అనాథలకు అండగా..ప్రభుత్వం ఉందిగా..


Tue,October 15, 2019 11:41 PM

-అబిడ్స్, అక్టోబర్ 15 నమస్తే తెలంగాణ ఃదేశానికి స్వాతంత్య్రం రాకముందు (1921 సంవత్సరంలో) స్టేట్ ఆఫ్ హైదరాబాద్ సంస్థానంలో అనాథ బాల, బాలికలకు ఉన్నత విద్యా బోధన చేయించాలనే సంకల్పంతో హజ్రత్ మీర్ ఖాజా భద్రుద్దీన్ చిస్తి ప్రారంభించిన అనీస్ ఉల్ గుర్బా అనాథ శరణాలయాన్ని అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను విడుదల చేయడంతో శరణాలయం భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 98 సంవత్సరాల చరిత్ర కలిగిన అనీస్ ఉల్ గుర్బా అనాథ శరణాలయంలో ఎందరో అనాథ బాలలు విద్యనభ్యసించి జీవితంలో స్థిర పడ్డారు. ఆరు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల వయసు కలిగిన అనాథలను చేర్చుకొని వారికి వసతి కల్పించడంతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఎల్‌కేజీ నుంచి పదవ తరగతి వరకు విద్యా బోధన చేయిస్తారు. అంతేకాకుండా అనాథ శరణాలయంలో ప్రత్యేక ట్యూషన్‌లను కూడా కల్పిస్తున్నారు.

దాతల సాయంతో..
ఈ అనాథ శరణాలయానికి దాతలు విరాళాలు ఇస్తూ ఆదుకుంటూ వచ్చారు. పండుగలు, శుభకార్యాలు చేసుకునే వారు అనాథ శరణాలయం బాలలకు విరాళాలు అందిస్తారు. దాతలు ఇచ్చిన విరాళాలను బ్యాంకులలో డిపాజిట్ చేసి వాటి నుంచి వచ్చే వడ్డీతో శరణాలయం కొనసాతున్నది. అనాథ బాల, బాలికలకు వసతిని కల్పించడంతో పాటు భోజనం, విద్యా బోధన చేయిస్తారు.

దేవాదాయ శాఖ నుంచి వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి..
2009 వరకు దేవాదాయ శాఖ ఆధీనంలో కొనసాగేది. దేవాదాయ శాఖ వారు బోర్డును నియమించి ఇందులో చేరే బాల, బాలికలకు వసతుల కొరత లేకుండా చూసే వారు. 2009లో వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి రాగా వక్ఫ్ బోర్డు మొట్టమొదటి సారిగా ఈఓను నియమించింది. అప్పటి నుంచి ఈఓల పర్యవేక్షణలో ఈ శరణాలయం కొనసాగుతున్నది. ప్రతి సంవత్సరం 40 మందికి తక్కువ కాకుండా అనాథలు ఉండే వారు. ఈఓ నియామకంతో 61 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పిల్లలకు విద్యా బోధనతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తున్నారు. దాతల విరాళాలతో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి బాలలకు మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. శరణాలయంలో వసతి పొందుతున్న విద్యార్థులకు పలు పాఠశాలల్లో విద్యాబోధన చేయిస్తున్నారు.

స్వరాష్ట్రంలో మహర్దశ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనీస్ ఉల్ గుర్బా అనాథ శరణాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. నాంపల్లిలో ఉన్న స్థలంతో పాటు పక్కనే ఉన్న పీడబ్ల్యుడీకి చెందిన నాలుగు వేల గజాల స్థలాన్ని కేటాయించి మల్టీపర్పస్ భవనాన్ని నిర్మించడంతో పాటు వసతుల కల్పనకు రూ.20 కోట్ల నిధుల విడుదలకు 2017 సంవత్సరంలో జీఓను విడుదల చేశారు. నిధుల విడుదలతో భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే స్లాబ్‌ల నిర్మాణ పనులు పూర్తి కాగా గోడల నిర్మాణాలు చేపడుతున్నారు. బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భవనం నిర్మాణం జరిగిన తరువాత ఇందులో టెమ్రీస్ ఆధ్వర్యంలో పాఠశాలను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాగా ఇప్పటి వరకూ రూ.9,19,80,958 నిధులు విడుదలయ్యాయి. ఇంకా రూ.10,80,19,042 విడుదల కావాల్సి ఉంది.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...