నేడే ఆఖరు


Tue,October 15, 2019 11:45 PM

-ఇప్పటివరకు 46 మద్యం దుకాణాలకు 287 దరఖాస్తులు
-మంగళవారం ఒక్కరోజే 106
-నేడు భారీగా వస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారుల అంచనా
-ఇప్పటివరకు అత్యధికంగా ధారూర్‌లో ఒకే దుకాణానికి 28 దరఖాస్తులు
-అత్యల్పంగా కొడంగల్‌లోని మూడు మద్యం దుకాణాలకు ఒక్కో దరఖాస్తు మాత్రమే
-ఇప్పటివరకు ఎక్సైజ్ శాఖకు రూ.5.74 కోట్ల ఆదాయం
-ఈనెల 18న డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని మద్యం దుకాణాల టెండర్ దక్కించుకునేందుకు దరఖాస్తుకు నేటితో గడువు ముగియనుంది. ఈనెల 1న నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ప్రకటించగా, 9వ తేదీ నుంచి మద్యం దుకాణాల టెండర్లకుగాను దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనప్పటికీ వ్యాపారులు మంచిరోజు కోసం ఎదురుచూడడంతో తొలి నాలుగు రోజులు పెద్దగా దరఖాస్తులు అందలేవు. అయితే సోమవారం, మంగళవారం రెండు రోజుల్లో మద్యం దుకాణాల టెండర్లను దక్కించుకునేందుకుగాను భారీగా దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా మద్యం టెండర్లకై దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఆఖరు రోజు కావడంతో పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చే అవకాశముందని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు చేసుకున్న దరఖాస్తుల్లో అత్యధికంగా ధారూర్ మండలంలోని ఒకే మద్యం దుకాణానికి అధిక మొత్తంలో దరఖాస్తులురాగా, కొడంగల్ పరిధిలోని మద్యం దుకాణాల టెండర్లను పొందేందుకు వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. అదేవిధంగా మద్యం దుకాణాల టెండర్లను పొందేందుకు వచ్చిన దరఖాస్తుల్లో మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకుగాను జిల్లాలోని పలు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఒక్కొ దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున నాన్-రిఫెండబుల్ ఫీజును డీడీ రూపంలో వ్యాపారులు చెల్లిస్తుండగా.., జిల్లాలోని 46 మద్యం దుకాణాలకు ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులతో జిల్లా ఎక్సైజ్ శాఖకు రూ.5.74 కోట్ల ఆదాయం వచ్చింది.

నేడు 200కుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశం
మద్యం దుకాణాలకు దక్కించుకునేందుకు దరఖాస్తుకు నేటితో ముగియనున్న దృష్ట్యా నేడు అధిక మొత్తంలో మద్యం వ్యాపారులు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. అయితే నేడు ఒక్కరోజే 200కుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశముందని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు పెద్దగా దరఖాస్తులురాని మద్యం దుకాణాలకు కూడా నేడు చివరి రోజు కావడంతో దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటివరకు జిల్లాలోని 46 మద్యం దుకాణాలకు 287 దరఖాస్తులు వచ్చాయి. అయితే తాండూరు డివిజన్‌లో అత్యధికంగా దరఖాస్తులురాగా, మోమిన్‌పేట్ డివిజన్‌లో అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు తాండూరు డివిజన్లోని 16 మద్యం దుకాణాలకు 103 దరఖాస్తులు, వికారాబాద్ డివిజన్‌లోని 11 మద్యం దుకాణాలకు 76 దరఖాస్తులు, మోమిన్‌పేట్ డివిజన్‌లోని 5 మద్యం దుకాణాలకు 24 దరఖాస్తులు, పరిగి డివిజన్‌లోని 9 మద్యం దుకాణాలకు 52 దరఖాస్తులు, కొడంగల్ డివిజన్‌లోని 5 మద్యం దుకాణాలకు 32 దరఖాస్తులు అందాయి. అయితే సోమ, మంగళవారాల్లో భారీగా దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం ఒక్కరోజే 181 దరఖాస్తులురాగా, మంగళవారం 106 దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం ఒక్కరోజు తాండూరు డివిజన్‌లో 37 దరఖాస్తులు, వికారాబాద్ డివిజన్‌లో 29 దరఖాస్తులు, మోమిన్‌పేట్ డివిజన్‌లో 6 దరఖాస్తులు, పరిగి డివిజన్‌లో 24 దరఖాస్తులు, కొడంగల్ డివిజన్‌లో 10 దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులతో ఎక్సైజ్ శాఖకు రూ.5.74 కోట్ల ఆదాయం వచ్చి చేరింది. తాండూరు డివిజన్ నుంచి రూ.2.06 కోట్లు, వికారాబాద్ డివిజన్ నుంచి రూ.1.52 కోట్లు, మోమిన్‌పేట్ డివిజన్ నుంచి రూ.48 లక్షలు, పరిగి డివిజన్ నుంచి రూ.1.04 కోట్లు, కొడంగల్ డివిజన్‌లో రూ.64 లక్షల ఆదాయం వచ్చింది.

ఈనెల 18న డ్రా ద్వారా కేటాయింపు
ఈనెల 18న డ్రా తీసి మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. జిల్లాలోని 46 మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తులను బట్టి డ్రా తీయనున్నారు. ఒక్కొ మద్యం దుకాణాల వారీగా దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను రాసివేసి కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీసి ఎవరి పేరైతే వస్తుందో వారికి మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. మద్యం దుకాణాలను పొందేవారికి రెండేండ్లపాటు లైసెన్స్ కొనసాగనుంది. అయితే నూతన మద్యం విధానం ప్రకారం నిర్ణయించిన లైసెన్సు ఫీజును ఏడాదికి మూడు విడుతల వారీగా ఎక్సైజ్ శాఖ చెల్లించనున్నారు. అయితే జిల్లాలో 5 వేల జనాభాలోపు ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజును రూ.50 లక్షలకు, 5 వేల నుంచి 50 వేలలోపు జనాభాగల ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజును రూ.55 లక్షలుగా, 50 వేల నుంచి లక్ష జనాభాగల ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజును రూ.60 లక్షల లైసెన్సు ఫీజును ఎక్సైజ్ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...