వేగం తగ్గించుకో..


Tue,October 15, 2019 11:41 PM

- గొట్టిముక్కుల సుధాకర్‌గౌడ్ (సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ)
వేగం కారణంగా వాహనదారుల ప్రాణాలు పోవద్దనే లక్ష్యంతో రాచకొండ పోలీసులు సరికొత్త ప్రయత్నంతో ముందుకు వచ్చారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ఓఆర్‌ఆర్ పై రాడార్ స్పీడ్ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. 300 మీటర్ల దూరం నుంచే వాహనదారుడు ప్రయాణిస్తున్న వేగాన్ని గుర్తించి వేగాన్ని నియంత్రించుకోవాలని హెచ్చరిస్తుంది. ఈ హెచ్చరికతో వాహనదారుడు వేగాన్ని నియంత్రించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇలా చేయడంతో మరణాలకు దారి తీసే ప్రమాదాలు తగ్గుతాయని రాచకొండ పోలీసులు ఆశిస్తున్నారు. పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్ వాహనదారుల రక్షణను దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రయత్నంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రాచకొండ పోలీసులు చేసిన ప్రయత్నానికి సోషల్ మీడియాలో ట్విటర్‌ను వేదికగా చేసుకుని ప్రశంసలు కురిపిస్తున్నారు. వాహనదారుల ప్రాణ రక్షణ కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమంటున్నారు.
100 దాటితే ఎరుపు రంగు..
రాడార్ స్పీడ్ సూచిక బోర్డులు 300 మీటర్లు అంటే 900 అడుగుల దూరం నుంచే వాహన వేగాన్ని గుర్తించి మీరు వెళ్తున్న వేగాన్ని సూచిక బోర్డు మీద ప్రదర్శిస్తుంది. ఇదంతా కేవలం సెకన్ల సమయంలో జరిగిపోతుంది. ఇలా ఎన్ని వాహనాలు వచ్చినా వాటి వేగాన్ని సెకన్లలో తీసుకుని హెచ్చరిస్తుంది. ఓఆర్‌ఆర్ పై వేగ పరిమితి గంటలకు వంద కిలోమీటర్లు. అది దాటితే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద రూ.1400 చలాన్ కట్టాల్సిందే. తాజాగా ఏర్పాటు చేసిన ఈ సూచిక బోర్డులతో వాహనదారుడు తన వేగాన్ని చూసుకుని నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. వాహనం వేగం 100 కిలోమీటర్లు దాటితే ఈ సూచిక బోర్డులు ఎరుపు రంగులో స్పీడ్ సంఖ్యను ప్రదర్శిస్తాయి. అదే వంద లోపు పోతే ఆకుపచ్చ రంగులో స్పీడ్ సంఖ్యను వెల్లడిస్తాయి. ఇలా వాహనదారుడు దూరం నుంచే తన వేగం గుర్తించి తెలుసుకుని ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రమాదాలు, చలాన్ల నుంచి క్షేమంగా బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే చలాన్‌తో పాటు ప్రమాదాలను కొనితెచ్చుకునే అవకాశాలు అధికంగా ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు సూచిక బోర్డులను కోహేడ, బొంగూలూరు వద్ద ఏర్పాటు చేశారు.

వాహనదారులు ఫుల్ ఖుష్..
రాడార్ స్పీడ్ సూచిక బోర్డుల ఏర్పాటుతో ఓఆర్‌ఆర్‌పై ప్రయాణిస్తున్న వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల కిందట ఏర్పాటు చేసిన ఈ సూచిక బోర్డులతో చాలా మంది వాహనదారులు వారి స్పీడ్‌ను వాటిపై చూసుకుని వెంటనే సాధారణ వేగానికి వచ్చి సురక్షిత ప్రయాణాన్ని సాగిస్తున్నట్లు వారు సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్విటర్‌లో పోస్టింగ్‌లను పెట్టి వాహనదారుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయంటూ కితాబునిస్తున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...