రూ. 30.39 లక్షల ఆదాయం


Tue,August 13, 2019 11:59 PM

-నూతన ఇసుక విధానంతో ప్రభుత్వానికి రాబడి
-జిల్లాలో రెండేండ్లుగా ఏడు రీచ్‌లలో విక్రయాలు
-త్వరలో ట్రాక్టర్లకు జీపీఎస్ విధానం అమలుకు జిల్లా యంత్రాంగం కసరత్తు
-అక్రమ రవాణా తగ్గి.. ఆదాయం పెరిగే అవకాశం
-జిల్లాలో 95వేల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన నూతన ఇసుక విధానంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం చేకూరుతుంది. ముఖ్యంగా ఇసుక రీచ్‌ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రెవెన్యూ పెరిగింది. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకుగాను ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానం సక్సెస్‌ఫుల్ అయ్యింది. ప్రభుత్వం ద్వారా అన్ని జిల్లాల్లో ఇసుక లభించే ప్రాంతాలను గుర్తించి ఇసుక విక్రయాలను నిర్వహిస్తుంది, జిల్లాలో ఇసుక రీచ్‌లకు సంబంధించి ఏడు ఇసుక లభ్యత ప్రాంతాలను గుర్తించి ఇసుకను విక్రయిస్తున్నారు. సంబంధిత ఇసుక రీచ్‌లతో జిల్లా ఖజానాకు ఆదాయం రావడంతోపాటు అక్రమ ఇసుక రవాణాకు కొంతమేర అడ్డుకట్ట పడిందనే చెప్పవచ్చు. అంతేకాకుండా అక్రమ ఇసుక రవాణాకు పూర్తిగా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇసుక రీచ్‌ల ద్వారా తరలించే ట్రాక్టర్లకు జీపీఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించింది, అయితే గతంలోనే ట్రాక్టర్లకు జీపీఎస్ విధానాన్ని అమలుచేసేందుకు నిర్ణయించినప్పటికీ పలు కారణాలతో పెండింగ్‌లో ఉండడంతో త్వరలోనే అమలుచేసే విధంగా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తుంది. అదేవిధంగా ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలకు ఆటంకం కలుగని ప్రాంతాల్లో, పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేని ప్రాంతాలను మాత్రమే గుర్తించి ఇసుక తవ్వకాలను నిర్వహిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇసుక విక్రయాలతో వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని స్థానిక సంస్థల అభివృద్ధి కోసం కూడా ఖర్చు చేస్తున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా సుమారు 95 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలున్నట్లు మైనింగ్ అధికారులు గుర్తించారు.

ఏడు రీచ్‌లతో భారీగా ఆదాయం...
జిల్లాలో ఏడు ఇసుక రీచ్(ఇసుక లభ్యత ప్రాంతాలు)లు ఉన్నాయి. ఇసుక లభ్యత ప్రాంతాలకు సంబంధించి సర్వే నిర్వహించిన సంబంధిత అధికారులు జిల్లావ్యాప్తంగా ఏడు ఇసుక లభ్యత ప్రాంతాలను గుర్తించి విక్రయిస్తున్నారు. బషీరాబాద్ మండలంలోని నవాంగి, గంగ్వార్, పెద్దేముల్ మండలంలోని రేగొండి, కొండాపూర్, తాండూరు మండలంలోని పాత తాండూరు, ఖాంజాపూర్, వీరిశెట్టిపల్లిలలో ఇసుక రీచ్‌లను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇసుక రీచ్‌ల ద్వారా ట్రాక్టర్‌కు రూ.1800ల మేర ఇసుకను విక్రయిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇసుక పాలసీని ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 1900 ట్రాక్టర్ల మేర ఇసుక విక్రయాలు జరిగాయి. ఈ ఇసుక విక్రయాలతో గత రెండేండ్ల నుంచి ఇప్పటివరకు రూ.30.39 లక్షల ఆదాయం జిల్లా ఖజానాకు చేరింది. తాండూరు మండలంలోని పాత తాండూరు, ఖాంజాపూర్, వీరిశెట్టిపల్లి ప్రాంతాల్లోని రీచ్‌ల ద్వారా రూ.20.98 లక్షలు, పెద్దేముల్ మండలంలోని రేగొండి, కొండాపూర్ ప్రాంతాల్లోని రీచ్‌ల ద్వారా రూ.3,45,600ల ఆదాయం, బషీరాబాద్ మండలంలోని నవాంగి, గంగ్వార్ ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌ల ద్వారా రూ.5,95,200 ఆదాయం జిల్లా ఖజానాకు వచ్చి చేరింది. అదేవిధంగా జిల్లాలో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇసుక విక్రయాలను జరిపినప్పటికీ అక్రమ ఇసుక రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. కాగ్నా నది పరివాహాక ప్రాంతంతోపాటు జిల్లాలోని పలు మండలాల్లో యథేచ్ఛగా అక్రమంగా ఇసుకను తరలించడంతో జిల్లా ఖజానాకు నష్టం జరుగుతుంది.

కాగ్నా పరివాహాక ప్రాంతంలోని మంతటి, రెడ్డి ఘణాపూర్, ఎక్‌మయి, మైల్వార్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. అదేవిధంగా పెద్దేముల్, కులకచర్ల, యాలాల మండలాల్లోనూ జోరుగా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. ఇసుకను తరలించే ట్రాక్టర్లపై నిఘా పెట్టేందుకుగాను జీపీఎస్ విధానాన్ని అమలుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి ఏడాది అయినప్పటికీ జిల్లాలో ఇప్పటికి అమల్లోకి రాలేదు. అయితే అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకుగాను ఇసుక తరలించే అన్ని ట్రాక్టర్లకు జీపీఎస్ యంత్రాలను అమర్చేందుకు నిర్ణయించడంతో పాటు పలు ట్రాక్టర్లకు జీపీఎస్ యంత్రాలను కూడా అమర్చడం జరిగింది. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా పెండింగ్‌లో పెట్టడం జరిగింది. ట్రాక్టర్లకు జీపీఎస్‌ను అమర్చేందుకుగాను ట్రాక్టర్ల యజమానులు రూ.10 వేలు చెల్లించడంతోపాటు రూ.25 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌గా కొందరు ట్రాక్టర్ల యజమానులు ఇప్పటికే చెల్లించారు. అదేవిధంగా పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అమలుచేస్తున్న ఇసుక ట్యాక్సీ విధానాన్ని త్వరలో జిల్లాలోనూ అమలుచేసేందుకు జిల్లా యంత్రాంగం యోచిస్తున్నట్లు తెలిసింది. ఆఫ్‌లైన్ విధానంలో కొనసాగుతున్న ఇసుక విక్రయాలు ఇసుక ట్యాక్సీ విధానం అమల్లోకి వస్తే పూర్తిగా ఆన్‌లైన్‌లో ఇసుక విక్రయాలు నిర్వహించేందుకు నిర్ణయించినా... అమల్లోకి తీసుకరాలేకపోయారు. దీంతో అక్రమ ఇసుక రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతుండడంతో త్వరలో స్యాండ్ ట్యాక్సీ విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇసుక ట్యాక్సీ అమల్లోకి వస్తే సామాన్యులకు సరసమైన ధరకు లభించడంతోపాటు వినియోగదారులు ఇసుక కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసిన వెంటనే సంబంధిత అధికారికి సమాచారం వెళ్తుందని, ఎక్కడి నుంచి బుక్ చేశారో తెలుసుకొని ఆయా రీచ్‌ల నుంచి ఇసుకను తరలించనున్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...