చెరువులోకి నీరొచ్చేదెలా?


Sat,August 10, 2019 11:07 PM

బొంరాస్‌పేట : బొంరాస్‌పేట పెద్ద చెరువులోకి వరద నీరు వచ్చే ఏకైక పాటు కాలువ ఏటి కాలువ. ఈ ఏటి కాలువ ద్వారా వరద నీరు వచ్చి చెరువు నిండితేనే రైతులకు బతుకుదెరువు. అలాంటి జీవనాధారమైన చెరువులోకి వరదనీరు రాకుండా అడ్డంగా మట్టిని పోశారు ఆర్ అండ్ బీ అధికారులు. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తే ఏటి కాలువ ద్వారా వరద నీరు వచ్చి పెద్ద చెరువులోకి చేరుతుంది. కానీ చెరువులోకి వరదనీరు రాకుండా మట్టి కుప్పలు అడ్డుగా ఉన్నాయి. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నా మట్టి అడ్డుగా ఉండటంతో వరద నీరు చెరువులోకి రావడం లేదు. ఈ విషయమై అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా వంతెలను పునర్నిర్మించారు.

ఈ క్రమంలో ఏటి కాలువపై ఉన్న వంతెనను కూడా వెడల్పు చేశారు. ఈ నిర్మాణ పనుల్లో తవ్విన మట్టిని కాలువకు ఎగువన, దిగువన అలాగే ఉంచారు. వరద నీరు చెరువులోకి రాకుండా అడ్డంగా ఉన్న మట్టి కుప్పలు తొలగించకుండా అలాగే వదిలేశారు. వర్షాలు కురుస్తున్నందున కాలువకు అడ్డంగా ఉన్న మట్టిని తొలగించాలన్న ధ్యాస సంబంధిత కాంట్రాక్టరు, అధికారులకు లేకపోవడం గమనార్హం. రెండు రోజుల కిందట రైతులే వెళ్లి కొద్దిగా మట్టిని తొలగించారు. అయినా ఇంకా చాలా మట్టి కాలువకు అడ్డుగానే ఉంది. మట్టి అడ్డంగా ఉండిపోవడంతో వరద నీరు కాలువలో నిలిచిపోయి కాలువ తెగిపోయే అవకాశం ఉంది. గత ఏడాది వర్షాలు లేక పెద్ద చెరువు పూర్తిగా ఎండిపోయింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు రైతుల్లో ఆశలు నింపుతున్నాయి. సంబంధిత అధికారులు, కాంట్రాక్టరు స్పందించి ఏటి కాలువలో వరద నీరు రాకుండా అడ్డంగా ఉన్న మట్టిని తొలగించాలని రైతులు కోరుతున్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...