మున్సిపల్.. పవర్ ఫుల్


Fri,July 19, 2019 11:52 PM

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మున్సిపల్ కొత్త చట్టానికి శాసనసభ ఆమోదం తెలిపింది. మున్సిపాలిటీల్లో అవినీతిరహిత పాలన అందించడంతోపాటు ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన మున్సిపల్ చట్టాన్ని రూపొందించింది. శాసనసభలో కొత్త మున్సిపల్ చట్టాన్ని గురువారం సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టగా, శుక్రవారం కొత్త చట్టంలోని అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించిన అనంతరం శాసనసభ నూతన పురపాలక చట్టానికి ఆమోదం తెలిపింది. అదేవిధంగా కొత్త చట్టంతో రాజకీయ జోక్యం తగ్గి ప్రజలకు సేవలు పారదర్శకంగా అందనున్నాయి. అంతేకాకుండా నూతన చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసేందుకుగాను కలెక్టర్లకు విచక్షణాధికారాలను కట్టబెట్టనున్నారు. అయితే అక్రమ లే అవుట్లకు, అక్రమ కట్టడాలను ఇకపై కళ్లెం వేసే విధంగా నూతన పురపాలక చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. అదేవిధంగా రాష్ట్రమంతా పచ్చదనంతో పరిఢవిల్లేలా కలెక్టర్లు, జిల్లా అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గ్రీన్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ జిల్లాలోని అనంతగిరిని ప్రస్తావించడంతోపాటు తిరిగి అనంతగిరికి పూర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు.

కలెక్టర్లకు ఫుల్ పవర్స్...
నూతన మున్సిపల్ చట్టంలో జిల్లా కలెక్టర్లకు విచక్షణాధికారాలను కల్పిస్తూ ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చింది. గతంలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్, పాలకవర్గం మాత్రమే మున్సిపాలిటీల్లో ఏ నిర్ణయమైనా తీసుకునేవారు. ప్రతి లేఅవుట్‌కు ఎంతో కొంత డబ్బులు వసూలు చేసేవారు. డబ్బులివ్వని లేఅవుట్లు అనుమతి పెండింగ్‌లోనే ఉండేది, నిబంధనల మేరకు లే అవుట్ లేకపోయినప్పటికీ ఎంతోకొంత ముట్టజెప్పితే చైర్మన్, పాలకవర్గం, కమిషనర్ కుమ్మక్కై అనుమతిచ్చేవారు. ఈ తతంగమంతా ఇకపై జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలను కల్పిస్తూ నిర్ణయించారు. లేఅవుట్లకు అనుమతిని గతంలో మాదిరిగా మున్సిపాలిటీ ఇవ్వడం కాకుండా ఇకపై జిల్లా కలెక్టర్లే ఇవ్వనున్నారు. లే అవుట్ల అనుమతి అధికారం కలెక్టర్లకు ఇవ్వడంతో ఇక అవినీతికి తావులేకుండా పారదర్శకంగా జరుగనుంది. అంతేకాకుండా నూతన చట్టంలో పేద ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. ఇంటి నిర్మాణానికి అనుమతులను చాలా వరకు ఆన్‌లైన్‌లో తీసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. 75 చదరపు గజాలలోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదని, సంబంధిత ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్ ఫీజును రూ.1గా నిర్ణయించారు. అయితే 75 చదరపు గజాలలోపు నిర్మించుకున్న ఇంటికి పన్నును రూ.100లుగా నిర్ణయించడం జరిగింది. మరోవైపు 500 చదరపు మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణాలకు సంబంధించి అనుమతుల కోసం ఎవరూ మున్సిపాలిటీలకు పోవాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే 25 రెట్లు అదనంగా జరిమానా విధించడంతోపాటు అక్రమ నిర్మాణం అని తేలితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయనున్నారు. యజమానులే ఇంటి నిర్మాణానికి సంబంధించి సెల్ఫ్ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని, ఇంటి కొలతలు ఇతర తప్పుడు సమాచారం ఇస్తే భారీగా జరిమానాలను కూడా ఇకపై విధించనున్నారు.

అసెంబ్లీలో అనంతగిరి ప్రస్తావన...
నూతన మున్సిపల్ చట్టంపై చర్చ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని అనంతగిరికి సంబంధించి అసెంబ్లీలో ప్రస్తావించారు. పచ్చదనం అంశంపై మాట్లాడుతూ అనంతగిరిని ప్రస్తావిస్తూ అనంతగిరి కా హవా, లాకో మారిదొంకా దవా అని దేశమంతా నానుడి ఉండేదని కానీ ప్రస్తుతం అడవులు అంతరించిపోవడంతో గతంలో ఉన్న పరిస్థితి ప్రస్తుతం అనంతగిరి ప్రాంతంలో లేదని కానీ తిరిగి అనంతగిరికి పూర్వవైభవం తీసుకువస్తామని సీఎం అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చదనం పరిఢవిల్లేలా గ్రీన్‌కవర్ పాలసీని తీసుకువస్తామని, ఇకపై పట్టణాలు, పల్లెల్లోనూ గ్రీన్ పాలసీని అమలుచేస్తామన్నారు. అంతేకాకుండా కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గ్రీన్ పాలసీ కమిటీని నియమించనున్నట్లు, అంతేకాకుండా హరితహారం లక్ష్యాలపై నిర్లక్ష్యం వహించే అధికారులను ఉద్యోగాల నుంచి తొలిగిస్తామని, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మొక్కల సంరక్షణ బాధ్యత సర్పంచ్‌లదేనని, పంచాయతీ కార్యదర్శులపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...