పట్టా పాసుపుస్తకాలు వెంటనే అందించాలి


Fri,July 19, 2019 11:47 PM

వికారాబాద్ రూరల్ : నూతన పట్టా పాసు పుస్తకాలను పట్టాదారులకు వెంటనే అందించి, వారికి కార్యాలయాల చుట్టూ తిప్పుకునే పద్ధతికి స్వస్తి పలకాలని కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు . నిత్యం భూ సమస్యలతో సతమతం అయ్యే ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికారాబాద్ రెవెన్యూ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. పట్టా పాసుపుస్తకాల పనులను త్వరగా పూర్తి చేయాలని వీఆర్వోలకు సూచించారు. వీఆర్వోలు నిత్యం ప్రజల మధ్యలో, గ్రామాల్లో ఉండాలని తెలిపారు. గ్రామల్లో ఉంటే గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలు త్వరగా తెలుసుకొని పరిష్కరించేందుకు సులభంగా ఉంటుందన్నారు. పట్టా పాసు పుస్తకాలు ప్రింట్ అయ్యి వచ్చిన వెంటనే అందిచాల్సిన బాధ్యత వీర్వోలపై ఉందన్నారు. అధికారులు పట్టా పాసు పుస్తకాలను తమ వెంట పెట్టుకుని ప్రజలను తిప్పుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విరాసత్‌లో ఉన్న భూములను పంచనామా చేసి త్వరగా అందిస్తే వారికి ప్రభుత్వం నుంచి వచ్చే రైతుబంధు, రైతు బీమాల పథకాలను కోల్పోకుండా ఉంటారన్నారు. గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ఫీల్డ్ విజిట్ చేయడం లేదని అన్నారు . పట్టా పాసుపుస్తకాలు అందించే క్రమంలో రూల్స్ ప్రకారం చేయాలని తెలిపారు. వికారాబాద్ రెవెన్యూ కార్యాలయం పై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించి ఆదర్శంగా నిలువాలని తెలిపారు. అధికారులు బయట కాలక్షేపం చేయకుండా కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ యాదయ్య, ఆర్‌ఐ చంద్రమౌళి , వివిధ గ్రామాల వీఆర్వోలు ఉన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...