ఇష్టారాజ్యం


Fri,July 19, 2019 02:27 AM

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో కొందరు తహసీల్దార్ల తీరు జిల్లా అంతటా తీవ్ర చర్చానీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ సదుద్దేశంతో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకొని రూ.కోట్లలో అవినీతికి పాల్పడుతున్నారు. ప్రజల భూ సమస్యలను పరిష్కరించాల్సింది పోయి డబ్బులిస్తేనే పనులు చేస్తామంటూ తెగేసి చెబుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు. వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా,...ఏ మాత్రం పట్టించుకోకుండా లంచాలకు ఎగబడుతున్నారు. పేద రైతులనే జాలి చూపించకుండా లంచాలు వసూలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎవరైనా నిలదీస్తే మాకు ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొండంటూ తెగేసి చెబుతున్నారు. జిల్లాలో కొందరు తహసీల్దార్లు అయితే లంచాలే లక్ష్యంగా తమ విధులను నిర్వహిస్తున్నారు. అయితే సంబంధిత అవినీతి తహసీల్దార్లు ఒక్కొక్కరు ఒక్కొ తీరులో అవినీతికి పాల్పడుతూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే తహసీల్దార్ల అవినీతికి కొందరు వీఆర్వోలు సహకరిస్తూ డబ్బులు వసూలు చేసి లంచాలు పంచుకుంటున్నట్లు వినిపిస్తుంది. అయితే నేరుగా ఇంట్లోనే ధరణి వెబ్‌సైట్ కార్యకలాపాలు నిర్వహిస్తూ, డబ్బులు ముట్టజెప్పిన వారి పనులు పూర్తి చేస్తూ పేద ప్రజలు తమ భూ సమస్యల పరిష్కారం కోసం ఏండ్లుగా తిరుగుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అయితే ప్రధానంగా జిల్లాలోని పరిగి, మోమిన్‌పేట్, వికారాబాద్ తసీల్దార్లపై వందల సంఖ్యలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతోపాటు ఫిర్యాదుల ఆధారంగా వీరిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు కూడా నిఘా పెట్టినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే ఒకసారి ఏసీబీ కేసు నమోదైన మోమిన్‌పేట్ తహసీల్దార్ అవినీతిలీలలు ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీతో వెలుగులోకిరాగా, పరిగి తహసీల్దార్ అవినీతిపై ప్రజలు, సీపీఎం నేతలు పలుమార్లు ధర్నా కూడా చేశారు. అదేవిధంగా యాలాల మండల తహసీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వికారాబాద్ తహసీల్దార్ తీరు ఏ మాత్రం మారకపోగా మరింత రెచ్చిపోయి లంచాలకు ఎగబడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే మోమిన్‌పేట్ తహసీల్దార్ అవినీతిపై స్పందించిన కలెక్టర్ గురువారం ఆమెకు షోకాజు నోటీసులు జారీ చేశారు. సంబంధిత తహసీల్దార్లపై ఇన్ని ఫిర్యాదులు వస్తున్నా,...వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే మరోవైపు మరో ఒకట్రెండు రోజుల్లో తహసీల్దార్లపై చర్యలు తీసుకునేందుకుగాను జిల్లా ఉన్నతాధికారులు యోచనలో ఉన్నట్లు తెలిసింది. మొన్న కేశంపేట తహసీల్దార్ అవినీతి ఘటన వెలుగులోకి వచ్చినప్పటికీ అవినీతి తహసీల్దార్ల తీరులో ఏ మాత్రం మార్పు రాకపోవడంపై,...తహసీల్దార్ల అధికారాలు పూర్తిగా రద్దయ్యేలా కొత్త రెవెన్యూ చట్టం తేవాల్సిందేనని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మోమిన్‌పేట్, పరిగి, వికారాబాద్ తహసీల్దార్ల తీరే వేరు
లంచాలు వసూలు చేయడంలో జిల్లాలోని పరిగి, మోమిన్‌పేట్, వికారాబాద్ తహసీల్దార్ల తీరే వేరంటున్నారు స్థానిక ప్రజలు. ఒక్కొక్కరు ఒక్కొ తీరులో లంచాలు వసూలు చేస్తున్నారు. సంబంధిత ముగ్గురు తహసీల్దార్లు ఇంటినే లంచాలకు కేంద్రంగా చేసుకొని అవినీతికి పాల్పడుతున్నారు. ఒక తహసీల్దార్ తమ లంచాలను వసూలు చేసేందుకు వీఆర్వో సహకారం తీసుకుంటే, మరో తహసీల్దార్ సూపరింటెండెంట్ సహకారం తీసుకుంటూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనతోపాటు భూముల ధరలు రూ.కోట్లకు పడగలెత్తడంతో ఇదే అవకాశంగా తీసుకొని ఒక్కొ తహసీల్దార్ రూ.కోట్లలో సంపాదించారు. లంచాలకు అలవాటుపడిన ఓ తహసీల్దార్ ఏకంగా ప్రభుత్వ భూమికే ఎసరు పెడు తూ తప్పుడు ఎన్‌వోసీలు ఇస్తున్నారు. ఇలా దొరికినంతా దోచుకుంటూ చిన్న సమస్య పరిష్కారానికి కూడా ఏండ్ల తరబడి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. సంబంధిత ముగ్గురు తహసీల్దార్లపై వందల సంఖ్యలో ప్రజల నుంచి ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే ముఖ్యంగా మోమిన్‌పేట్ తహసీల్దార్‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పట్టాదారు పాసు పుస్తకాల జారీకి, కల్యాణలక్ష్మి పథకం చెక్కు రావాలంటే తప్పనిసరిగా లంచమిస్తేనే పని పూర్తి చేస్తారని తహసీల్దార్‌పై ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా మోమిన్‌పేట్ తహసీల్దార్ ఏకంగా హైదరాబాద్‌లోని తన ఇంటినే లంచాలకు కేంద్రంగా చేసుకున్నట్లు, అక్కడే ధరణి వెబ్‌సైట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత తహసీల్దార్ కార్యాలయ సిబ్బందే చెబుతున్నారు. అంతేకాకుండా సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆపరేటర్ కూడా రోజూ విధులను హైదరాబాద్‌లోని తహసీల్దార్ ఇంట్లోనే నిర్వహిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. వారానికి ఒకరోజు మాత్రమే తహసీల్దార్ కార్యాలయానికి వస్తూ మిగతా రోజుల్లో హైదరాబాద్‌లోనే ఉంటూ ఎవరైతే డబ్బులు ముట్టజెప్పుతారో వారి భూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రోజు మా సమస్యలు ఎందుకు పరిష్కరించరని ఎవరైన ప్రజలు నిలదీసి అడిగితే నాకు ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయి, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ తెగేసి చెబుతున్నారని తహసీల్దార్‌పై ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా మోమిన్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ తీరు మరో విధంగా ఉంది. సంబంధిత డిప్యూటీ తహసీల్దార్ మహిళా వీఆర్‌ఏలను దుర్భాషలాడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు మండల వీఆర్‌ఏలు బుధవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. అదేవిధంగా పరిగి తహసీల్దార్ వ్యవహరం మరోలా ఉంది. ఇక్కడ తహసీల్దార్ భర్త చెప్పిందే వేదం, అతను తహసీల్దార్ షాడోలా తహసీల్దార్ అధికారాలతో అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే నేరుగా ప్రతీ విషయంలోనూ పరిగి తహసీల్దార్ భర్త ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడంపై సర్వత్రా చర్చా జరగడం, తహసీల్దార్‌పై అధిక సంఖ్యలో ఫిర్యాదులు, అవినీతి ఆరోపణలు రావడంతో స్థానిక ప్రజలు నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే తహసీల్దార్‌ను మందలించి పంపించడంతో ప్రస్తుతం ప్రత్యక్షంగా తహసీల్దార్ భర్త జోక్యం తగ్గినప్పటికీ లంచాలకు మరో కొత్త దారిని వెతుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఏండ్లుగా తిరుగుతున్నా పరిష్కారంకాని సమస్యలు కూడా తహసీల్దార్ భర్త చిట్టీ రాసిస్తే సంబంధిత భూ సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది. నేరుగా తహసీల్దార్ కార్యాలయంలోనే ఉంటూ కార్యకలాపాలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు రావడంతో ప్రస్తుతం తహసీల్దార్ భర్త రాసిన చిట్టీ ఆధారంగా పనులు చేస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒక్కో పనిని బట్టి డబ్బులను నిర్ణయిస్తూ, డబ్బులిస్తేనే పని పూర్తి చేయాలని చిట్టీ రాస్తూ వస్తున్నారు తహసీల్దార్ భర్త. మరోవైపు వికారాబాద్ తహసీల్దార్‌కు సంబంధించి,...ఆంధ్రా ప్రాంతానికి చెందిన సంబంధిత తహసీల్దార్ వికారాబాద్‌లో నివాసముంటున్న ఇంటిని కేంద్రంగా చేసుకొని అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో చర్చలు సఫలమైతే రాత్రికి ఇంట్లో పని పూర్తి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే లంచాలను కొందరి వద్ద నేరుగా, కొత్త వ్యక్తులయితే డబ్బులు వసూలు చేసేందుకు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్‌తో పాటు ఓ వీఆర్వోతో డబ్బులు వసూలు చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...