ఇప్పటివరకు రూ.51.86 కోట్ల రుణాలను జిల్లా యంత్రాంగం మంజూరు చేసింది.సహాయక సంఘాలను దారిలోకి తెచ్చేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పనిచేయని సంఘాల్లో కదలిక తీసుకువచ్చేందుకు తిరిగి యాక్టివ్‌గా పనిచేసేందుకుగాను కొత్తగా రుణాలను మంజూరు చేయమని కూడా హెచ్చరిస్తూ, మొండికేసిన స్వయం సహాయక సంఘాల్లో ఏదో విధంగా మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల పనితీరు...సంఘం సమావేశాలు నిర్వహిస్తున్నారా, ఎంత మంది సభ్యులు సమావేశాలకు హాజరవుతున్నారు, సంబంధిత ఎస్‌హెచ్‌జీకి ఎంత అప్పు ఉంది, ఎంత డబ్బు పొదుపు చేశారనే విషయాలను స్వయం సహాయక సంఘాల ద్వారా సేకరిస్తూ, యాక్టివ్‌గా పనిచేయని సంఘాల్లో మార్పు తీసుకువచ్చే దిశగా వెళుతున్నారు. జిల్లావ్యాప్తంగా 996 స్వయం సహాయక సంఘాల నుంచి రూ.22.26 కోట్ల రుణాలను రికవరీ చేయాల్సి ఉంది. అయితే జిల్లాలో అత్యధికంగా బషీరాబాద్, పూడూర్, తాండూరు మండలాల్లో మొండికేసిన సంఘాలు అధికంగా ఉన్నాయి.

బషీరాబాద్ మండలంలో 164 సంఘాల నుంచి రూ.3.64 కోట్లు, పూడూరు మండలంలో 116 సంఘాల నుంచి రూ.3.57 కోట్లు, తాండూరు మండలంలో 126 సంఘాల నుంచి రూ.307 కోట్లు, ధారూరు మండలంలో 101 సంఘాల నుంచి రూ.2.85 కోట్లు, పరిగి మండలంలో 56 సంఘాల నుంచి రూ.1.70 కోట్లు, బొంరాసుపేట్ మండలంలో 63 సంఘాల నుంచి రూ.1.55 కోట్లు, మోమిన్‌పేట్ మండలంలో 53 సంఘాల నుంచి రూ.1.16 కోట్లు, పెద్దేముల్ మండలంలో 35 సంఘాల నుంచి రూ.80.47 లక్షలు, మర్పల్లి మండలంలో 25 సంఘాల నుంచి రూ.70.54 లక్షలు, యాలాల మండలంలో 40 సంఘాల నుంచి రూ.76.85 లక్షలు, దోమ మండలంలో 51 సంఘాల నుంచి రూ.71.66 లక్షలు, కుల్కచర్ల మండలంలో 58 సంఘాల నుంచి రూ.51.92 లక్షలు, వికారాబాద్ మండలంలో 27 సంఘాల నుంచి రూ.40.32 లక్షలు, నవాబుపేట్ మండలంలో 26 సంఘాల నుంచి రూ.38.52 లక్షల రుణాలను రికవరీ చేయాల్సి ఉంది.

ఇప్పటివరకు ఎస్‌హెచ్‌జీలకు రూ.51.86 కోట్ల రుణాలు
2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను స్వయం సహాయక సంఘాలకు రూ.211 కోట్ల రుణాలను మంజూరు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. వీటిలో ఇప్పటివరకు రూ.51.86 కోట్ల రుణాలను ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకర్లు మంజూరు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1605 స్వయం సహాయక సంఘాలకు రూ.51.86 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. అయితే అత్యధికంగా తాండూరు మండలంలోని 125 సంఘాలకు రూ.4.87 కోట్ల రుణాలను మంజూరు చేయగా, పెద్దేముల్ మండలంలో రూ.4.22 కోట్లు, బొంరాసుపేట్ మండలంలో 134 సంఘాలకు రూ.3.92 కోట్లు, బంట్వారం మండలంలోని 144 సంఘాలకు రూ.3.39 కోట్లు, దోమ మండలంలో 95 సంఘాలకు రూ.3.87 కోట్లు, నవాబుపేట్ మండలంలో 104 సంఘాలకు రూ.3.33 కోట్లు, యాలాల మండలంలో 114 సంఘాలకు రూ.4.02 కోట్లు, మర్పల్లి మండలంలో 79 సంఘాలకు రూ.3.43 కోట్లు, పరిగి మండలంలో 65 సంఘాలకు రూ.2.92 కోట్లు, బషీరాబాద్ మండలంలో 68 సంఘాలకు రూ.2.34 కోట్లు, కోట్‌పల్లి మండలంలో 109 సంఘాలకు రూ.2.55 కోట్ల రుణాలను మంజూరు చేశారు. స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకుగాను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...