పెరిగిన కంది సాగు


Sun,September 15, 2019 11:07 PM

-జిల్లాలో 55,403 హెక్టార్లలో పంట వేసిన రైతాంగం
-గత ఐదేండ్లుగా పెరుగుతూ వచ్చిన సాగు విస్తీర్ణం
-సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు సాధించవచ్చంటున్న శాస్త్రవేత్తలు

తాండూరు, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఐదేండ్లుగా కంది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. మద్దతు ధర ఆశాజనకంగా ఉండడం, కందిలో అంతర పంటలను సాగు చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఎక్కువ మంది రైతులు కందిపై మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ఈ ఏడాది ప్రకృతి మరింత అనుకూలించింది. ఖరీఫ్‌లో వర్షాలు ఆలస్యం కావడంతో మొక్కజొన్న, పత్తి, వరిసాగు తగ్గడంతో ఆ విస్తీర్ణం మొత్తం ఈ సంవత్సరం కంది అక్రమించి ముందెన్నడూ లేని విధంగా జిల్లాలో 55, 403 హెక్టార్ల కంది సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో దిగుబడి అంచనా కూడా పెరిగింది. కందిలో కలుపు పనులు పూర్తి కావడంతో పాటు ఎదుగుదలకు ఎరువులు వేయడంతో ఇటీవల కురిసిన వర్షంతో కంది పొలాలు ఏపుగా పెరిగాయి. జిల్లాలో రైతులు ఎక్కువగా కంది పంటను సాగు చేస్తున్నప్పటికీ పంటలో శనగపచ్చ పురుగు ప్రభావంతో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఏడాది రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ, తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలలో రైతులకు కంది సస్యరక్షణపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. శనగపచ్చ, మారుక మచ్చల పురుగు నివారణకు ముందస్తు చర్యలు, జాగ్రతలు తీసుకుంటే ఎలాంటి నష్టం వాటిల్లదని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్ర వేత్తలు సూచిస్తున్నారు.

తాండూరు డివిజన్‌లో అత్యధిక విస్తీర్ణంలో కంది సాగు
జిల్లాలోనే తాండూరు డివిజన్‌లో అత్యధిక విస్తీర్ణంలో కంది పంటను రైతులు సాగు చేస్తున్నారు. డివిజన్‌లోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దెముల్, కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట్ మండలాల్లో 45,307 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ప్రాంత రైతులు కంది పంటను సాగు చేస్తున్నారు. దశాబ్దం నుంచి కంది పంటకు శనగపచ్చ పురుగు ఉధృతి తీవ్రతరమైంది. తాజాగా మారుక మచ్చల పురుగు కూడా ఆశించి కంది రైతులను నష్టం చేస్తుంది. కంది పంట సాగు చేస్తున్న రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే పంట నష్టాల నుంచి గట్టెక్కి మంచి దిగుబడిని పొందుతారని తాండూరు వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డా. సుధాకర్ నమస్తే తెలంగాణతో వెల్లడించారు. శనగ పచ్చపురుగు, మరక మచ్చ పురుగు నివారణలో శాస్త్రవేత్తలు సూచించిన క్రిమిసంహారక మందులను కాకుండా మార్కెట్లో దొరికే వివిధ రకాల అధిక రేట్లు కలిగిన క్రిమిసంహారక మందులను పిచికారీ చేసి ఆర్థికంగా కూడా రైతులు నష్టపోతున్నారని తెలిపారు. తాజాగా కంది పంటకు ఒక రకమైన వైరస్ (స్టెరిలిటీ మొజాయిక్) తెగులు కొత్తగా సోకుతుందని చెప్పారు. దీని వల్ల కూడా కంది పంట సాగు చేస్తున్న రైతులకు నష్టాలు తలెత్తుతున్నాయని అందుకు తగు జాగ్రత్తలు పాటించాలని వివరించారు.

శనగ పచ్చ పురుగు గుర్తింపు లక్షణాలు..
తల్లి పురుగు లేత చిగుళ్లపై, పూ మొగ్గలపై లేత పిందెలపై విడివిగా లేత పసుపు రంగు గుడ్లను పెడుతుంది. గుడ్ల నుంచి వెలువడిన నార పురుగులు మొగ్గల్ని గోకి తింటూ తర్వాతి దశలో మొగ్గల్ని తొలచి కాయలోకి తలను జొప్పించి మిగిలిన శరీరాన్ని బయట ఉంచి లోపల గింజలను తిని డొళ్ల చేస్తాయి. పురుగు తిన్న కాయకు గుండ్రని రంధ్రాలు కనిపిస్తాయి.

నివారణ
-మోతాదు లీటర్ నీటికి ఎసిఫెట్ 75 శాతం యస్‌పీ 1.5 గ్రా. లేదా క్వినాల్ పాస్ 2.0 మి.లీ పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇండాక్సాకార్బ్ 1.0 మి.లీ లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 యస్‌సీ 0.3 మి.లీ వాడవచ్చు.
- ఫ్లూ బెండమైడ్ - 39.35 శాతం ఎస్‌సీ (నూనె మందు) ఎకరాకు 20 నుంచి 40మిల్లీ లీటర్లు 150 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే శనగ పచ్చ పురుగు ఉధృతి తగ్గుతుంది.

మారుక మచ్చల పురుగు నివారణకు..
మారుక మచ్చల పురుగు కూడా కంది పంటకు ఉధృతంగా వ్యాపిస్తుండటంతో నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పురుగు ఆశించిన పంట పొలాలు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ పురుగు సోకడం వల్ల ఆకులు పెరుగకపోవడమే కాక పూతపై కూడా ప్రభావం ఉంటుంది. ఈ పురుగు కంది పూతను, పిందెలపై కూడా లార్వాలను వ్యాప్తి చెందించి ఈ లార్వాలు పిందెలు, పూతను తినేస్తాయి. ఫలితంగా కంది పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీని నివారణకు మోతాదు లీటర్ నీటికి క్లోరోఫైరిపాస్ 2.5 మిల్లీ లీటర్ + డైక్లోరోవాస్ 1.0 మిల్లీ లీటర్లు కలిపి పిచుకారి చేయాలి. ఫ్లూబెండమైడ్ మందును కూడా దీని నివారణకు పిచికారీ చేసుకోవచ్చు.

తెగుళ్లతో మరిన్ని నష్టాలు..
శనగపచ్చ పురుగు, మారుక మచ్చ ఆకు పురుగులకు తోడు కంది పంటపై అక్కడక్కడా వైరస్ తెగుళ్లు కూడా సోకడంతో పంటకు మరింత నష్టం వాటిల్లుతుంది. స్టెరిలిటీ, ముజాయిక్ వైరస్ తెగులుగా లేదా గొడ్డు తెగులు, వెర్రి తెగులుగా పిలిచే ఈ వైరస్ తెగులు సోకడం వల్ల కంది పంట పూత, కాత లేకుండా పోయి ఆకులు పసుపురంగులోకి మారి పంట దిగుబడులు చాలా వరకు తగ్గే ప్రమాదం ఉంది. వైరస్ తెగులును గుర్తించిన వెంటనే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ తెగులు సోకిన మొక్కలను వెంటనే తొలగించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ తెగులు సోకితే ఆ ప్రదేశంలో ఉన్న 50 నుంచి 70 ఎకరాల పంటకు కూడా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని శాస్త్ర వేత్తలు వెల్లడించారు. తెగులు నివారణకు డైకోఫాల్ మందును ఎకరాకు 800 మిల్లీ లీటర్లు 150 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. ఎండు తెగులు ఆశించిన పొలాల్లో కూడా కంది పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. తెగులు నివారణకు మందులు లేవు. రైతులు ప్రధానంగా పొగాకు లేదా జొన్నతో పంట మార్పిడి చేయాలి. పొలాల్లో వర్షం నీరు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గొడ్డ తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది. పూత పూయదు. ఇలాంటి సందర్భంలో 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 4 మి.లీ డైకోఫాల్ మందులను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా తట్టుకునే ఐసీపీఎల్ 87119, ఐసీపీఎల్ 8506, బీఎస్‌యంఆర్ 736 వంటి రకాలను సాగు చేయాలి.

కంది పప్పుకు దేశంలో మంచి పేరు
జిల్లాలోనే అత్యధిక విస్తీర్ణంలో తాండూరు డివిజన్‌లో కంది పంట సాగు చేస్తున్నారు. అదేవిధంగా దేశంలో తాండూరు కందిపప్పుకు నాణ్యతతో పాటు మంచి పేరు ఉంది. దేశంలోని నలుమూలలకు తాండూరు కందిపప్పును ఎగుమతి చేస్తున్నారు. ప్రపంచ మార్కెట్‌లో తాండూరు కంది పప్పు అంటే చాలు ప్రజలు అట్టే కొనేస్తారు. మంచి టేస్టుతో పాటు నాణ్యత ఉండడంతో తాండూరులో తయారైన కందిపప్పుకు మార్కెట్‌లో అధిక గిరాకీ పలుకుతుంది.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...