చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలి


Wed,August 21, 2019 12:13 AM

వికారాబాద్‌ రూరల్‌ : ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కమాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్‌ పట్టణంలోని ముద్దవీరమల్లప్ప గార్డెన్‌లో బాలల హక్కుల పరిరక్షణ, గ్రామ పంచాయతీల పాత్ర అంశాలపై ఎంవీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కమాల్‌రెడ్డి మాట్లాడారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యాలను గుర్తించి సమావేశాలు నిర్వహించాలన్నారు. బాల్య వివాహాలు చేయకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సర్పంచ్‌లు పాఠశాలలను సందర్శించి అప్పుడప్పుడు తరగతులు నిర్వహిస్తే ఉపాధ్యాయుల్లో సైతం నూతనోత్తేజాన్ని నింపినవారమవుతారన్నారు. కార్యక్రమంలో జిల్లా చైల్డ్‌లైన్‌ కో ఆర్డినేటర్‌ వెంకటేశ్‌, సీఆర్‌పీఎఫ్‌ జిల్లా కార్యదర్శి జనార్దన్‌, ఎంవీఎఫ్‌ మండల ఇన్‌చార్జి వెంకటయ్య, ఎంవీఎఫ్‌ ఆర్గనైజర్‌ ఆశలత, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు పాల్గొన్నారు.

నాగసాన్‌పల్లికి బస్సు సౌకర్యం
కోట్‌పల్లి: గ్రామాలకు పల్లె వెలుగు బస్సులతో మెరుగైన సౌకర్యాలను కల్పించి, విద్యార్థులకు, ప్రజలకు రవాణా సమస్యలను దూరం చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. మంగళవారం మండలంలోని నాగసాన్‌పల్లికి వికారాబాద్‌ డిపో నుంచి ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 5కు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ ఎమ్మెల్యే రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. దీంతో నాగసాన్‌పల్లి ప్రజలకు, విద్యార్థులకు పెద్ద సమస్య తీరిందని చెప్పారు. ఇంతకాలం బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఆటోల్లో వికారాబాద్‌ పాఠశాలలకు వెళ్లాల్సి వచ్చేదని, ఆటోల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లేవారమని విద్యార్థులు చెబుతున్నారు. గ్రామానికి బస్సు రాకతో పూలు, కూరగాయలు, తదితర వ్యాపారస్తులకు సైతం ఇబ్బందులు దూరమయ్యాయని ప్రజలు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఎమ్మెల్యే ఆనంద్‌ ఆధ్వర్యంలో తమ గ్రామానికి బస్సును వేయడం సంతోషంగా ఉందని సర్పంచ్‌ పద్మనాగార్జునరెడ్డి చెప్పారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...