యథేచ్ఛగా అక్రమ మైనింగ్


Wed,September 18, 2019 12:06 AM

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో అక్రమ మైనింగ్‌తో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూరుతుంది. ఎలాంటి అనుమతులు లేనప్పటికీ గనులను తవ్వుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా అనుమతి తీసుకున్న ప్రాంతానికి మించి అక్రమంగా గనులను తవ్వుతూ ప్రభుత్వ ఖజనాకు నష్టం చేకూరుస్తున్నారు. అయితే ప్రధానం గా కొంత ప్రాంతాన్ని లీజుకు తీసుకుంటున్న మైనింగ్ వ్యాపారులు లీజుకు తీసుకోని ప్రాంతాల్లో కూడా మైనింగ్ జరుపుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. మైనింగ్ వ్యాపారులు కేవలం పది ఎకరాలను లీజుకు తీసుకొని మరో పది ఎకరాల్లో అక్రమంగా మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తెలిసింది. అంతేకాకుండా కొంద రు అయితే అస్సలు ఎలాంటి అనుమతులు పొందకుండానే నాపరాతి గనులను దర్జాగా అక్రమంగా తవ్వుతున్నారు. మరికొందరు గనుల శాఖ నుంచి పొందిన లీజు పూర్తైనప్పటికీ గనులను తవ్వుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే లీజు పూర్తైన అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న కొన్నింటిని జిల్లా గనుల శాఖ అధికారులు సీజ్ చేసినప్పటికీ తిరిగి తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ముఖ్యంగా తాండూరు నియోజకవర్గంలో నాపరాయి, సుద్ధ గనులు, ఎర్రమట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. తాండూరు మండలంలో యథేచ్చగా నాపరాతి గనులను అక్రమంగా తవ్వుతున్నారు. తాండూ రు మండలంలోని ఓగిపూర్, మల్కాపూర్ నాపరాతి గనుల్లో దర్జాగా అక్రమార్కులు కోట్ల విలువైన నాపరాతి గనులను తవ్వుకొని సొమ్ము చేసుకుంటున్నారు.

ఓగిపూర్, మల్కాపూర్‌లో అక్రమ మైనింగ్...
తాండూర్ మండల పరిధిలోని ఓగిపూర్, మల్కాపూర్ పరిధిలలో యథేచ్చగా అక్రమ గనుల తవ్వకాలు జరుగుతున్నాయి. సంబంధిత రెండు ప్రాంతాల్లోనే 30వరకు అక్రమ గనుల తవ్వకాలు జరుగుత్నునట్లు నమస్తే తెలంగాణ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. తాండూర్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 15లో మొత్తం 338ఎకరాలు దాదాపు 30ఏండ్ల క్రితంది. మల్కాపూర్ గని కార్మిక సొసైటికీ ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఈ లీజు కాలం పూర్తయింది. సొసై టీ భూముల్లో అప్పట్లో గని కార్మిక సొసైటీలోని సభ్యులైన గ్రామానికి చెందిన కూలీలు, వడ్డేరులు నాపరాతి తవ్వకాలు జరుపుకొని జీవనోపాధి పొందారు. సొసైటీలో సుమారు 600 మందికి పైగా సభ్యులు కొనసాగుతున్నారు. లీజు కోసం సొసైటీ ప్రతినిధులు మరోసారి మైన్స్, రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి లీజు రాలేదు. అయితే కొంతమంది అక్రమార్కులు ఎలాంటి లీజు పొందకుండానే గని భూముల్లో పాగా వేసి దర్జాగా తవ్వేసుకుంటున్నారు. మల్కాపూర్ గ్రామ పరిధిలో 10వరకు అనధికారికంగా గనుల తవ్వకాలు జరుపుతున్నట్లు తెలిసింది. అదే విధంగా తాండూరు మండలంలోనే మరో గ్రామమైన ఓగిపూర్‌లోని సర్వే నెంబరు 129లో దాదాపు 83ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. అందు లో 54ఎకరాల వరకు లీజులు ఇచ్చారు. మిగితా వాటికి లీజలు ఇవ్వలేదు. ఓగిపూర్ పరిధిలో 20 వరకు అక్రమ గనుల తవ్వకాలు జరుగుతున్నట్లు పరిశీలనలో స్పష్టమైంది. ఈ రెండు గ్రామాల్లోని నాపరాయికి మార్కెట్లో డిమాండ్ బాగా ఉండడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు ఓగిపూర్ గ్రామ పరిధిలో లీజుకై 78దరఖాస్తులు, మల్కాపూర్ గ్రామ పరిధిలో లీజుకై 15 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. ఇవేకాకుండా పెద్దేముల్ మండలంలో సుద్ధ గనులు, వికారాబాద్, మోమిన్‌పేట్ మండలాల్లో ఎర్రమట్టిని అక్రమంగా తవ్వుకుంటూ ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు.

రూ. 94కోట్ల ఆదాయం...
జిల్లాలో మైనింగ్ లీజులైన పెద్ద తరహా, చిన్న తరహా గనుల ద్వారా గత ఆర్థిక సంవత్సరం రూ. 94కోట్లు రెవెన్యూ జిల్లా ఖజానాకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం కూడా నిర్దేశించిన లక్ష్యానికి మించి గనుల లీజుల ద్వారా ఆదాయం వస్తుందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా జిల్లాలోని పెద్దేముల్, మర్పల్లి, వికారాబాద్, పరిగి మండలాల్లో 610హెక్టార్ల విస్తీర్ణంలో 40ఎర్రమట్టి గనులున్నాయి. తాండూ రు మండలంలో 100హెక్టార్ల విస్తీర్ణంలో 160నాపరాయి గనులున్నాయి. పెద్దేముల్, మర్పల్లి, ధారూర్ మండలాల్లో 41 హెక్టార్ల విస్తీర్ణంలో 65సుద్ద గనులు, వికారాబాద్, దోమ మండలాల్లో 86హెక్టార్లలో 34కంకర గనులున్నాయి. తాండూరు మండలంలో 12హెక్టార్లలో 6గ్రానైట్ గనులుండడంతోపాటు దోమ మండలంలో 76హెక్టార్లలో 6పలుగురాళ్ల గనులున్నాయి.

మా దృష్టికి వస్తే సీజ్ చేస్తాం.. జిల్లా గనుల శాఖ ఏడీ రవీందర్
అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి తమ దృష్టికి వస్తే సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని జిల్లా గనుల శాఖ ఏడీ రవీందర్ తెలిపారు. ఓగిపూర్ గ్రామ పరిధిలో గతంలో అక్రమ గనుల తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే సీజ్ చేసినట్లు, ప్రస్తుతం మళ్లీ కొనసాగుతున్నట్లయితే రెవెన్యూ శాఖ అధికారులకు కూడా సమాచారమిచ్చి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. అక్రమంగా ఎక్కడైనా గనుల తవ్వకాలు జరుపుతున్నట్లు తెలిస్తే సమాచారమివ్వండి, చర్యలు తీసుకుంటాము.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...