స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేల గళం


Fri,September 20, 2019 11:54 PM

పరిగి/కొడంగల్ నమస్తే తెలంగాణ : స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించారు. పరిగి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్డు సదుపాయంలో భాగంగా దోమ మండల కేంద్రం నుంచి సుల్తాన్‌పూర్ స్టేజీ వరకు డబుల్ రోడ్డు నిర్మాణంలో అటవీ ప్రాంతంలో 2 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం మిగిలిపోయి ఉందని, దానిని పూర్తి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. అటవీ ప్రాంతంలో 2 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం కాలేదని, 7 ఎకరాల భూమి ఇవ్వాలని అటవీ అధికారులు ప్రతిపాదించారని పేర్కొన్నారు. దానిని పరిశీలించి భూమి కేటాయింపులు జరిపి ఈ రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. వీరాపూర్ నుంచి కులకచర్ల వరకు రోడ్డు నిర్మాణంలో భాగంగా మల్కాపూర్ రోడ్డు 1.5 కిలోమీటర్ల రహదారి మిగిలిపోయిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రోడ్డు కూడా అటవీ ప్రాంతంలో ఉందని, పరిగి నియోజకవర్గంలోని రెండు రోడ్లు పూర్తి చేయడం వల్ల అనేక గ్రామాలకు రహదారి సదుపాయం మెరుగవుతుందని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు.

ఈ అంశంపై స్పందించిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమాధానమిస్తూ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి చెప్పిన అంశాలు అటవీ అధికారులతో, సంబంధిత మంత్రితో మాట్లాడి చర్యలు తీసుకొని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తవిస్తూ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆసరా పథకం వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు రెట్టింపు ఆసరాను అందుకోవడం సంతోషంగా ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ఆ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పోస్టాఫీసుల్లో బయోమెట్రిక్ విధానంతో అందిస్తున్న ఆసరా పెన్షన్‌తో వృద్ధులకు ఫింగర్‌ప్రింట్ రాక, యంత్రాలకు 2జీ సిమ్ అమర్చడం వల్ల సిగ్నల్ రాక పంపిణీల్లో ఇబ్బందుల తలెత్తుతున్నట్లు పేర్కొన్నారు. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో ఇటువంటి సమస్య అధికంగా ఉందని, కాబట్టి బమోమెట్రిక్ యంత్రాలకు 4జీ సిమ్ అందిస్తే బాగుటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశంపై పలువురు ఎమ్మెల్యేలు ఈ సమస్య మా దగ్గర కూడా ఉందని వెంటనే పరిష్కరించాలని తెలిపారు. స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్ ఆసరా పింఛన్ పంపిణీలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...